Health Alert : చలికాలంలో దగ్గు తగ్గడం లేదా.. ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి..!

దగ్గు..ఇది శీతాకాలంలో వేధించే సమస్య.. చాలా మందికి చలి పెరిగితే  ఆటోమేటిక్​ గా  దగ్గు వస్తుంది.  ఇది ఎంత చిరాకు పెడుతుందో చెప్పలేం.. అయితే ఈ దగ్గు వల్ల వచ్చే సమస్యలు ఏంటి.. దీని నివారణకు  తీసుకోవలసిన వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం. . . 

చలిప్రతాపం చూపుతోంది. చలితోపాటే దగ్గు, జలుబు, జ్వరాలు చాలామందిని పలకరిస్తున్నాయి. ఇందులో దగ్గు మరీ ఇబ్బంది పెడుతుంది. కంటిన్యూస్ గా దగ్గడం వల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. కంటినిండా నిద్రపోలేం. ..రోజంతా నీరసంగా ఉంటాం. ఇలా దగ్గువల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాం.

 వాతావరణం చల్లగా ఉంటే అందరికీ ఇష్టమే. కానీ.. దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మాత్రం మన ఇష్టాన్ని కష్టంగా మార్చేస్తాయి. కారణం.. చల్లటి వాతారణం కొన్నిరకాల సూక్ష్మజీవుల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. అవి గాలితోపాటే శరీరంలోకి వెళ్లి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. దీంతో గొంతు వెనకాల మ్యూకస్ పేరుకుపోయి గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఆ గాలిని బలవంతంగా బయటకు నెట్టే ప్రయత్నంలోనే దగ్గు వస్తుంది. 

ఒక్కమాటలో చెప్పాలంటే దగ్గు అనేది శ్వాస మార్గాన్ని సాఫీగా ఉంచమని శరీరం ఇచ్చే సిగ్నల్. ఈ సమస్య మొదలైనప్పటి నుంచి సమస్యను తగ్గించే మార్గాల కోసం ప్రయత్నిస్తుంటాం. అయితే అన్నింటికీ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గు వంటి అనారోగ్య సమస్యలను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా రెండుమూడు రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. దగ్గుని ప్రభావవంతంగా తగ్గించాలంటే.. మొదటగా అది పొడి దగ్గా లేదా తది కఫంతో కూడిన దగ్గా అనేది తేల్చుకోవాలి.

పొడి దగ్గు అయితే గొంతులో చిరాకు వల్ల లేదా శ్వాసనాళాల వల్ల రావచ్చు. తడి కఫంతో కూడిన దగ్గు అయితే శ్వాసనాళంలో కఫం లేదా అలాంటి ద్రవం నిండడం వల్ల వస్తుంది. తడి కఫంతో కూడిన దగ్గు తగ్గడానికి నీటిని ఎక్కువగా తాగాలి. దీనివల్ల మ్యూకస్ పొర తేమగా మారి.. కఫాన్ని బయటకు పంపేస్తుంది. ఒకవేళ పొడి దగ్గు అయితే.. గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగితే ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి, అందులో తేనె కలిపి తీసుకున్నా దగ్గు తగ్గుతుంది. 

నల్ల మిరియాల కషాయం తాగినా దగ్గు తగ్గిపోతుంది. పిల్లలకైతే దగ్గు తగ్గేందుకు దానిమ్మ రసాన్ని తాగించాలి. అందులో చిటికెడు అల్లం (శొంఠి) పొడి కలిపి తాగించినా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. దగ్గు వేధిస్తున్నప్పుడు మామూలు టీ కాకుండా మసాలా టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది

-–వెలుగు, లైఫ్​–