పెద్దపల్లి జిల్లాలో గాలిదుమారం, వాన

మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు  భారీ వృక్షాలు నేలకూలాయి. గాలులకు తోడు ఉరుములు మెరుపులతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.  ఉప్పట్ల గ్రామంలో గాలిదుమారానికి ఓ తాటి చెట్టు విరిగి ఓ ఇంటిపై పడింది.  ముత్తారం మండలంలో చెట్లపై పిడుగులు పడ్డాయి. 

పిడుగుపాటుకు బర్రె మృతి

వేములవాడరూరల్/ కోరుట్ల, వెలుగు: వేములవాడ రూరల్​ మండలం వెంకటాంపల్లి గ్రామంలో పిడుగు పడి బర్రె చనిపోయింది. పొలం వద్ద చెట్టు కింద గేదె కట్టేసి ఉంచగా ఆదివారం సాయంత్రం పిడుగు పడి చనిపోయినట్లు బాధిత రైతు పసునూరి పర్శరాములు తెలిపాడు. మర్రిపల్లి గ్రామంలో తాటిచెట్టుపై పిడుగు పడడంతో చెట్టు కాలిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో మోస్తరు వర్షం కురిసింది. పట్టణ శివారు మాదాపూర్​ కాలనీలో పిడుగు పడి తాటి చెట్లు కాలిపోయాయి. 

సుల్తానాబాద్‌‌లో వర్షం 

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలంలో ఆదివారం వర్షం కురిసింది. ఎంఈవో ఆఫీసు ముందు ఉన్న చెట్టు విరిగి ఆఫీస్ పై పడింది. దీంతో బిల్డింగ్‌‌ పైభాగం దెబ్బతిన్నది. ప్రహరీ కూలిపోయింది. ఆదివారం సెలవు కావడం వల్ల ఉద్యోగులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రేగడి మద్దికుంట గ్రామంలో పిడుగు పడి బల్ల శ్రావణ్ కుమార్ అనే రైతుకు చెందిన ఎద్దు అక్కడికక్కడే మరణించింది.