- లక్నోలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘటన
- బీజేపీ విధానాలతో పెరిగిన పని ఒత్తిడే కారణం: అఖిలేశ్ యాదవ్
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ బ్యాంక్ ఉద్యోగిని విధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గోమతి నగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విబూతి ఖండ్ బ్రాంచ్ లో..సదాఫ్ ఫాతిమా అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం ఆఫీసుకు వచ్చారు. డ్యూటీ చేస్తుండగానే ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలారు.
గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుండెపోటుతోనే ఆమె మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఫాతిమా మరణంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. "పనిఒత్తిడి కారణంగా ఫాతిమా చనిపోవడం తీవ్ర ఆందోళనకరం.
దేశంలో ప్రస్తుత కార్పొరేట్ విధానాలు, ఆర్థికపరమైన ఒత్తిడి ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం" అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పనికిమాలిన ఆర్థిక విధానాల వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు.