నారసింహుడి సేవలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్ పర్సన్ తూరుపు నిర్మలాజగ్గారెడ్డి బుధవారం దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేసి ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. మొదట ఆలయానికి వచ్చిన ఆమెకు అర్చకులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు.

అనంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. అంతకుముందు స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆమెకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు కప్పి బొకేలు ఇచ్చి సన్మానించారు. ఆమె వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, జిల్లా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.