ఫండ్స్ రాక.. ఆగిన ఇండ్లు ...పూర్తి చేయాలంటే రూ.30కోట్లు కావాలని ప్రపోజల్స్​

  • ఇండ్లు శాంక్షన్​చేసి చేతులు దులుపుకొన్న గత సర్కార్​ 
  • మూడుసార్లు దరఖాస్తులు తీసుకొని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే.. 
  • ఎక్కడి పనులు అక్కడే.. త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారుల విజ్ఞప్తి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డబుల్ ​బెడ్​ రూమ్ ​ఇండ్ల పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. గత బీఆర్​ఎస్​ సర్కారు కొన్నిచోట్ల ఇండ్లు ఇచ్చినా చాలా చోట్ల అసంపూర్తిగా వదిలేసింది. ఇప్పుడు ఫండ్స్​ వస్తేగానీ పనులు ముందుకు కదిలే పరిస్థితి లేదు. కొత్తగూడెం పట్టణంలోని డబుల్​ బెడ్​ రూమ్ ​ఇండ్లను పూర్తి చేయాలంటే రూ.30 కోట్ల నిధులు కావాలని పీఆర్​ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.గత సర్కారు ఇండ్లను శాంక్షన్​ చేసి చేతులు దులుపుకొందని, కాంగ్రెస్​ ప్రభుత్వమైనా ఇండ్లను పూర్తి చేసి ఇవ్వాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

884 ఇండ్లలో ఒక్కటి కూడా పూర్తి కాలె..

కొత్తగూడెం పట్టణంలో గత బీఆర్​ఎస్​ సర్కారు 884 ఇండ్లను శాంక్షన్​ చేసింది. దాదాపు రూ. 40కోట్లను కేటాయిస్తున్నట్టు అప్పటి మంత్రులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. దాదాపు ఎనిమిదేండ్ల కిందట పంచాయతీరాజ్​ శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్​ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఫండ్స్​ రిలీజ్​ఆగడంతో కాంట్రాక్టర్​కూడా పనులు చేయడంలో జాప్యం చేశాడు.

 రూ. 40కోట్లలో దాదాపు రూ. 15కోట్ల వరకు చెల్లించిన ప్రభుత్వం తర్వాత ఫండ్స్​ రిలీజ్​ చేయలేదు. మొత్తంలో ఒక్క బ్లాక్​లోని కొన్ని ఇండ్లు మాత్రమే కొంత వరకు పూర్తి కావొచ్చాయి. మిగిలినవన్నీ పిల్లర్లు, స్లాబులు, గోడల స్థాయిలోనే ఉన్నాయి. 

పనులు కాకుండానే ఇండ్ల కేటాయింపు..

డబుల్​ బెడ్​ రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారుల నుంచి ఆఫీసర్లు రెండు సార్లు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ వాటి జాడ లేకుండా పోయాయి. ఏడాదిన్నర కిందట మూడోసారి దరఖాస్తులను తీసుకున్నారు. దాదాపు 5,686 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 1,470మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ పూర్తి కాకున్నా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించింది.

 ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తమ పరిస్థితేంటనే అయోమయంలో ఉన్నారు. అప్పడు కొందరు బీఆర్​ఎస్​ లీడర్లు ఒక్కో లబ్ధిదారుడి వద్ద నుంచి రూ. 50వేల నుంచి రూ. 3లక్షల వరకు తీసుకున్నట్టుగా ప్రచారం సాగింది. ఏదేమైనా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ ​పెట్టి ఇండ్లను పూర్తి చేసి అర్హులకు ఇవ్వాలని  లబ్ధిదారులు కోరుతున్నారు. 

రూ. 30 కోట్లు అవసరం..

పాత కొత్తగూడెంలో నిర్మిస్తున్న డబుల్​ బెడ్​రూం ఇండ్లను పూర్తి చేసేందుకు దాదాపు రూ. 30కోట్లు అవసరమవుతుంది. ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇండ్ల నిర్మాణాల పొజిషన్​ను కాంగ్రెస్​ ప్రభుత్వం అడిగింది. ఫండ్స్​ రిలీజ్​ అయితే ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం- శ్రీనివాస్, ఈఈ పంచాయతీ రాజ్, భద్రాద్రికొత్తగూడెం 

ఆశగా ఎదురు చూస్తున్నాం.. 

నాకు డబుల్​ బెడ్​ రూమ్​ఇల్లు ఎలాట్​అయినట్టుగా ఆఫీసర్లు చెప్పినప్పుడు మస్తు సంతోషమైంది. కానీ ఏడాదిన్నర దాటినా ఇల్లు మాత్రం ఇయ్యట్లేదు. ఇయ్యాల, రేపు అంటూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వమైనా స్పందించి మాకు కేటాయించిన ఇండ్లను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలి. - సీహెచ్​. కళావతి, మేదరబస్తీ, కొత్తగూడెం