అవీ-‌‌ – ఇవీ : క్రోచెట్​తో వరల్డ్ రికార్డ్​

అలెస్సాండ్ర హేడెన్​ అనే మహిళకు గిన్నిస్​ రికార్డ్​ ఎక్కాలనేది కోరిక. రికార్డ్​​ కోసం ఏం చేయాలా? అనే ఆలోచనలో ఉన్న ఆమెకు చిన్నప్పుడు అమ్మమ్మ నేర్పించిన క్రోచెట్ గుర్తొచ్చింది. ​​క్రోచెట్​ అంటే ఊలు దారంతో స్వెటర్లు వంటివి అల్లడం. హేడెన్ చిన్నప్పుడు ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేసేదట. ఎలాగైనా ఆ అల్లరిని ఆపాలనుకుంది వాళ్ల అమ్మమ్మ. అందుకని కుదురుగా ఒక చోట కూర్చుని చేసే క్రోచెట్ అల్లిక నేర్పించింది. అప్పటికి హేడెన్ వయసు ఎనిమిదేండ్లు. ఇక అప్పటి నుంచి ఆమెకి క్రోచెట్​ అల్లడం హాబీగా మారింది. 

గిన్నిస్​ రికార్డ్​లకి ఎక్కడం​ కోసం​ ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ‘మనకు వచ్చిందే చేస్తే పోలా’ అనుకుంది. అంతే.. క్రోచెట్​ అల్లడం మొదలుపెట్టింది. క్రోచెట్​ అల్లాలంటే మధ్య మధ్యలో బ్రేక్స్​ కంపల్సరీ. పైగా బ్రేక్ లేకుండా ఒకేచోట కూర్చుని గంటలు గంటలు పని చేయాలంటే కష్టం. మరి రికార్డ్​ కొట్టాలంటే ఏ రేంజ్​లో పని చేయాల్సి వస్తుందో ఊహించొచ్చు. అలాంటిది.. హేడెన్​ 34 గంటల 7 నిమిషాలు క్రోచెట్​ అల్లి.. గిన్నిస్​ బుక్​లో ఎక్కాలనే తన కలను నిజం చేసుకుంది. ఇందుకు తన భర్త చాలా సాయం చేశాడట. అంతేకాదు.. హేడెన్​ కూతురు హేడెన్​కి శ్నాక్స్ తినిపించడం, నీళ్లు లేదా కాఫీలు ఇవ్వడం, స్ట్రాతో ఎనర్జీ డ్రింక్స్ తాగించడం చేసిందట.  ఇంతకీ అన్ని గంటలు కష్టపడి ఆమె తయారుచేసింది ఏంటంటే.. పెద్ద దుప్పటి. దాన్ని తన కూతురు వెళ్తున్న స్కూల్​ ఆక్షన్​లో పెట్టేందుకు ఇచ్చేసింది. అయితే ఆమె ఫ్రెండ్ ఒకరు ఆక్షన్​లో రెండు వేల డాలర్లకు క్రోచెట్​ దుప్పటి కొని ఆమెకే గిఫ్ట్​గా ఇచ్చాడు.