మిస్టరీ : చెక్కిన ఆలయం!

మనలో చాలామందికి ఈజిప్ట్‌‌‌‌లోని పిరమిడ్లు, చైనాలోని గ్రేట్ వాల్.. మనుషులు కట్టిన అద్భుతాలు అని తెలుసు. అలాంటి ఓ అద్భుతం మన దగ్గర కూడా ఉంది. ఏవో కొన్ని కారణాల వల్ల ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదే కైలాస దేవాలయం. ఇది ఒకే రాతితో చెక్కిన ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణం. 

ఈ ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా రాతి గుహల్లోని 16వ గుహలో ఉంది. ఇది ప్రపంచంలోని అద్భుత నిర్మాణాల్లో ఒకటైన ఏకశిలా నిర్మాణం. కైలాస ఆలయం చెక్కేందుకు లక్షల టన్నుల రాళ్లను తొలిచారు. ఈ ప్రాంతంలోని పురాతన గుహలు క్రీ.శ. 5 నుంచి 10వ శతాబ్దాల మధ్య నాటివని చెప్తుంటారు. కొందరు మాత్రం ఇవి అంతకంటే ముందు ఉన్నవే అని నమ్ముతారు. వాస్తవానికి.. ఈ ఆలయం ఎలా? ఎప్పుడు? ఎవరు?  నిర్మించారు అనేందుకు  సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. 

కృష్ణుని పాలనలో ..

ఈ ఆలయం క్రీస్తుశకం 8వ శతాబ్దంలో రాష్ట్రకూట సామ్రాజ్యానికి మొదటి పాలకుడైన కృష్ణుని పాలనలో నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయం పూర్తిగా చెక్కడానికి 18 ఏండ్లు పట్టింది. వంద అడుగులకు పైగా ఎత్తు ఉన్న ఒక పెద్ద కొండను తొలిచి, ఈ ఆలయాన్ని చెక్కారు. దీని నిర్మాణంలో రాయి తప్ప వేరే మెటీరియల్ వాడలేదు. ఈ ఆలయం కోసం ఒక ఎత్తయిన కొండ నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల టన్నుల రాయిని తొలిచినట్లు అంచనా. 

మరో మిస్టరీ ఏంటంటే.. ఈ కొండను తొలిచి తీసిన బసాల్ట్ రాయి ఏమైంది? దాన్ని ఎక్కడ పారేశారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. పైగా అప్పుడున్న టెక్నాలజీతో అంత పెద్ద రాయిని తొలచడం చాలా కష్టం. అందుకోసం ఉపయోగించిన పనిముట్ల ఆధారాలు కూడా దొరకలేదు.18 ఏండ్లలో ఇలాంటి నిర్మాణం పూర్తిచేయడం చాలా కష్టం. 20 ఏండ్లలో పూర్తి చేయాలంటేనే.. గట్టిగా ఉండే బసాల్టిక్ రాయిని ఒక ఏడాదిలో 20,000 టన్నుల కంటే ఎక్కువ రాతిని తొలచాలి.

ఈ లెక్కన నెలకు1,666 టన్నులు, రోజుకు 55 టన్నులు, ప్రతి గంటకు నాలుగు నుండి ఐదు టన్నులు తొలచాల్సి ఉంటుంది. పైగా తొలిచిన రాయిని మరో చోటికి తరలించడానికి కొంత టైం కావాలి. తొలచడం ఒక్కటే కాదు.. వాటిని అందంగా చెక్కడానికి కూడా చాలా టైం పడుతుంది. దీనిపై రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ చేసిన చాలామంది ఒక పెద్ద గట్టి బసాల్టిక్ రాయిని నిలువుగా తొలిచి, నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్పారు. అంటే ముందుగా గోపురం ఆ తర్వాత ఆలయం చెక్కారన్నమాట! 

గట్టి రాయి

సాధారణంగా సాండ్‌‌‌‌ స్టోన్‌‌‌‌, సున్నపు రాయి లాంటివాటిని తొలచడం, చెక్కడం చాలా ఈజీ. కానీ.. ఈ బసాల్టిక్‌‌‌‌ స్టోన్‌‌‌‌ని చెక్కడం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఇది చాలా స్ట్రాంగ్‌‌‌‌గా ఉంటుంది. పెళుసుగా ఉండడం వల్ల శిల్పాల్లా మలచడం కాస్త కష్టమవుతుంది. ఇలాంటి కఠినమైన శిల్పాలున్న ఆలయ నిర్మాణానికి ఇంత కఠినమైన శిలను ఎందుకు ఎంచుకున్నారు? అనేది ఇప్పటికీ తెలియలేదు. పైగా ఏ శిల్పంలోనూ ఒక్క లోపం కూడా లేకుండా చెక్కారు.

మామూలుగా ఒక శిల్పం చెక్కడానికి నాలుగైదు రాళ్లు వృథా అవుతాయి. ఎందుకంటే.. ఒకేసారి ఫర్ఫెక్ట్ షేప్‌‌‌‌ వచ్చేలా చెక్కడం అంత ఈజీ కాదు. కానీ.. ఈ ఆలయం గోడల్లో ఉన్న వేల శిల్పాల్లో ప్రతి ఒక్కటి ఫర్ఫెక్ట్‌‌‌‌గా వచ్చింది. ఇంత ఫర్ఫెక్ట్‌‌‌‌గా చెక్కడానికి వాళ్ల దగ్గర ఎలాంటి టూల్స్‌‌‌‌ ఉన్నాయి? 18 ఏళ్లలో ఎలా పూర్తి చేయగలిగారు? ఆ కాలంలో అందుబాటులో ఉన్న సుత్తెలు, ఉలి.. లాంటి వాటితో ఇలాంటి శిల్పాలు ఎలా చెక్కగలిగారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

వారంలోనే చెక్కారా? 

మరాఠీ ప్రజలు చెప్పిన మధ్యయుగ పురాణం ప్రకారం.. కైలాస ఆలయం ఒక వారంలోనే నిర్మించారు. ఒక రాజు అనారోగ్యంతో బాధపడుతుంటాడు. అప్పుడు రాణి తన భర్త రోగాన్ని నయం చేయమని కోరుతూ శివుడిని ప్రార్థించింది. దానికి ప్రతిగా.. రాణి ఒక ఆలయాన్ని నిర్మించి శివుడికి అంకితం చేస్తానని మొక్కుతుంది. అయితే.. ఆ నిర్మాణం మొదలైన రోజు నుంచి పూర్తయ్యేవరకు ఉపవాసం ఉంటాను అనుకుంటుంది. ఆమె శివుడిని వేడుకున్న వెంటనే రాజు కోలుకున్నాడు. దాంతో వెంటనే రాణి తన ఆలయం చెక్కించి తన మొక్కు నెరవేర్చుకుంది. రాణి ఈ ఆలయాన్ని నిర్మించడానికి ‘కోకసా’ అనే వాస్తుశిల్పిని పిలిపించింది. అతను ఆలయం పూర్తయ్యేవరకు రాణి ఉపవాసం ఉంటుందని తెలిసి కంగారుపడ్డాడు. అందుకే తన టెక్నిక్స్‌‌‌‌ని వాడి వారంలోనే నిర్మాణాన్ని పూర్తి చేశాడు. 

దీనికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం.. రాణి తన భర్త ఆరోగ్యం బాగుపడితే.. ఆలయం కట్టిస్తానని, ఆ ఆలయ గోపురం చూసేవరకు ఉపవాసం చేస్తానని మొక్కుకుంది. కిందినుంచి ఆలయం కడుతూ వెళ్తే.. నిర్మాణం పూర్తయ్యేవరకు కొన్నేండ్లు పడుతుంది. అందుకే శిల్పి ముందుగా ఆలయ గోపురం చెక్కి, తర్వాత ఆలయాన్ని వారం రోజుల్లో చెక్కాడు. 

కూల్చలేని ఆలయం

మొఘల్ కాలం నాటి మరో పురాణం ఇక్కడివాళ్లు చెప్తుంటారు. ఔరంగజేబు చక్రవర్తి హయాంలో.. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. దీన్ని కూల్చేందుకు  ఏకంగా వెయ్యి మందిని ఏర్పాటుచేశారు. వాళ్లంతా కలసి మూడేండ్లు ఈ ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. కానీ.. కూల్చలేకపోయారు. అక్కడక్కడ కొన్ని పగుళ్లు మాత్రమే వచ్చాయి. కొన్ని శిల్పాలు రూపం కోల్పోయాయి. అంతేకానీ.. ఆలయాన్ని పూర్తిగా కూల్చడం మాత్రం సాధ్యం కాలేదు వాళ్లకి. దాంతో కూల్చేందుకు వచ్చిన కూలీలంతా వెనుదిరగక తప్పలేదు. 

ఇప్పటికీ తెలియలేదు 

చరిత్రకారుడు ఎం.కే. ధవలికర్ మాట్లాడుతూ.. ‘‘కైలాస ఆలయాన్ని ఇతర పెద్ద పురాతన భవనాల్లాగే వేరువేరు వ్యక్తులు దాదాపు150 ఏండ్ల పాటు నిర్మించారు. శిల్పులు కూడా చాలామంది మారారు. ఆలయం నిర్మించడంలో అనేక దశలు ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాక ఈ రోజు మనం చూస్తున్న ఆకారంలోకి వచ్చి ఉంటుంద’’ని చెప్పారు. ఈ నిర్మాణానికి సంబంధించిన సాక్ష్యాలు చరిత్రకారులకు పెద్దగా దొరకలేదు. ఒక గుహ పశ్చిమ గోడలోని చిల్లుల కిటికీపై ఒక శాసనం ఉంది. అందులో బ్రాహ్మీ లిపిలో సగం పూర్తైన ఆలయం గురించి ఉంది. కానీ.. అది ఈ ఆలయమే అని చెప్పేందుకు ఆధారాలు దొరకలేదు. ఇందులో రాష్ట్రకూట రాజుల వంశావళి గురించి ప్రస్తావించారు. వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ప్రాంతంలోని అనేక శాసనాలు బాగా దెబ్బతిన్నాయి. అందువల్ల దీన్ని ఎవరు చెక్కించారు? ఎవరు చెక్కారు? సృష్టికర్త ఎవరు? అనే వివరాలు తెలియలేదు. 

ఆలయం కింద నిర్మాణం 

ఈ అద్భుతమైన ఆలయం కింద కూడా ఓ నిర్మాణం లేదా ఒక రహస్యమైన అండర్ గ్రౌండ్ సిటీ ఉండేదని కొందరు చెప్తుంటారు. ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే.. దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదనిపిస్తుంది. కాబట్టి దీన్ని అప్పట్లో ఏలియన్స్ నిర్మించారని కొందరు వాదిస్తున్నారు. అంతేకాదు.. ఆలయంలో ఉన్న రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం. కాబట్టి వాటిని ఏలియన్స్..  అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ సిటీకి వెళ్లి  రావడానికి నిర్మించుకున్నాయని చెప్తుంటారు! 

అద్భుతమైన శిల్పాలు 

ఇక్కడ ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన శిల్పాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రాంగణంలోని నంది విగ్రహం, 100-అడుగుల ఎత్తైన బసాల్ట్ స్తంభాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గంభీరమైన ఏనుగులు ఆ మొత్తం నిర్మాణాన్ని మోస్తున్నట్లు అనిపించేలా దీని పునాది దగ్గర చెక్కిన ఏనుగులు ఉన్నాయి. ఆలయ ఆగ్నేయ గ్యాలరీలో ఉన్న 10 ప్యానెళ్లు విష్ణు అవతారాలను సూచిస్తున్నాయి. ఆలయంలోని వంతెనలు, వర్షపు నీటిపారుదల నెట్​వర్క్, భూగర్భ సొరంగాలు, డ్రైనేజీ వ్యవస్థ, బాల్కనీలు, భవనంలోని వివిధ లెవల్స్‌‌‌‌లో భారీ మెట్లు ఉన్నాయి. శివుని హిమాలయ నివాసంగా భావించే కైలాస పర్వతంతో ఈ ఆలయానికి సంబంధాలు ఉన్నాయని కూడా కొందరు చెప్తుంటారు. 

ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి?

ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. అవి ఆలయం కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయి. ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న రంధ్రాలు కొన్ని ఉన్నాయి. వాటి నుంచి కింద ఉన్న సిటీకి వెలుతురు, గాలి అందుతాయి అని చెప్తుంటారు. అయితే, ఆ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం వాటిని మూసివేసింది. ఇక్కడి సొరంగాలు కూడా 40 ఏండ్ల నుంచి మూసే ఉన్నాయి. ఆ సొరంగాల్లో విలువైన నిధులు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది.