రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకి వెళ్లలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే మీ ఇంట్లోనే ఇలా పూజ చేశారంటే అయోధ్య వెళ్ళి రాముడిని దర్శించుకున్న పుణ్యం మీకు దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అందరి కల సాకారం కాబోతుంది . యావత్ దేశం అంతటా రామ నామ స్మరణతో మారుమోగిపోతుంది. జనవరి 22, 2024 చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు. ఈ ప్రత్యేకమైన రోజు అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది.
ప్రాణ ప్రతిష్ఠ వేడుకని కనులారా వీక్షించాలని అందరూ ఆశ పడతారు కానీ అది సాధ్యపడదు. కానీ అయోధ్య వెళ్ళకుండానే అయోధ్య రాముడి ఆశీస్సులు మీరు పొందవచ్చు. ఇప్పటికే అందరికీ రామాలయానికి సంబంధించిన అక్షితలు అందరి ఇళ్లకి చేరుకున్నాయి. అయోధ్య వెళ్లకుండానే ఇంట్లో రాముని విగ్రహానికి ఇలా పూజ చేయడం చేసుకోవచ్చు. ఈ పూజా విధానం అనుసరిస్తే అయోధ్య రాముని అనుగ్రహం పొందుతారు.
పూజా విధానం
జనవరి 22న వేకువజామున నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించాలి. మీ ఇంట్లోని పూజా మందిరంలో ఇక పీఠం వేసి దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరాముని ప్రతిమని దాని మీద పెట్టాలి. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. పూజ చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చోవాలని విషయం మాత్రం మరవద్దు. ధూపం, ధీపం వేయాలి. రాముని అనుగ్రహం పొందటం కోసం పుష్పాలు సమర్పించాలి. స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి. శ్రీరామునితో పాటు ఆయన పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించడం మంచిది.
ఈ పవిత్రమైన రోజున రామ చరిత మానస్, శ్రీరామ రక్ష స్త్రోత్రం, సుందర కాండని పారాయణం చేయడం వల్ల పుణ్య ఫలం దక్కుతుందనిచ పండితులు చెబుతున్నారు. అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలు మొత్తం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు దూరదర్శన్ చానెల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అక్కడ వేద పండితులు చెప్పే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన అక్షితలు ఇంటింటికీ పంచారు. పూజ సమయంలో పండితులు చెప్పినప్పుడు ఆ అక్షితలు ఇంట్లో అందరూ తల మీద వేసుకోవడం వల్ల శ్రీరాముడు ఆశీర్వాదం పొందిన వాళ్ళు అవుతారు. ఇలా ఇంట్లోనే రాముని విగ్రహం ప్రతిష్టించి పూజించడం వల్ల అయోధ్యకి వెళ్లకపోయినా అక్కడికి వెళ్ళిన పుణ్యం మీకు దక్కుతుంది.
ఆరోజుకి మరొక ప్రత్యేకత
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజుకి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఆరోజు కూర్మ ద్వాదశి వచ్చింది. క్షీర సాగర మథనం సమయంలో విష్ణు మూర్తి కూర్మావతారం ఎత్తాడు. అందువల్ల కూర్మ ద్వాదశి రోజు విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. విష్ణు సహస్ర నామం పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
అయోధ్యలో జరగబోయే క్రతువులు
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రతువులు మొదలయ్యాయి. గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని పెట్టారు. జనవరి 20, సరయూ పవిత్ర నదీ జలాలతో ఆలయ గర్భగుడిని పరిశుభ్రం చేశారు. జనవరి 21న 125 కలశాలతో వివిధ పుణ్య క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో రామ్ లల్లాకి దివ్య స్నానం చేయిస్తారు. జనవరి 22 మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగనుంది.