Telangana Kitchen : ఆకు కూరలతో కోడిగుడ్డు కాంబినేషన్స్.. మస్త్ టేస్ట్.. మస్త్ ఆరోగ్యం

ఎప్పుడూ ఒకేరకంగా కాకుండా.. కొత్తకొత్త వంటలు ట్రై చేస్తుంటారు కొందరు. చాలామంది వెరైటీ కాంబినేషన్స్ ని ఇష్టంగా తింటారు. అందులో ఎగ్ మిక్సింగ్ కూడా ఒకటి. రకరకాల కూరగాయలతో, ఆకు కూరలతో కలిపి గుడ్లను వండుతారు. అందులో కొన్ని వెరైటీలు ఇవి.

బీరకాయ గుడ్డు ఫ్రై

కావాల్సినవి: బీరకాయ తరుగు: ఒకటిన్నర కప్పు, గుడ్లు: మూడు, కారం: ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు: ఒకటిన్నర టీ స్పూన్, నూనె: సరిపడా, కరివేపాకు: ఒక రెమ్మ (కావాలంటే), ధనియాల పొడి: ఒక టీ స్పూన్.. పసుపు: చిటికెడు, ఉల్లిగడ్డ తరుగు: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర: పావు టీ స్పూన్, అల్లం తరుగు: అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు: పావు కప్పు, ఉప్పు: తగినంత

తయారీ: స్టవ్ పాన్పెట్టి నూనె వేడి చేయాలి. జీలకర్ర, అల్లం తరుగు వేసి వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు, పసుపు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత బీరకాయ తరుగు, కారం వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆపైన గుడ్లను అందులో కొట్టాలి. వెంటనే కలపకుండా, రెండు నిమిషాల తర్వాత కలపాలి. కావాలంటే పాన్పై నీళ్లు పోసిన ప్లేట్ పెట్టొచ్చు. మిశ్రమం దగ్గరికయ్యాక కొత్తిమీర తరుగు, ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని అన్నంలోనే కాదు... పఫుల్కా, రోటీలతోనూ తినొచ్చు.

పుంటికూర గుడ్లు

కావాల్సినవి: పుంటికూర (గోంగూర) ఆకులు: రెండు కప్పులు, గుడ్లు: ఆరు, పచ్చిమిర్చి తరుగు: ఒక టేబుల్ స్పూన్ -పసుపు: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత, కారం: రెండు టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి: ఒక టీ స్పూన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్ 1అర టేబుల్ స్పూన్, ఇలాచీలు: రెండు, లవంగాలు: నాలుగు, దాల్చిన చెక్క: కొద్దిగా, నూనె: సరిపడా, ఎండుమిర్చి రెండు

 తయారీ: స్టవ్ పై పానె పెట్టి నూనె వేడి చేయాలి. అందులో పచ్చిమిర్చి తరుగు, పుంటికూర వేయాలి. మిశ్రమం మెత్తగా అయ్యే వరకు కలపాలి. తర్వాత మరో గిన్నెలో నూనె వేడి చేయాలి. అందులో ఎండుమిర్చి, మసాలాలను వేగించాలి. వెంటనే ఉల్లిగడ్డ తరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేయాలి. తర్వాత గుడ్లను కొట్టి పోయాలి లేదా ఉడికించిన గుడ్లను వేయాలి. ఐదు నిమిషాల తర్వాత మిశ్రమాన్ని కలిపి, ఉడికించిన పుంటికూర వేసి కలపాలి. మిశ్రమం దగ్గరికయ్యాక స్టవ్ ఆపేయాలి.

Also Read : 16 ఎకరాల్లో 12 పంటలు పండిస్తున్నారు..!

బీన్స్ ఎగ్ బుర్జీ

కావాల్సినవి: గుడ్లు: మూడు, బీన్స్ తరుగు: ఒక కప్పు, ఉల్లిగడ్డ తరుగు: అర కప్పు, టొమాటో తరుగు: పావు కప్పు (కావాలనుకుంటే), కారం: ఒక టీ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, పసుపు: చిటికెడు, ఆవాలు: పావు టీ స్పూన్, జీలకర్ర: పావు టీ స్పూన్, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెమ్మ, కొత్తిమీర తరుగు: పావు కప్పు
తయారీ: స్టవ్ పై పానె పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు, పసుపు వేయాలి. రెండు నిమిషాల తర్వాత టొమాటో తరుగు, బీన్స్, కారం, ఉప్పు వేయాలి. మిశ్రమం ఉడికాక గుడ్లను కొట్టి పోయాలి. కొద్దిసేపయ్యాక మిశ్రమాన్ని కలిపి, కొత్తిమీర తరుగు వేయాలి. మరో రెండు నిమిషాలు సన్నటి మంట మీద ఉంచి, స్టవ్ ఆపేస్తే బీన్స్ బుర్జీ రెడీ.

- వెలుగు లైఫ్