వన్యప్రాణుల తండ్లాట..దాహార్తి తీర్చుకునేందుకు గ్రామాల్లోకి

  •     ప్రజలపై దాడులతో ఆందోళన
  •     పొంచి ఉన్న వేటగాళ్ల ముప్పు

అమ్రాబాద్, వెలుగు : అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​లో వన్యప్రాణులు నీటి కోసం తండ్లాడుతున్నాయి. దంచికొడుతున్న ఎండలకు తోడు అడవిలో ఎగిసిపడుతున్న మంటలు, తగ్గిన భూగర్భ జలాల కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. గత ఏడాది అంతంతమాత్రంగా కురిసిన వర్షాలు, పెరిగిన ఉష్ణోగ్రతలతో అడవుల్లోని నీటి వనరులు ఎండిపోతున్నాయి. నీటికోసం గ్రామాలకు వస్తున్న వన్యప్రాణులు ప్రజలపై దాడికి పాల్పడి గాయపర్చడమే కాకుండా వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృత్యువాత పడుతున్నాయి.

ఈ క్రమంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఫారెస్ట్  ఆఫీసర్లు రూ.78 లక్షల ఫండ్స్​ అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. రెండేండ్లుగా కంపా నిధులు రాకపోవడంతో ఉన్న నిధులతో ఫారెస్ట్  ఆఫీసర్లు నెట్టుకొస్తున్నారు. టూరిజం ఫండ్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వన్యప్రాణుల దాహార్తి తీర్చే ప్రయత్నం చేస్తున్నా పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కావడం లేదు.

ఏటీఆర్​ స్వరూపం..

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్) కోర్  ఏరియా 2166.37 చ.కిమీ, బఫర్ ఏరియా 445.02చ.కిలోమీటర్లతో కలిపి 2611.4 చ. కిమీ విస్తీర్ణంతో విస్తరించి ఉంది. నేషనల్  టైగర్  కన్జర్వేటర్(ఎన్టీసీఏ) అధికారిక లెక్కల ప్రకారం 2018లో 12 పులులు, 2021లో 21, ప్రస్తుతం 32 పులులు, 176 చిరుత పులులు, 250 ఎలుగుబంట్లు, 10 వేలకు పైగా ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. వీటితో పాటు వివిధ రకాల పక్షులు, సరీసృపాలు, కీటకాలు

ఆయుర్వేద మొక్కలు, అరుదైన వృక్ష సంపదకు లెక్కలేదు. కృష్ణా నది సరిహద్దులో ఉండడంతో ఏటీఆర్ లోకి ఇతర ప్రాంతాల నుంచి పక్షులు, జంతువులు వలస వస్తుంటాయి. ప్రతి ఏటా వన్యప్రాణుల సంతతి గణనీయంగా అభివృద్ది చెందుతోంది. కాగా నీటి సమస్యతో వలస వచ్చే వన్యప్రాణులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.

అగ్నిప్రమాదాలతో తిప్పలు..

అడవిలో ఎండిన గడ్డి, రాలిన ఆకుల కారణంగా తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పర్యాటకులు, పశువుల కాపారులు, అటవీ ఉత్పత్తుల కోసం వచ్చే వారు అడవిలో మంటలకు ప్రధాన కారణమని ఫారెస్ట్  ఆఫీసర్లు చెబుతున్నారు. అడవిలో తరచూ ఎగిసి పడే మంటలతో వన్యప్రాణులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. మంటల నుంచి బయట పడి పరిగెత్తే క్రమంలో రాళ్లకు ఢీకొని

కొయ్యలకు తగిలి వన్యప్రాణులు ప్రాణాలు పోగొట్టుకుంటుండగా, మరికొన్ని కొత్త ఆవాసంలో నీటి వనరులు దొరకక చనిపోతున్నాయి. అడవిలో నీళ్లు లేక గ్రామాల్లోకి, సమీప పంట పొలాల్లోకి రావడంతో వేటగాళ్లు వాటిని చంపుతున్నారు. అలాగే పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కరెంట్  వైర్లు పెట్టడం, ఉచ్చులు బిగించడంతో వన్యప్రాణాలు చనిపోతున్నాయి. 

దాహార్తి తీర్చేందుకు.. 

ఏటీఆర్ లో వన్యప్రాణుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. వాటి అవసరాలు తీర్చేందుకు ఫారెస్ట్  వైల్డ్  లైఫ్  మేనేజ్​మెంట్ లో భాగంగా గ్రాస్  లాండ్  మేనేజ్​మెంట్, ఫైర్  మేనేజ్ మెంట్, వాటర్ కన్జర్వేషన్, వీడ్  మేనేజ్​మెంట్, ప్లాంటేషన్, ప్రొటెక్షన్  వంటి ప్రత్యేక చర్యలు చేపడతారు. వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ఫారెస్ట్  ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తారు. ప్రజలకు అవగాహన, ఫైర్  ప్రొటెక్షన్, వాచర్ల నియామకం, శాటిలైట్  అలర్ట్  సిస్టం, నీటి వనరులపై దృష్టి పెడతారు. 1150 సాసర్ ఫిట్స్

81 చెక్ డ్యామ్ లు, చెలిమలు, పర్కులేషన్  ట్యాంక్ లు, రాక్  ఫీల్డ్  డ్యామ్, 30 సోలార్  బోర్ వెల్స్​ ఉన్నాయి. వీటి నిర్మాణం, రిపేర్ల కోసం ప్రతి ఏటా రూ.కోటికి పైగా ఖర్చయ్యేది. ఇటీవల ఐసీఐసీఐ ఫౌండేషన్  వారు 5 ట్రాక్టర్లు, వాటర్  ట్యాంకులు అందించారు. వీటి ద్వారా ఏటీఆర్ లోని కొన్ని రేంజ్ ల పరిధిలో నీటి సరఫరా చేస్తున్నారు. దీంతో ఖర్చు కొంత తగ్గింది. ప్రస్తుతం రూ.78 లక్షల వరకు అవసరం అవుతుందని ఫారెస్ట్  ఆఫీసర్లు ప్రభుత్వానికి నివేదికలు పంపించినా రెండేండ్లుగా ఫండ్స్​ అందడం లేదు. ఇది వన్యప్రాణుల పాలిట శాపంగా మారుతోంది.

ఎలుగుబంటి దాడితో తీవ్రగాయాలు..

అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని జేపీ కంపెనీలో ఎలక్ట్రిక్  వైండర్ గా పని చేస్తున్న క్షత్రజ్ఞ లాల్ చంద్ పై శుక్రవారం రాత్రి ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. లాల్ చంద్  కేకలు వేయడంతో సిబ్బంది, గ్రామస్తులు ఎలుగుబంటి నుంచి అతడిని కాపాడారు. ఫారెస్ట్  సిబ్బంది ఎలుగుబంటిని సమీప అడవిలోకి తరిమారు. గాయపడ్డ అతడికి కంపెనీ డిస్పెన్షరీలో ట్రీట్​మెంట్​ చేసి, మెరుగైన వైద్యం కోసం ఏపీలోని సున్నిపెంటకు తరలించారు. లాల్​చంద్​కు ఎలాంటి ప్రమాదం లేదని దోమలపెంట ఎఫ్ఆర్వో గురు ప్రసాద్  తెలిపారు. 

తగిన చర్యలు తీసుకుంటాం..

అడవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. సహజ నీటి వనరుల వద్ద సోలార్  పంప్  సెట్స్  ఏర్పాటు చేశాం. సాసర్  పిట్స్  రిపేర్  చేయాలని ఎఫ్ఆర్వోలకు సూచించాం. టూరిజం ఫండ్స్ తో ఏర్పాట్లు చేస్తున్నాం. వేటగాళ్ల నియంత్రణపై దృష్టి పెట్టాం. వన్యప్రాణులను వేటాడితే కఠినంగా వ్యవహరిస్తాం. వన్యప్రాణులు దాడి చేస్తే నష్ట పరిహారం అందిస్తాం.

-  రోహిత్ గోపిడి, డీఎఫ్​వో