75 ఏండ్లకు మోదీ రిటైర్ అవుతారా? పొలిటికల్​ ఎనలిస్ట్​ దిలీప్​రెడ్డి

2014 ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ గురించే చర్చ జరిగింది.  సరిగ్గా పదేండ్ల తర్వాత 2024 ఎన్నికల సమయంలో ఇప్పుడు నరేంద్ర మోదీ వయసు గురించి చర్చ జరుగుతోంది. 75 ఏండ్ల స్వాతంత్ర్య  భారతానికి పెద్ద ఎత్తున అజాదీ కా అమృత్  మహోత్సవాలు నిర్వహించిన మోదీ, వచ్చే ఏడాది సెప్టెంబర్​లో  75 ఏండ్లు పూర్తి చేసుకుంటారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక జరిగిన పరిణామాలు, సంభాషణల్లో... 75 ఏండ్లకు  తమ  నాయకులు రిటైర్ అవ్వాలని బీజేపీ అప్రకటిత నిబంధన పెట్టుకున్నట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే!  ఒకవేళ  బీజేపీ మూడోసారి గెలిస్తే , ప్రధాని పదవిలో కొనసాగడానికి మోదీకి సుమారు ఏడాదిన్నర  సమయమే ఉంటుంది. ఈ నేపథ్యంలో 75 ఏండ్ల వయసు మోదీకి  అమృత కాలమా?  విషమ కాలమా?  అనే ప్రశ్న ఉదయించింది. ప్రస్తుతం అది సర్వత్రా చక్కర్లు కొడుతోంది.

వయసు మీద చర్చ మొదలుకావడానికి  మొదటి కారణం నరేంద్ర మోదీ అయితే,  రెండో కారణం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.  ఆయన జైలు నుంచి రాగానే మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీ పదేపదే అడుగుతోంది. అసలు బీజేపీ  ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు?  వచ్చే సెప్టెంబర్ నాటికి మోదీ 75వ పడిలో అడుగుపెడతారు. 75 ఏండ్ల తర్వాత బీజేపీ నాయకులు రిటైర్ అవ్వాలని ఆయనే రూల్ పెట్టారు కదా?  ఆయన పెట్టిన రూల్​తో అద్వానీ, మురళీ మనోహర్ జోషి,  సుమిత్రా మహాజన్,  యశ్వంత్ సిన్హా తదితరులు  రిటైర్ అయ్యారు.  ఇప్పుడు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  రిటైర్ కాబోతున్నారు. వాళ్లు యోగి ఆధిత్యానాథ్​ని  పక్కకు పెట్టి, 59 ఏండ్ల  హోం మంత్రి  అమిత్ షాను  ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నారు.  మరి నరేంద్ర మోదీ ఓట్లు తన కోసం అడుగుతున్నారా?  లేక అమిత్ షా కోసం అడుగుతున్నారా?  అమిత్ షా కోసం అడిగితే,  మోదీ  గ్యారంటీలను అమిత్ షా నెరవేరుస్తారా?’ అని ఓ సందేహాన్ని లేవనెత్తి  బీజేపీని కుదిపేశారు.  అప్పటివరకు తమకిక ఎదురే లేదన్నట్టుగా సాగిన బీజేపీ ప్రచారం,  కేజ్రీవాల్ వ్యాఖ్యల కుదుపులో  చిక్కుకుంది. 

జిన్​పింగ్, పుతిన్​ల ధోరణి

మోదీ అన్ని మర్చిపోతున్నారని, ఆయన చేతులు వణుకుతున్నాయని  సోషల్ మీడియాలో  కొంతమంది పోస్టులు పెడుతున్నారు . ఇంత  దుమారంలోనూ మోదీ కూడా తన వయసు, రిటైర్మెంట్ గురించి మాట్లాడటం లేదు. మోదీ మౌనం ఏం చెప్తోంది?  ఆయనే బాధ్యతలు అమిత్ షాకు  లేదా  ఇతర  నాయకులకు  అప్పగించి  స్వచ్ఛందంగా  వైదొలుగుతారా?  అనే  సందేహం అందరిలోనూ కలుగుతోంది.  కానీ, తన ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ప్రధానమంత్రిగా ఉండాలనుకుంటున్నారని మోదీ పరోక్షంగా చెప్పారన్నట్టే!  ఇది ఒకరకంగా చైనా జిన్​పింగ్,  రష్యా పుతి న్​ల ఆలోచనా ధోరణిని  ప్రతిబింబించేదే!   దీంతో పాటు ఇటీవల ఒక  ప్రయివేట్ మీడియా చానెల్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ... తన వెనుక దేవుడు ఉండి,  కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదిస్తాడని,  ఎలాంటి రాజకీయ నేపథ్యంలోనైనా  ప్రజలకు సేవ చేయడానికి దేవుడే తనని పంపించాడని ఆయన చెప్పుకున్నారు.  ఇంకో అడుగు ముందుకేసి  దేవుడు నడిపిస్తున్న దారిలోనే నడుస్తూ దైవిక స్ఫూర్తితో పని చేస్తున్నానని,  దేవుడి చేతిలో తానొక పనిముట్టునని కూడా మోదీ చెప్పుకున్నారు.  ఇది కూడా, మూడోసారి ప్రధానమంత్రి పదవిలో కొనసాగాలని ఆయన గాఢంగా కోరుకుంటున్నారనడానికి మరో అస్పష్ట సంకేతంగా భావించవచ్చు. 

ఆర్ఎస్ఎస్ మాటే  బీజేపీకి శాసనం

ఎన్నికల సమయంలో వయసు నిబంధనపై మోదీ మౌనం పాటించడానికి, దీనిపైనే  ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి  కారణం లేకపోలేదు.  బీజేపీలో  ఏ నిర్ణయమైనా ఆర్ఎస్ఎస్  తీసుకుంటుందనే అభిప్రాయం లోపల, -బయట  బలంగా ఉంది.  ఈ నిబంధన మోదీతో పాటు అందరికీ వర్తిస్తే,  ఆర్ఎస్ఎస్ మాటే  బీజేపీకి శాసనం.  లేదంటే,  ఈ రూల్ మోదీకి తప్ప బీజేపీ మిగతా నాయకులందరికీ వర్తిస్తే,  మోదీ మాటే  ఆర్ఎస్ఎస్ వింటోందని ఒక స్పష్టతకు  రావొచ్చు.  మోదీ అనుకూల  మీడియాలో  దీనికి సంబంధించి పెడు తున్న పోస్టులు,  తద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గమనిస్తే.. అమిత్ షాకు ప్రధానమంత్రి కావాలని కోరిక ఉందా?  అనే సందేహం కలుగుతోంది. 

అభినవ చాణుక్యుడు షా!

బీజేపీ నాయకులు అభినవ చాణుక్యుడు అని పిలుచుకునే అమిత్ షా,  అపర చాణుక్యుడిలాగే  ఎత్తులు వేసి, ఆయన కింద పనిచేసే టెక్నోక్రాట్స్ టీమ్​తో,   ఈ నిబంధనను ఎన్నికల తర్వాత తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారేమో? అందుకే ఈ ముందస్తు చర్చ- ప్రచారమేమో? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ప్రధానమంత్రి  కావాలనుకుంటున్న నాయకులు కూడా,  ఏదైనా  మోదీ  తర్వాతే  అనే భావనలో ఉన్నారు.  మోదీకి 75 ఏండ్లు నిండిన మీదట కూడా వీరంతా ఆగుతారా?  మోదీజీ  ‘దిగిపో’ అనే ధైర్యం వీరిలో ఎవరికైనా ఉంటుందా?  అసలు మోదీ తర్వాత నెంబర్ 2 ఎవరు?  ఇవన్నీ బీజేపీ అంతర్గత సమస్యలే!  ఇప్పటికైతే  లేలేత  ప్రశ్నలే!

80‌‌‌‌–83 ఏండ్ల వయసు వరకు..మురార్జీ, వాజ్​పేయి, మన్మోహన్ పీఎంగా ఉన్నారు

నిజానికి 75 ఏండ్లు పైబడినవాళ్లు  ప్రధానమంత్రిగా కొనసాగడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.  దీనికి మన దేశానికి ప్రధానమంత్రులుగా  పనిచేసినవారి  వయసును  పరిగణనలోకి తీసుకుంటే  సరిపోతుంది. 63 ఏండ్ల వయసులో నరేంద్ర మోదీ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  పదేండ్లుగా పదవిలో కొనసాగుతున్న ఆయనకు ఈ సంవత్సరం సెప్టెంబర్ లో  74 సంవత్సరాలు నిండుతాయి.  మన  దేశ ప్రధానుల్లో  మొరార్జీ దేశాయ్ 81 ఏండ్ల వయసులో ప్రధానమంత్రి అయ్యి 83 ఏండ్లకు రిటైర్ అయ్యారు.  71 ఏండ్లకు  ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్  81 ఏండ్ల  వయసులో  ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయారు.  71 ఏండ్ల వయసులో మొదటిసారి ప్రధానమంత్రి అయిన వాజ్​పేయి,  80 ఏండ్ల వయసులో  ఆ పదవీకాలాన్ని ముగించారు.  74 ఏండ్ల వయసులో  ప్రధానమంత్రిగా ఉండగానే  జవహర్ లాల్ నెహ్రూ చనిపోయారు. 75 ఏండ్లకే పీవీ నరసింహారావు  ప్రధానమంత్రి  పదవీకాలం ముగిసింది . చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే , నరేంద్ర మోదీ సులభంగా ఇంకో ఐదేండ్లు  ప్రధానమంత్రిగా కొనసాగవచ్చు.  

అమిత్​ షా వివరణ

ఒకరి తర్వాత ఒకరు  దేశవ్యాప్తంగా  బడా నాయకులంతా మోదీ వయసు మీద మాట్లాడటం మొదలెట్టారు.  దీనికి కౌంటర్​గా  బీజేపీ నాయకులు  అడ్డుకట్ట  వేయాలని ప్రయత్నించినా... ఫలించలేదు.  దీంతో హోంమంత్రి  అమిత్ షా బీజేపీలో అలాంటి రూల్ ఏమీ లేదని,  మోదీయే ప్రధానమంత్రిగా కొనసాగుతారని  పలు సభల్లో,  సమావేశాల్లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.  ‘2029 తర్వాత కూడా మోదీయే మా నాయకుడు, ఆయన నేతృత్వంలోనే ఎప్పుడూ మా పార్టీ పనిచేస్తుంది’ అని చేసిన షా వ్యాఖ్యలో వ్యంగ్యం ఏమైనా ధ్వనిస్తోందా? అని ప్రత్యర్థులు భూతద్దం వేసుకొని వెతికారు. ఆయన ఎంత సమర్థంగా వివరణ ఇచ్చినా సరే, 2019లో అమిత్ షా ఒక సందర్భంలో  75 ఏండ్లకు రిటైర్ అవ్వాల్సిందే అని చేసిన వ్యాఖ్యలు ‘అప్పుడు, ఇప్పుడు’ పేరుతో దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలు మీడియా సంస్థలు సైతం ఈ ఎపిసోడ్​ని సందేహాత్మకంగా ప్రజల ముందుకు తేవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 

మోదీ కాకుంటే ఎవరు?

మోదీ కాకుంటే ఎవరు? అంటే  చాలామంది నోటి వెంట  అమిత్ షా,  ఆర్ఎస్ఎస్  మూలాలు బలంగా ఉన్న  నితిన్ గడ్కరీ,  ఉత్తరప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  పేర్లు  వినపడటం మామూలే.  అయితే, మోదీ పేరును సందేహంలో  పడవేసి వీళ్లను  ముందుకు తీసుకొస్తే  బీజేపీకి ఓట్లుపడే పరిస్థితి లేదు.  దేశంలో ఏ మూల చూసినా మోదీకి ఒక రకమైన ఆకర్షణ, బలమైన  ముద్ర వేయగల  ప్రభావం ఉన్నాయి.  ఇతర ఏ బీజేపీ నాయకులకు ఆ సత్తువ,  సంపద లేదు.   

వయసు పక్కన పెడితే మోదీ ఆరోగ్యవంతుడు

ప్రతిపక్షాల  ఆరోపణలు పక్కనపెట్టి, ఆయన ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నా... ఇప్పుడున్న  కేంద్ర మంత్రులలో  మోదీయే సంపూర్ణ ఆరోగ్యవంతుడు . దేశవ్యాప్తంగా  లోక్​సభ ఎన్నికల ప్రచారానికి  అత్యధిక సమయం  కేటాయిస్తున్నది  కూడా ఆయనే!  మరో విశేషం ఏమిటంటే ఆయన నిర్దేశించుకున్న అమృత కాలం 2047.  అంటే,  భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవం! అప్పటిదాకా ఉండి, వీలయితే అధికారంలో ఉండి ఆ ఉద్విగ్న క్షణాలను మోదీ చూడాలనుకుంటుండవచ్చు. అలాంటప్పుడు, ఈ ఎన్నికల తర్వాత ఆయన పథం,   పంథా సమూలంగా మారే అవకాశాలే ఎక్కువ!  అందుకే,  బీజేపీకి ఈ ఎన్నికలు ఎలా చూసినా అగ్నిపరీక్షే!  అంటే, దశాబ్ద కాలంగా ఒకే రీతిలో  సాగుతూ వస్తున్న మన దేశ రాజకీయాలు..జూన్ 4 తర్వాత కొత్త మలుపు తీసుకుంటాయనడంలో సందేహం లేదు.

- దిలీప్​రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్​, పీపుల్స్​పల్స్​ రీసెర్చ్​ సంస్థ