కరువు రహిత ప్రాంతంగా ఆలేరును తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గాన్ని కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం యాదగిరిగుట్టలో గోదావరి జలాలతో నిండి అలుగుపోస్తున్న నల్లచెరువుకు గ్రామస్తులతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. భూగర్భ జలాలు అడుగంటుకపోవడంతో సాగు, తాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నియోజకవర్గ తలాపునే గోదావరి నీళ్లున్నా.. మాజీ సీఎం కేసీఆర్ స్వార్థం, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అసమర్థత కారణంగా ఆలేరు ప్రజలు చుక్క నీటికి కూడా నోచుకోలేకపోయారని విమర్శించారు. ఆలేరు ప్రజల ఓట్లతో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గొంగిడి సునీత.. తన ఆస్తులు పెంచుకున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. 

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుధాహేమేందర్ గౌడ్, కౌన్సిలర్ మల్లేశ్ యాదవ్, పీఏసీఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలేందర్ రెడ్డి పాల్గొన్నారు.