లొంగిపోయిన మావోయిస్ట్‌‌‌‌ దళ సభ్యురాలు

ములుగు, వెలుగు : మావోయిస్ట్‌‌‌‌ పార్టీ నేషనల్‌‌‌‌ పార్క్‌‌‌‌ ఏరియా కమిటీ సభ్యురాలు స్వర్ణక్క బుధవారం ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌‌‌‌గిరి జిల్లా కలిమెల మండలం పొట్టేరు గ్రామానికి చెందిన అలువ స్వర్ణ అలియాస్‌‌‌‌ స్వర్ణక్క 2000ల సంవత్సరంలో మావోయిస్ట్‌‌‌‌ పార్టీలో చేరారు. నార్త్‌‌‌‌ తెలంగాణ స్పెషల్‌‌‌‌ జోనల్‌‌‌‌ కమిటీ సభ్యుడు చట్టిరాజా పాపయ్య ప్రొటెక్షన్‌‌‌‌ టీంలో చేరి మూడేళ్లు సభ్యురాలిగా, అనంతరం మరో ఐదేళ్లు జంపన్నకు ప్రొటెక్షన్‌‌‌‌ టీం సభ్యురాలిగా పనిచేశారు. 

2005లో రాంపూర్‌‌‌‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొని తప్పించుకుంది. 2006లో వాజేడు మండలం కొంగాలకు చెందిన కురుసం సాయన్న అలియాస్‌‌‌‌ జగత్‌‌‌‌ను పెండ్లి చేసుకుంది. 2008లో ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొంది హరిభూషణ్‌‌‌‌, రామన్నకు ప్రొటెక్షన్‌‌‌‌గా పనిచేశారు. నేషనల్‌‌‌‌ పార్క్‌‌‌‌ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్న తన భర్త జగత్‌‌‌‌ 2017లో గుండం ఎదురుకాల్పుల్లో చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది. 

బుధవారం ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరీశ్‌‌‌‌ ఆమెకు రివార్డు అందజేశారు. మావోయిస్ట్‌‌‌‌ పార్టీని వీడి ప్రజల్లో కలిసిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఎస్పీ చెప్పారు. ఆయన వెంట డీఎస్పీ, ఇన్‌‌‌‌చార్జి ఓఎస్డీ ఎన్.రవీందర్‌‌‌‌, సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ 39 బెటాలియన్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ కమాండెంట్‌‌‌‌ ఎం.శ్రీనివాస్‌‌‌‌ ఉన్నారు.