చూడగానే ద్రాక్ష అనుకుంటారు. కానీ ఇది బ్లూ బెర్రీ. సైజ్ కూడా దాదాపు ద్రాక్ష అంతే ఉంటుంది. అయితే, ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న బ్లూ బెర్రీ సైజ్ మాత్రం పెద్దది. అది ఎంత పెద్దది అంటే వరల్డ్ రికార్డ్ కొల్లగొట్టేంత! దీని బరువు అక్షరాలా 20.40 గ్రాములు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉన్న కోస్టా గ్రూప్‌కి చెందింది. ఈ బ్లూబెర్రీని నవంబర్ 13, 2023లో కోశారు. కానీ, గిన్నిస్ రికార్డ్ వల్ల ఇప్పుడు దానికి గుర్తింపు వచ్చింది.
ఎటెర్నా వెరైటీకి చెందిన బెర్రీ. వెరైటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా (వీఐపీ) బ్రాడ్ హాకింగ్, జెస్సికా, మారీ అనే వాళ్లు ఎటెర్నా జాతి బ్లూబెర్రీలను పండించారు. అంతేకాదు.. ఇంతకు ముందు వెస్టర్న్ ఆస్ట్రేలియాలో 2020లో కూడా బ్లూ బెర్రీ రికార్డ్లకి ఎక్కింది. అప్పట్లో అది16.2 గ్రాములు ఉంది. ఆ రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అయింది. హాకింగ్ మాట్లాడుతూ ‘‘పెద్ద సైజు పండ్లకు పెట్టింది పేరు ఎటెర్నా వెరైటీ. వాటి టెక్చర్ క్రిస్ప్‌గా ఉంటుంది. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది’’ అన్నాడు.