మహాలక్ష్మితో ఆర్టీసీకి కాసుల పంట

  • కామారెడ్డి జిల్లాలో  రోజుకు లక్షా 16  వేల మంది ప్రయాణం
  • ఇందులో  65 శాతం మంది మహిళలే

కామారెడ్డి, వెలుగు : మహాలక్ష్మీ స్కీమ్​తో కామారెడ్డి జిల్లాలోని రెండు ఆర్టీసీ డిపోలకు ఆదాయం పెరుగుతోంది. దీంతో పాటు రోజు వారీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది. ఆయా రూట్లలో బస్సులకు డిమాండ్​పెరుగుతున్న దృష్ట్యా  కొత్తగా బస్సులు కేటాయించాలని ఆఫీసర్లు ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపారు. కామారెడ్డి, బాన్సువాడలో ఆర్టీసీ బస్​డిపోలు ఉన్నాయి. మొత్తం హైర్​బస్సులు కలుపుకొని 216 బస్సులు ఉండగా.. 106  రూట్లలో తిరుగుతున్నాయి.

ప్రస్తుతం రోజూ లక్షా16 వేల మంది వరకు ప్రయాణాలు చేస్తున్నారు. ఇందులో 65 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సులు  వినియోగించుకుంటున్నారు. మహాలక్ష్మీస్కీమ్ లో భాగంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత  35  వేల నుంచి 41 వేల మంది ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 

ఆదాయం పెరిగింది

 డిసెంబర్​ 9 నుంచి ఎక్స్​ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణవసతి కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. జిల్లాలో రెండు డిపోల పరిధిలో ఆదాయం పెరిగింది. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో ప్రస్తుతం 130  బస్సులు ఉండగా  ఇందులో  86  సొంత బస్సులు కాగా  44  హైర్​ బస్సులు ఉన్నాయి.  డీలక్స్​20,  సూపర్​లగ్జరీ 6,  ఎక్స్​ప్రెస్​లు 8,  96 ఆర్డీనరీ బస్సులు ఉన్నాయి.  పాత బస్సుల స్థానంలో  ఇటీవల కొత్తగా 3 బస్సులు వచ్చాయి. మహాలక్ష్మీ స్కీమ్​కు ముందు  డిపో  పరిధిలోని బస్సులో రోజుకు  45 వేల మంది వరకు ప్రయానించేవారు. ఆదాయం రూ. 22 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య వచ్చేది.

మహాలక్ష్మీ స్కీమ్​అమల్లోకి వచ్చిన తర్వాత రోజుకు 70 వేల మంది వరకు ప్రయాణాలు చేస్తున్నారు. ఆదాయం రూ. 26 లక్షలు వస్తుంది. ఉచిత ప్రయాణం ముందుకంటే ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య రోజుకు 25 వేల మంది వరకు పెరగడమే కాకుండా ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు పెరిగింది.  బాన్సువాడ డిపోలో 86  బస్సులు ఉండగా ఇందులో  73 సంస్థవి కాగా 13 హైర్​ బస్సులు.  నిరుడు డిసెంబర్​ 9 కంటే ముందు ఈ డిపో పరిధిలోని బస్సుల్లో  రోజుకు 30 వేల మంది వరకు ప్రయాణిస్తే ఆదాయం రూ.  8 లక్షల నుంచి రూ.9 లక్షల మధ్య వచ్చేది.  మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తర్వాత రోజూ 46 వేల మంది ప్రయాణిస్తున్నారు. ఆదాయం  రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు పెరిగింది.

పెరుగుతున్న డిమాండ్​

జిల్లాలో  ప్రస్తుతం ఇంకా పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.  సమీప గ్రామాలకు వెళ్లి అక్కడి నుంచి బస్సులో ప్రయాణిస్తున్నారు.   ప్రస్తుతం తిరుగుతున్న రూట్లలో అదనపు సర్వీసులు పెంచాలని, కొత్త రూట్లలో కూడా బస్సులు నడిపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.  నిజామాబాద్, హైదరాబాద్,  బీబీపేట, రామాయంపేట, కరీంనగర్​, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్​ఎక్స్​ప్రెస్​, ఆర్డీనరీ బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్​ఉంది.  ఆయా రూట్లలో తిరిగే బస్సులు రద్దీగా వెళ్తున్నాయి. ఉదయం, సాయంత్రం బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. 

కొత్త బస్సులకు ప్రపోజల్స్​

కామారెడ్డి డిపోకు కొత్తగా 15 బస్సులు కేటాయించాలని ఉన్నతాధికారులకు ప్రపోజల్స్​పంపారు.  కొత్త బస్సులు వస్తే  ప్రస్తుతం తిరుగుతున్న రూట్లకు అదనపు బస్సులు పెంచటంతో పాటు, కొత్త రూట్లతో  నడిపించేందుకు వీలుంటుంది.  

మెరుగైన సేవలు అందిస్తున్నాం

ఆర్టీసీ బస్సుల్లో  ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది.  మహాలక్ష్మీ  స్కీమ్‌‌‌‌‌‌‌‌తో బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు.  ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం.  ఇబ్బందులు లేకుండా ఆయా రూట్లతో బస్సులు తిప్పుతున్నాం.  కామారెడ్డి డిపోకు ఆదాయం పెరిగింది. త్వరలో కొన్ని బస్సులు వచ్చే వీలుంది. 

–  ఇందిర, డిపో మెనేజర్​- కామారెడ్డి