రుణమాఫీ చేసేదాకా వెంటాడుతాం : కేటీఆర్

  • ఆరు గ్యారంటీలపైనా పోరాడుతాం: కేటీఆర్ 
  • ఆంక్షల్లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్  
  • బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు 
  • సీఎం దైవ ద్రోహం చేశారంటూ యాదగిరిగుట్టలో హరీశ్ పాప ప్రక్షాళన పూజలు

చేవెళ్ల/యాదాద్రి/యాదగిరిగుట్ట/జనగామ, వెలుగు: ఎలాంటి ఆంక్షల్లేకుండా మిత్తితో సహా రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగే వరకూ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు. ఎలాంటి షరతుల్లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టు వేశారని, కానీ అది అమలుచేయలేక దైవ ద్రోహానికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. ‘‘ప్రభుత్వాన్ని నడపడం.. మాటలు చెప్పినంత ఈజీ కాదు. రూ.2 లక్షల రుణమాఫీకి రూ.49 వేల కోట్లు అవసరమవుతాయని బ్యాంకర్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లు మాత్రమే వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే చెప్పారు. రూ.49 వేల కోట్లకు రూ.7,500 కోట్లు అంటే ఎంత తేడా? ఇది ఎంత మోసం.. మోసం చేసినోళ్లను వదిలిపెట్టం” అని అన్నారు. ‘నీ సొంతూర్లో వంద శాతం రుణమాఫీ అయినట్టు రైతులు చెబితే రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేశాను. కానీ ఆయన ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు’ అని పేర్కొన్నారు. 

ఇప్పుడు చేస్తున్న పోరాటం మొదటి అడుగు మాత్రమేనని.. ఒక్క రుణమాఫీపైనే కాదు, ఆరు గ్యారంటీలపైనా పోరాడతామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై ప్రజల్లో నిలదీస్తామన్నారు. గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతుల జాబితా తయారు చేసి, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. రుణమాఫీపై వాస్తవాలు తెలుసుకునేందుకు సీఎం సొంత నియోజకవర్గానికి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై దాడి చేయడం దారుణమని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

సీఎం దేవుళ్లను మోసం చేసిండు: హరీశ్ రావు 

రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు హెచ్చరించారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామిని హరీశ్ రావు దర్శించుకున్నారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఒట్టు వేసి.. సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆయన విమర్శించారు.

 సీఎం దైవ ద్రోహానికి పాల్పడ్డారని, పాలకుడు ఒట్టు వేసి తప్పినందుకు, ఆ పాపం ప్రజలకు తగలవద్దని కోరుతూ ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట పాప ప్రక్షాళన పూజ చేశారు. అనంతరం షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్​చేస్తూ ఆలేరు, జనగామలో నిర్వహించిన ధర్నాల్లో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి పాపాత్ముడు, దుర్మార్గుడు, దివాళాకోరు అంటూ తీవ్ర స్థాయిలోధ్వజమెత్తారు. 

ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేసిన ఏకైక సీఎంగా రేవంత్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. రుణమాఫీపై సీఎం రేవంత్​ఒక తీరుగా.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు మరోతీరుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. స్పీకర్​ సహా ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసిన సర్కార్.. ఆర్టీసీ, సింగరేణి ఉద్యోగులతో పాటు పింఛన్​దారులకు మాత్రం మాఫీ చేయలేదని మండిపడ్డారు. ఇప్పటివరకు 40 శాతం మందికే రుణమాఫీ చేశారన్నారు.