కోత పెడితే మిల్లులు సీజ్​చేస్త

  • మిల్లర్లకు కలెక్టర్​హెచ్చరిక
  • ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లతో  టెలీకాన్ఫరెన్స్​
  • తేమ పేరుతో కోతలపై సీరియస్​
  • ట్యాబ్​ఎంట్రీ లేట్​పై సొసైటీలకు వార్నింగ్​

యాదాద్రి, వెలుగు : వడ్ల కొనుగోలు, అన్​లోడ్​పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు, సొసైటీల సభ్యులపై యాదాద్రి జిల్లా కలెక్టర్​ ఎం.హనుమంతరావు సీరియస్​అయ్యారు. తేమ పేరుతో కోతలు విధిస్తే మిల్లులను సీజ్​ చేస్తానని హెచ్చరించారు. వడ్ల కాంటా పెట్టిన తర్వాత ట్యాబ్​ ఎంట్రీ ఎందుకు చేయడం లేదని సొసైటీ సభ్యులను కలెక్టర్​ ప్రశ్నించారు.  

వడ్ల కొనుగోలు సెంటర్ల తనిఖీ..

వడ్ల కొనుగోలు సెంటర్లను కలెక్టర్​ ఎం.హనుమంతరావు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా భూదాన్​ పోచంపల్లి మండలంలోని పలు సెంటర్లలో కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సెంటర్లకు వడ్లు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టడం లేదని తెలిపారు. కాంటా పెట్టి మిల్లులకు వెళ్లిన తర్వాత తూకంలో కోత విధిస్తున్నారని చెప్పారు. వడ్ల కాంటా వేసి రోజులు గడుస్తున్నా బిల్లులు రావడం లేదన్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. 

స్పీడప్​ చేయాలి..

సెంటర్ల విజిట్ అనంతరం మిల్లర్లు, సెంటర్​ఇన్​చార్జిలు, సొసైటీల సభ్యులతో కలెక్టర్ హనుమంతరావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వడ్ల కొనుగోళ్లు స్పీడప్​చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తేమ పేరుతో మిల్లర్లు కోతలు విధిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కోత విధించకుంటే లారీని అన్​లోడ్​ చేసుకోమని బెదిరించడం ఏంటని ఆయన సీరియస్ అయ్యారు. వడ్లను అన్​లోడ్​చేసుకోకుంటే 'మిల్లును సీజ్​ చేస్తా' అని హెచ్చరించారు.

 తేమ, తాలు సమస్య తన దృష్టికి తీసుకొని రావాలని, ఆ పేరుతో కోతలు విధించడం సరికాదన్నారు. అనంతరం ట్యాబ్​ఎంట్రీలు ఎందుకు లేట్ చేస్తున్నారని సొసైటీల సభ్యులను ప్రశ్నించారు. ట్యాబ్​ఎంట్రీ లేట్​చేయడం వల్ల వడ్ల పైసలు ఆలస్యం అవుతాయన్న విషయం తెలియదా..? అని నిలదీశారు. వడ్లు కొనుగోలు ప్రక్రియ ముగియగానే వెంటవెంటనే లారీల్లో మిల్లులకు తరలించాలని, లేకుంటే సెంటర్ ఇన్​చార్జిలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాబ్ ఎంట్రీ వెంటనే చేయాలని ఆదేశించారు.  

46 వేల టన్నుల కొనుగోలు..

కొత్త సీఎంఆర్​ పాలసీకి మిల్లర్లు అంగీకరించి, 10 శాతం బ్యాంక్​గ్యారెంటీ ఇవ్వడానికి ఒప్పుకోవడంతో యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలు స్పీడ్ అందుకుంది. దసరా పండుగకు ముందు సెంటర్లు ఓపెన్​ చేసినా మిల్లులకు సీఎంఆర్​ కేటాయించకపోవడంతో ఈనెల 4 వరకు కేవలం 4 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మిల్లర్లకు సీఎంఆర్ కేటాయించడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ ఐదారు రోజుల్లోనే 46 వేల టన్నుల వడ్లను కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు.