సర్కారు బడుల్లో..స్లోగా రిపేర్​ వర్క్స్

  • 317 స్కూళ్లలో వంద స్కూళ్లలోనే పనులు కంప్లీట్

వనపర్తి, వెలుగు : స్కూల్స్​ ప్రారంభం నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు రిపేర్లు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా  వనపర్తి జిల్లాలో పనులు పూర్తి కావడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద రిపేర్లు అవసరం ఉన్న స్కూల్స్​ను గుర్తించింది. ఆ స్కూళ్లల్లో అన్ని సౌలతులు కల్పించాలని, రిపేర్లు పూర్తి చేసి ఈనెల 12 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జిల్లాలో537 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 317 స్కూల్స్​ అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఎంపిక చేశారు. వీటిలో వంద స్కూళ్లలో పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు కొంత స్లోగా జరుగుతున్నాయి. వీటితో పాటు 183 స్కూళ్లలో మనఊరు–మనబడి కింద రిపేర్లు చేయాలని భావించారు. ఇందుకోసం రూ. 21.78 కోట్ల బడ్జెట్ ను రిలీజ్​ చేశారు. 

తాగునీటికి మొదటి ప్రాధాన్యత.. 

జిల్లాలోని 435 స్కూళ్లల్లో తాగునీటి సౌకర్యం సరిగా లేదని విద్యాశాఖ అధికారులు  గుర్తించారు. ఇలా గుర్తించిన ప్రతి పాఠశాలలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఒక్కో యూనిట్ కు రూ. లక్ష చొప్పున ఖర్చు చేస్తున్నారు. మైనర్  రిపేర్లకు రూ. 2 లక్షల చొప్పున 312 పాఠశాలల్లో రిపేర్లు చేస్తున్నారు.  130 గ్రామీణ పాఠశాలల్లో, 36   పట్టణ పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 6, 7 తరగతి గదుల్లో ఎలక్ట్రిసిటీ పనులను చేపడుతున్నారు. అలాగే 442 పాఠశాలల్లో మరుగుదొడ్ల రిపేర్లను చేస్తున్నారు. 

పూర్తి కాని రిపేర్లు..

మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు రీ ఓపెనింగ్ కానుండగా రిపేర్లు పూర్తి కావడం లేదు. పాఠశాలల రీ ఓపెనింగ్  నాటికి అన్ని పాఠశాలల్లో సౌలతులు, మైనర్ రిపేర్లు కంప్లీట్  కావాలని కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  ఆదేశించారు. కానీ, జిల్లాకు రెగ్యులర్ డీఈవో లేకపోవడం, ఇన్​చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్  డీఈవో గోవింద రాజులు  చుట్టపు చూపుగా వనపర్తికి వచ్చి పోతుండడంతో గవర్నమెంట్ స్కూళ్ల పనులు పట్టించుకునే వారు లేకుండా పోయారు.

కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్ స్వయంగా జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లల్లోని పనులను పర్యవేక్షించడంతోనే కొంత మేర పనులు పూర్తి చేశారని చెప్పవచ్చు. మండల స్థాయిలో ఇన్​చార్జి ఎంఈవోలు పర్యవేక్షించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. 

మొక్కుబడిగా బడిబాట..

జిల్లాలో బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఇన్​చార్జి ఎంఈవోలు, హెచ్ఎంలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. బడిబాట కార్యక్రమాన్ని గైడ్ లెన్స్  ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, గవర్నమెంట్  స్కూళ్లల్లో స్టూడెంట్ల సంఖ్యను పెంచాలని కలెక్టర్  ఆదేశాలు జారీ చేసినా పట్టించుకునే వారు లేకపోవడంతో మొక్కుబడిగా జరుగుతోంది. 

మైనర్ రిపేర్లే ఉన్నాయ్..

జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు రిపేర్లు చాలా వరకు పూర్తి చేశాం. కొన్ని మైనర్  రిపేర్​ పనులు పెండింగ్​లో ఉన్నాయి. స్కూల్స్  రీ ఓపెనింగ్  నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
-
 తిరుపతి రెడ్డి, స్టాటిస్టికల్  కో ఆర్డినేటర్, వనపర్తి