ఆధ్యాత్మికం: ఇంట్లో పూజ చేసినా.. గుడికి ఎందుకు వెళ్లాలో తెలుసా..

హిందువులు దాదాపుగా అందరూ ఇంట్లో ఇష్ట దైవానికి పూజ చేస్తారు.  సమమాన్ని బట్టి దండం పెట్టి .. అగర్​ బత్తీ వెలిగించిన తరువాత రోజువారీ పనులకు వెళుతుంటారు.  కొంతమంది మంగళవారం ఆంజనేయస్వామి గుడికి..గురువారం సాయిబాబా గుడికి.. శనివారం ఆంజనేయస్వామి గుడికి వెళుతుంటారు. ఇక వీకెండ్ రోజుల్లో.. పిల్లలకు సెలవు రోజుల్లో తీర్ధయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.  కొంతమంది మొక్కులు కూడా చెల్లిస్తారు.. ఇంట్లో రోజూ దేవుడిని పూజిస్తున్నాం కదా.. గుళ్లకు వెళ్లాలా.. అనే  సందేహం వస్తుంది.  ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.. . .

ఇంట్లో దేవతారాధన చేస్తాం. అలాంటప్పుడు గుడికి వెళ్లి పూజ చేయడం ఎందుకు.. అనే సందేహం చాలా మందికి వ‌స్తుంది. అయితే... దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దానిమీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. ఈ  చక్రంలో  బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తైనా ప్రతి కోణానికీ తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమి లోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తి క్షేత్రం ఏర్పడుతుంది.

Also Read : నరకాశురుడి తల్లి సత్యభామే

నిజానికి స్వయంభూ దేవాలయాలన్నింటి దగ్గరా ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి. అలా దేవుడు వెలసిన చోటును రుషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక.. మంత్రబలంతో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్లో నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్ల తరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్లడం గొప్ప విషయంగా చెబుతారు..