Viral Video: చేతిలో మందు.. డ్యాన్సర్తో చిందు.. ఫుల్ జోష్లో డాక్టర్ సార్లు..!

చెన్నైలో జరిగిన ఒక మెడికల్ కాన్ఫరెన్స్లో వైద్యులు తప్పతాగి డ్యాన్సర్లతో చిందులేసిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. చేతిలో మందు గ్లాసు పట్టుకుని ఓ డాక్టర్ సారు డ్యాన్సర్తో అదిరిపోయే రేంజ్లో స్టెప్పులేశాడు. ఆయన ధైర్యం చూసి మరో సీనియర్ డాక్టర్ సారులో అప్పటి దాకా లేని జోష్ వచ్చింది. ఇద్దరూ కలిసి ఆ డ్యాన్సర్తో కలిసి చిందులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

చెన్నైలో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకూ అసోసియేషన్ ఆఫ్ కోలన్ అండ్ రెక్టల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు జరిగింది. ఈ సదస్సు ముగింపులో భాగంగా వైద్యులంతా పార్టీ చేసుకున్నట్టున్నారు. పార్టీలో ఓన్లీ మందొక్కటే ఉంటే కిక్కేముంటుందనుకున్నారో.. ఏమో.. ఒక డ్యాన్సర్ను పిలిపించుకుని స్టెప్పులేయించారు. ఆమెతో కలిసి తైతక్కలాడారు. ఆమెతో డ్యాన్స్ చేసిన ఇద్దరూ వయసులో పెద్దవాళ్లే కావడం ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్.

ALSO READ | మద్రాస్ హైకోర్టు ఘోర తప్పిదం చేసింది: సుప్రీంకోర్టు

ఈ దృశ్యాలను అదే సదస్సులో ఉన్న ఎవరో వీడియో తీసి వైరల్ చేశారు. ఆ వైద్యుల నిర్వాకంపై నెటిజన్లు భగ్గుమన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ను ‘ఎక్స్’లో ట్యాగ్ చేసి మరీ నిలదీస్తున్నారు. ‘‘హ్యుమన్ ఎనాటమీలో ఇదే నేర్పిస్తున్నారా..? వయసుమళ్లిన వైద్యులు బహిరంగంగా ఇలా చిందులేయడం ఏ మెడిసిన్ ప్రాక్టీస్లో భాగం..?’’ అని ట్విటర్లో నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. కొందరు నెటిజన్లు వైద్యులకు అండగా నిలుస్తుండటం విశేషం. ‘‘అందులో తప్పేముంది..? తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు డ్యాన్సర్ ఏమైనా ఫిర్యాదు చేసిందా..? ఒకవేళ ఫిర్యాదు చేసి ఉంటే లీగల్ యాక్షన్ తీసుకోండి. లేకపోతే.. ఈ మోరల్ పోలీసింగ్ను మానుకోండి’’ అని కొందరు నెటిజన్లు హితవు పలికారు.