కాసుల కోసం ఫేమస్​ రెస్టారెంట్ల కక్కుర్తి

  • కుళ్లిన మాంసం, మిగిలిన అన్నం వండి వడ్డిస్తున్నరు 
  • పెరిగిన ఎక్స్​పైరీ ఐటమ్స్ వాడకం..
  • ఎక్కడ చూసినా అపరిశుభ్ర కిచెన్లే...  
  • నగరంలో ఫుడ్​సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైన నిజాలు 

హైదరాబాద్ సిటీ, వెలుగు : వీకెండ్​ ఫ్యామిలీతో కలిసి ఏదైనా ఫేమస్​ హోటల్​కో, రెస్టారెంట్​కో వెళ్లి మంచి ఫుడ్​ ఎంజాయ్ ​చేద్దామనుకుంటున్నారా?  ఈ మధ్య ఎక్కడ చూసినా కల్తీ జరుగుతోందని పేరు మోసిన రెస్టారెంట్లకు వెళ్లి మంచి ఫుడ్​లాగిద్దామని ప్లాన్స్ ​వేసుకుంటున్నారా? అయితే కొంచం జాగ్రత్త...రెండు రోజుల కింద ఫుడ్​సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బ్రాండెడ్​అని చెప్పుకుంటున్న హోటల్స్​, రెస్టారెంట్లు, కేఫ్​లల్లో లోపాలు బయటపడ్డాయి. ఫ్రిజ్​లో నిల్వ చేసిన మాంసం, అన్నం, ఎక్స్​పైరీ అయిన ఆహార పదార్థాలు, పిండి, అపరిశుభ్రమైన కిచెన్​ఇలా తనిఖీలు చేసే కొద్దీ వాటిలోని అసలు క్వాలిటీ బయటపడింది. ఈ విషయాలన్నీ సదరు అధికారులు ఎక్స్​లో పోస్ట్​ చేశారు. 

ఎక్కడెక్కడ తనిఖీ చేశారంటే..

బంజారాహిల్స్​లోని రాజా డీలక్స్ రెస్టారెంట్ లో.. ఈ నెల 2వ తేదీన ఫుడ్​సేఫ్టీకి చెందిన టాస్క్​ఫోర్స్​సిబ్బంది తనిఖీలు నిర్వహించగా రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా కనిపించింది. లోపల నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలకు అసలు లేబులే లేదు. వెజ్, నాన్ వెజ్ ఫుడ్ కలిపి అదే రిఫ్రిజిరేటర్‌‌లో నిల్వ చేశారు. కిచెన్​లో బ్యాన్​చేసిన సింథటిక్ ఫుడ్ కలర్స్ కనిపించాయి. కింద ఫ్లోర్​తో పాటు నీళ్లు పోవడానికి ఏర్పాటు చేసిన గ్రిల్స్​కాల్వ నీటితో నిండి ఉంది.

బంజారాహిల్స్​లోనే ఉన్న హైకూ రెస్టారెంట్​ను..తనిఖీ చేయగా కిచెన్​లో నీళ్లు నిలిచిపోయి అందులో ఆహార వ్యర్థాలు కనిపించాయి. ఎక్స్​పైరీ అయిన జీలకర్ర, నువ్వులు, చింతపండు, కొన్ని పిండి రకాలను గుర్తించారు. ఫ్రిజ్​లలో స్టోర్​చేసిన కొన్ని ఆహార పదార్థాలకు లేబుల్స్​కనిపించలేదు. వంటగది లోపల టైల్స్ విరిగిపోయినట్లు గుర్తించారు.

బంజారాహిల్స్ ​నీలోఫర్ రెస్టారెంట్​లోని..రిఫ్రిజిరేటర్‌‌లో లేబుల్ లేని మసాలాలను గుర్తించారు. డిస్‌‌ప్లేలో పెట్టిన కేక్​లకు లేబుల్స్​లేవు. కిచెన్​లో ఎక్స్​పైరీ అయిన అరకిలో చీజ్, చాలా రోజుల కిందట వేయించిన ఐదు కిలోల పల్లీలు కనిపించాయి. ఇక్కడే కాకుండా నగరంలో పలు రెస్టారెంట్లు, హోటల్స్​లో ఎన్నో లోపాలు బయటపడ్డాయి.  

​హబ్సిగూడలోని భీమవరం పులావ్​లో ఫంగస్ వచ్చిన కూరగాయలు, స్టోరేజీ ర్యాక్స్​లో బొద్దింకలను గుర్తించారు. కృతుంగలో 10 కిలోల ఫంగస్ వచ్చిన పల్లీలు, వెజ్, నాజ్ వెజ్ ఐటెమ్​లను ఒకే రిఫ్రిజిరేటర్‌‌లు నిల్వ ఉంచడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు.

గ్రేటర్​లో లక్ష హోటల్స్​

గ్రేటర్ హైదరాబాద్​లో చిన్న, పెద్ద హోటల్స్ కలిపి సుమారు 90 వేల నుంచి లక్షల వరకు ఉంటాయని ఒక అంచనా. ఇందులో 40 శాతం వరకు ఎటువంటి లైసెన్సులు లేకుండానే బిజినెస్​ చేస్తున్నాయి. అయితే కొంతమంది యజమానులు కాసుల కోసం కక్కుర్తిపడి కస్టమర్లకు క్వాలిటీ ఫుడ్​అందించడంపై శ్రద్ధ చూపడం లేదు. కిచెన్లలో శుభ్రత పాటించడం లేదు.  గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తే కస్టమర్లు అనారోగ్యానికి గురవుతారని తెలిసినా అలాగే వాడేస్తున్నారు.

ఇంకొందరైతే కుళ్లిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జిల్లో నిల్వ చేసి ఫ్రై అడిగిన వారికి వండి పెడుతున్నారు. ఈ రోజు మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్​లో పెట్టి తెల్లారి ఎగ్​ఫ్రైడ్​రైసో, చికెన్​ఫ్రైడ్​రైసో వడ్డిస్తున్నారు. ఇదంతా నగరంలో పేరుమోసిన హోటల్స్, రెస్టారెంట్లలో జరుగుతోందని ఫుడ్​సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.  

బయటపడుతున్న నిజాలు 

నగరంలో పేరున్న హోటల్స్, రెస్టారెంట్లలో క్వాలిటీ పాటించడం లేదని తెలుసుకున్న స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు కొంతకాలంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ చెకింగుల్లో ఎక్కువగా క్వాలిటీ లేని ఫుడ్​నే సర్వ్​చేస్తున్నట్టు గుర్తించారు. పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లే కాకుండా బార్లు, పబ్బుల్లోనూ ఇదే తరహా ధోరణి కొనసాగుతోందని తేల్చారు. 

నూటికి తొంబై శాతం హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు, పబ్బుల్లో కిచెన్లను నీట్​గా మెయింటెయిన్​చేయకపోవడం చూసి అధికారులు, సిబ్బంది షాక్​ తిన్నారు. దాదాపు ప్రతి చోటా ఫ్రిజ్​లలో మాంసాన్ని, ఫ్రై చేసిన మటన్, చికెన్​నిల్వ ఉంచుతున్నారని కనుగొన్నారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన బిజినెస్​చేస్తున్న కొంతమంది యజమానులపై కేసులు కూడా నమోదు చేశారు.  

కిచెన్ ​ఎప్పుడూ సీక్రెట్​ ప్లేసే..

ఫుడ్​సేఫ్టీ స్టాండర్డ్స్​ప్రకారం కిచెన్​ను ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచాలి. కుళ్లిపోయిన కూరగాయాలు, ఎక్స్​పైరీ అయిన ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు చెక్​చేసి బయటపడేయాలి. నిల్వ ఉంచిన మాంసాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. లేబుల్స్​ఉన్న ఫుడ్​ను మాత్రమే సర్వ్​చేయాలి. ఫుడ్​ఐటమ్స్​లో వాడే పదార్థాలపై మ్యాన్​ఫ్యాక్చరింగ్​డేట్, ఎక్స్​పైరీ డేట్​ ఖచ్చితంగా ముద్రించి ఉండాలి. వెజ్​ఫుడ్, నాన్​వెజ్​ఫుడ్​ప్రియులు వేరు వేరుగా ఉంటారు కాబట్టి ఎప్పుడూ రెండు రకాలను ఒకే చోట నిల్వ చేయకూడదు. 

చెఫ్​లతో పాటు అక్కడ పని చేస్తున్న సిబ్బంది తల వెంట్రుకలు ఫుడ్​లో పడకుండా హెడ్​ క్యాప్​ పెట్టుకోవాలి. కానీ ఈ రూల్స్​చాలామంది పాటించడం లేదు. అంతేగాకుండా క్వాలిఫైడ్​చెఫ్​లను పెట్టుకోకుండా వంట  ఎవరికి వస్తే వారిని నియమించుకుంటున్నారు. ఈ లోపాలన్నీ బయటపడతాయని చాలా హోటల్స్, రెస్టారెంట్లు తమ కిచెన్​ను ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాయి.

ఫుడ్ క్వాలిటీపై ఫిర్యాదులు చేయొచ్చు 

చాలామంది తాము తింటున్న ఫుడ్​క్వాలిటీగా లేకపోయినా, వాసన వచ్చినా లేదా ఎటువంటి లోపాన్ని గుర్తించినా అధికారులకు ఫిర్యాదు చేయడం లేదు. కొంతమంది ఫిర్యాదు చేద్దామనుకున్నా ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియకపోవడం కూడా సమస్యగా మారింది. దీంతో ఫుడ్​సేఫ్టీ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ ఫుడ్​సేఫ్టీ వింగ్​అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. 

ఎక్కడైనా సమస్య తలెత్తితే  9100105795 నంబర్​కు కాల్​చేయవచ్చని లేకపోతే diripmtg@gmail.com లేదా fssmutg@gmail.com కి మెయిల్​చేయవచ్చంటున్నారు. అలాగే ఎక్స్​ద్వారా అయితే @cfs_telangana కు ఫిర్యాదు చేయవచ్చని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అయితే 040–21111111 కు కాల్​చేయడమో లేక foodsafetywing.ghmc@gmail.com మెయిల్​ చేయవచ్చని అంటున్నారు. ఎక్స్​అయితే @afcghmc కి ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు.   

క్రిమినల్​ కేసులు నమోదు చేస్తం

జనాలకు క్వాలిటీ ఫుడ్ అందించేలా చూడడమే మా ముందున్న లక్ష్యం. రెగ్యులర్​గా హోటల్స్ లో తనిఖీలు చేస్తున్నాం. ఎక్కువగా కిచెన్ క్లీన్ గా ఉంచకపోవడం, ఎక్స్​పైరీ అయిన, ఫ్రిజ్​లలో ఉంచిన ఐటమ్స్​వాడడాన్ని గుర్తించాం. ఎక్కడైనా ఫుడ్ అన్ సేఫ్ అని రిపోర్టు వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఈ మధ్య ప్రజల నుంచి కడా ఫిర్యాదులు బాగానే వస్తున్నాయి.  

- ఆర్వీ కర్ణన్, కమిషనర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఫుడ్‌‌ సేఫ్టీ