యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 'సుదర్శన నారసింహ హోమం'ను ఆలయ అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానాలయ ఉత్తర రాజగోపురం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణీకుల పారాయణాల నడుమ సుదర్శన హోమాన్ని అర్చకులు నయనానందకరంగా జరిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ లోకకల్యాణార్థం, ప్రజల శ్రేయస్సు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సుదర్శన నారసింహ హోమం నిర్వహించామని తెలిపారు.