నారసింహుడిని దర్శించుకున్న ఎస్ఈసీ

  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ ఆఫీసర్లు 

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నరసింహస్వామిని దర్శించుకుని ముఖమంటపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

తూర్పు రాజగోపురం నుంచి త్రితల గోపురం ద్వారా ఆలయంలోకి చేరుకున్న ఆమెకు మహాద్వారం వద్ద ఆలయ ఈవో భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ప్రధానాలయంలోకి చేరుకుని మొదట స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి గర్భగుడిలోకి వెళ్లారు.

గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి దాదాపుగా 15 నిమిషాలపాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మంటపంలో ఆమెకు అర్చకులు, వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు నారసింహుడి లడ్డూప్రసాదం, శేషవస్త్రాలు అందజేసి స్వామివారి మెమొంటోతో బహూకరించారు.