కవర్ స్టోరీ : మా నెట్​వర్క్​ కెరీర్​

మూడు కొప్పులు కూడితే పట్టపగలే చుక్కలు పొడుస్తాయి
మూడు కొప్పులు ఏకమైతే ముల్లోకాలూ ఏకమవుతాయి

ఇలాంటి సామెతలన్నీ చెత్తబుట్టలో చేరి బూజు పట్టిపోయాయి. ‘చేసేది ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, చిన్నపాటి కుటీర పరిశ్రమ నడుపుతున్నా... మేం అంతా ఒకరికొకరం చేయి పట్టుకుని ముందుకెళ్తాం. పనిలో, ఆలోచనలో, భావోద్వేగాల్లో, క్లిష్ట​ పరిస్థితుల్లో ఒకరికొకరం అండగా ఉంటాం’ అంటున్నారు ఈ తరం మహిళలు. ప్రత్యేకంగా ‘మహిళలకు మాత్రమే’ (విమెన్​ ఓన్లీ నెట్​వర్క్)​ గ్రూపులను ఏర్పాటుచేసుకుంటున్నారు. 

ఇలాంటి గ్రూపుల్లో ఏం చేస్తారు? చాయ్​ బిస్కెట్​ తినో, విందు భోజనాలు ఆరగించో ‘హాయ్​’, ‘బాయ్​’ అని చెప్పుకుని రావడమే కదా’ అని తేలికగా తీసుకోవద్దు. ఇలా ఆలోచించకుండా ఉండాలంటే ఆ గ్రూపుల పనితీరు గురించి తెలుసుకోవాలి. అలాగే కెరీర్​ గ్రోత్​లో నెట్​వర్కింగ్​ సర్కిల్స్​ అనేవి ఎంత ఇంపార్టెంట్​ అనేది తెలియాలి.

మహిళలు నాలుగ్గోడలను దాటుకుని బయటికి వస్తున్నారు. పలు రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కెరీర్​లోకి అయితే అడుగుపెడుతున్నారు. కానీ... ఆ కెరీర్​లోఎంతవరకు ఎదగగలుగుతున్నారు? ఉన్నత స్థానాలకు ఎంతమంది చేరుతున్నారు? కెరీర్​లో పైకి ఎదిగేందుకు ఉన్నతస్థాయిలో అంటే మేనేజిరియల్​ స్థాయిలో నెట్​వర్కింగ్​ సర్కిల్స్​ ఏర్పరచుకుంటున్నారా? 

అలా ఏర్పరచుకోవడం మహిళలకు సాధ్యమవుతుందా? అసలు కెరీర్ ​గ్రోత్​కు ఈ సర్కిల్స్​ అవసరమా...?  అని ఆలోచించే వాళ్లు ఆ ఆలోచనలను అంతటితో ఆపేయాలి. ఎందుకంటే ‘ఎంతో డెవలప్​ అయిపోయాం. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​తో తిమ్మిని బమ్మిని చేసేస్తున్నాం. ఆహా... ఓహో...’ అంటూ తెగ హడావిడి చేస్తున్నా... వర్కింగ్​ విమెన్ కెరీర్​ ఎదుగుదల విషయంలో మాత్రం అంత డెవలప్​మెంట్​ ఏమీ కనిపించడంలేదు. 

అలా ఎందుకు అని ఆలోచిస్తే... వర్క్​స్పేస్​లో సింహభాగం పురుషాధిక్యతే రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగినుల కెరీర్ గ్రోత్​కు సాయం చేసేందుకు మహిళలు మాత్రమే ఉన్న నెట్​వర్కింగ్​ గ్రూప్స్​ ఏర్పడుతున్నాయి. ఈ గ్రూపుల్లో కొన్నింటిని మేనేజిరియల్​ స్థాయిలో ఉన్న కొందరు ఆడవాళ్లు నడుపుతున్నారు. ‘లెర్న్​ అండ్​ గ్రో’ అంటూ ఉద్యోగినులకు సాయం చేస్తున్నారు. 

ఇలా విమెన్​ ఓన్లీ గ్రూపులు ఏర్పాటుచేసుకునే మహిళల సంఖ్య, వాటిలో చేరుతున్న మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది. ‘‘వీటి అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఉంది. ఎందుకంటే రెగ్యులర్​ నెట్​వర్కింగ్ గ్రూప్స్​ మహిళల కెరీర్​కి అవసరమైనంత సాయం చేయడంలేదు” అంటున్నారు ఆయా గ్రూపుల మహిళా సభ్యులు.

మూడు కొప్పులు కాదు.... మూడులక్షల పైనే...

వేణి, నేహ– ఈ రెండు ఉదాహరణల్లో చెప్పుకున్నట్టు వర్కింగ్​ విమెన్​లో ఎక్కువమంది ‘మహిళలు మాత్రమే ఉన్న గ్రూప్స్​’తో కనెక్ట్​ అవుతున్నారు. రెగ్యులర్​ నెట్​వర్కింగ్ గ్రూప్స్​ వాళ్లకు ఉపయోగపడే సలహాలను ఇవ్వడం లేదు. దానివల్ల కెరీర్​లో చాలాసార్లు ఇరకాటమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు. కెరీర్​ ఎదుగుదల కోసం చాలా గట్టిగా ఉండాలి అనుకుంటారు. అలాగని గొడవలమారిగా ఉండాలనుకోరు. ఇలాంటి విషయాలే కాకుండా జెండర్​ పే గ్యాప్స్​, లీడర్​షిప్ రోల్స్​లో ఆడవాళ్ల రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల ఛాలెంజ్​లు​ ఎదుర్కోలేకపోతున్నారు.

 ఈ విషయాల గురించి ఆలోచించే వాళ్లు కూడా ఉండట్లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ విషయాలన్నింటి  గురించి ఆలోచించి, వాటి గురించి డిస్కస్​ చేసే వాళ్లు ఉంటే మంచిదని ‘కోటో. నెట్​వ​ర్కింగ్’​ ప్లాట్​ఫామ్​ ఏర్పాటుచేశాం. అక్టోబర్​ 2022న కోటోను మొదలుపెట్టాం. ఇందులో ఇప్పుడు నాలుగు లక్షల మంది సభ్యులు, ఏడువేల కమ్యూనిటీలు ఉన్నాయి. రకరకాల ఆసక్తులు ఉన్న గ్రూప్స్​ కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు వాళ్లు మీట్​ అవ్వాలనేది కమ్యూనిటీల హెడ్స్​ డిసైడ్​ చేస్తారు. పిల్లల రక్షణ, కుటుంబాన్ని  మేనేజ్​ చేయడం అనే బాధ్యతలు ఆడవాళ్ల మీద అసమానం​​గా పడతాయి. 

అంటే ఇంట్లో వాళ్లు ఆ బాధ్యతలను సమానంగా షేర్​ చేసుకోరు. అలాంటి వాటివల్ల ఆడవాళ్లకి ఆఫీస్​, ఇంటి పనుల మధ్య ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంది’’  అని ఆ ప్లాట్​ఫామ్​ సహవ్యవస్థాపకురాలు 46 ఏండ్ల అపర్ణా అచ్రేకర్​ అన్నారు. ఇలాంటి విషయాలన్నింటినీ షేర్​ చేసుకుని, కెరీర్​లో ఎదిగేందుకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు విమెన్​ ఓన్లీ నెట్​వర్కింగ్​ ప్లాట్​ఫామ్స్​ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. 

ఒక స్నేహం... ఒక సలహా...

‘‘వ్యాపారాలు చేసే వాళ్లు ఏ విషయం గురించైనా మాట్లాడాలన్నా, ఏదైనా కొత్తగా ఏర్పాటు చేయాలన్నా, జాగ్రత్తలు తీసుకోవాలన్నా, సెలబ్రేట్​ చేసుకోవాలన్నా ... వాళ్లలా ఆలోచించే వాళ్లు కావాలి అనుకుంటారు” అన్నారు ఎలీషా సైగల్​. నలభై ఏండ్ల వయసున్న ఎలీషా ముంబయిలో ‘ఎట్​​ సోల్​ స్ట్రాటజిక్​ కన్సల్టెంట్స్’​ ఫౌండర్​, సీఈఓ. ఈమె మల్టిపుల్​ నెట్​వర్కింగ్ గ్రూప్స్​లో భాగమయ్యారు. వాటిలో ‘లేడీస్​ హు లీడ్’ ఒకటి. ఈ గ్రూపుతో ఐదేండ్లుగా జర్నీ చేస్తున్నారామె. ‘‘బిజినెస్​ చేసేటప్పుడు మన టీమ్స్​తో విజన్​, గెలుపులు, యాన్యువల్​ గోల్స్​ గురించి మాట్లాడుతుంటాం. 

కానీ అవన్నీ కాకుండా మనకంటూ ఒక క్లోజ్డ్​ సర్కిల్​ కావాలి. ఆ సర్కిల్​ మనల్ని సరి చేయాలి. మన ఆలోచనలను రిఫ్లెక్ట్​ చేయాలి. మోటివేట్​ చేయాలి. అందుకు విమెన్​ నెట్​వర్కింగ్​ గ్రూప్​లు అవసరం. అక్కడ మాట్లాడుకునే మాటల వల్ల బుర్రకు పదును పెడతాయి. కొత్త ఆలోచనలకు నాంది వేస్తాయి. ఇలా చెప్తున్నానని ఈ గ్రూపుల్లో ఎప్పుడూ సీరియస్​ విషయాలు మాట్లాడుకుంటాం అనుకునేరు. అన్​లెర్న్​, లెర్న్​ ప్రాసెస్​లో పార్టీలు చేసుకుంటూ ఒకరినుంచి ఒకరం ఎన్నో నేర్చుకుంటుంటాం. ఒకేలాంటి బిజినెస్​ చేస్తున్న వాళ్లం వాటిలో వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటాం. ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలు చర్చించుకుంటాం. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రొఫెషనల్​గా, ఫ్రెండ్లీగా రెండు రకాలుగా హెల్ప్​ చేసుకుంటాం” అన్నారామె.

ఊరు.. సిటీ.. దేశం దాటి...

మహిళలు మాత్రమే ఉండే ఇలాంటి సపోర్టు గ్రూప్స్​ వల్ల ఎక్స్​పీరియెన్స్​లను ఎలాంటి శషభిషలు లేకుండా మనసారా చెప్పుకోగలం. అలా మాట్లాడుకోవడం వల్ల సహానుభూతితో ఉంటాం” అంటున్నారు రాధిక యువరాజ్​ అయ్యంగార్​. ఈమెకు 47 ఏండ్లు. ‘టెక్​ గ్లోబల్’​కు ఇండియా కంట్రీ డైరెక్టర్​. ఈ ఆర్గనైజేషన్​ స్టెమ్​(సైన్స్​, టెక్నాలజీ, ఇంజినీరింగ్​, మ్యాథమెటిక్స్​)లో ఛాంపియన్​గా ఉంది. ‘‘ప్రపంచవ్యాప్తం​గా ఈ గ్రూప్​లో పదివేల మంది సభ్యులు ఉంటే... ఇండియాలో 528 మంది సభ్యులు ఉన్నారు. 

ఇండియాలో ఆరేండ్ల క్రితం మొదలైన ఈ గ్రూపు సభ్యులు వారానికి ఒకసారి కలుస్తారు. గ్లోబల్​ మీటప్​ రెండు నెలలకు ఒకసారి జరుగుతుంది. అందులో వర్చువల్​, పర్సనల్ మీటింగ్స్​ ఉంటాయి. ఇండియాలో​ వర్కింగ్ విమెన్​ ఎదుర్కొంటున్న స్ట్రగుల్​ గురించి ఇండియాలో ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. మాట్లాడుతున్నారు కూడా. ఆ విషయాల గురించి ఈ ప్లాట్​ఫాం ద్వారా ఇప్పుడు అన్ని దేశాల వాళ్లు మాట్లాడుతున్నారు. వర్క్​ – లైఫ్​ బ్యాలెన్స్​, వర్క్​, కుటుంబ బాధ్యతలు​ మేనేజ్​ చేయడం, ఆరోగ్యం– వెల్​నెస్​ గురించి మాట్లాడడం, టాక్సిక్​ వర్క్​ ఎన్విరాన్​మెంట్​ వంటి వాటి అడ్డుగోడలను ఎలా దాటాలి అని ఆలోచిస్తున్నారు.

 ఒకరికొకరు పంచుకున్న ఆలోచనలను అమలుచేసేందుకు ట్రై చేస్తున్నారు. ఎంతగానో అభివృద్ధి చెందాం అని చెప్పుకుంటున్నప్పటికీ చాలాసార్లు అర్థంచేసుకోని పరిస్థితులే కళ్లముందు నిలుస్తున్నాయి మహిళలకు. విమెన్​ సెంట్రిక్​ గ్రూప్స్​లో పార్టిసిపేట్​ చేయడం వల్ల స్వేచ్ఛగా మాట్లాడగలరు. ఒక్కమాటలో చెప్పాలంటే అందరికీ కామన్​ గ్రౌండ్​ ఒకటి దొరుకుతుంది. అప్పుడు సమస్యలను దాటి అందరూ కలిసి ఎదగగలుగుతారు” అని హైదరాబాద్​కి చెందిన రాధిక అన్నారు.

ఇలాంటి గ్రూప్స్​ వల్ల ఒకే కమ్యూనిటీ(బిజినెస్​, జాబ్​)కి చెందిన వాళ్లు జాబ్​ లేదా వ్యాపార పనుల మీద కొత్త ప్రాంతాలకు, నగరాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్నవాళ్లకు ఫ్రెండ్స్​ అవుతారు. ప్యాండెమిక్​ వంటి పరిస్థితుల్లో వర్కింగ్​ విమెన్​కు ఇలాంటి గ్రూప్స్​ చాలా సాయంగా నిలిచాయి. కుటుంబాలకు దూరంగా ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ లేకుండా చేశాయి. ఇలాంటి సపోర్ట్​ గ్రూప్స్​ లేకుంటే 2020లో వచ్చిన ప్యాండెమిక్​ పరిస్థితుల్లో సర్వైవ్​ కావడం చాలా కష్టమయ్యేది” అని చెప్పారు ఎలీషా సైగల్.
 
క్రియేటింగ్ కమ్యూనిటీ

ఇప్పటికీ వర్క్​స్పేస్​, కల్చర్​లో పెద్దమొత్తంలో మగవాళ్లే ఉంటారు. అందుకే ఆడవాళ్లు తమ పరిస్థితులను అర్థంచేసుకునేందుకు తమకోసమే ఉన్న ఇలాంటి నెట్​వర్క్​ గ్రూప్​లను ఆశ్రయిస్తున్నారు. వాటి ద్వారా సలహాలు దొరుకుతున్నాయి. ఒకరికొకరు అండగా ఉంటున్నారు. పనిప్రదేశాల్లో చాలా ఎక్కువసార్లు మహిళల ఆలోచనలకు తక్కువ క్రెడిట్​ అందుతుంది. నిర్ణయాలు తీసుకునే స్థానంలో కూడా మహిళల రిప్రజెంటేషన్​ను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే చిన్నపాటి అణచివేత, లింగ వివక్షలను ఎదుర్కొంటారు. దానివల్ల ప్రొఫెషనల్​ గ్రోత్​ అనేది ఉండట్లేదు ఎక్కువమంది మహిళలకు. అంతేకాదు నెట్​వర్కింగ్​ అవకాశాలు కూడా తగ్గిపోతాయి” అని ముంబయికి చెందిన అచ్రేకర్​ చెప్పారు.

మహిళలు మాత్రమే ఉండే ఇలాంటి నెట్​వర్కింగ్​ గ్రూపుల్లో విమెన్​ ఫౌండర్స్​, మెంబర్స్​ మధ్య ‘కమ్యూనిటీ’ అనే పదం ఒకటి నలుగుతుంటుంది. ఈ కమ్యూనిటీ అనేది పనితో పాటు సరదాలకు కూడా కేరాఫ్​ అడ్రెస్. యాభై ఏండ్ల గరిమా ధమిజ, మరో ఐదుగురితో కలిసి ‘లీడ్​ లైక్​ హర్’ అనే నెట్​వర్కింగ్​ గ్రూప్​ను 2022లో గురుగ్రామ్​లో మొదలుపెట్టారు. ఈ గ్రూపు ‘వర్కింగ్ విమెన్​ కమ్యూనిటీ కోసం ఏదైనా క్రియేట్​ చేయాలి. 

మహిళలకు తిరిగి ఇవ్వాలి’ అనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 50 మంది వరకు సభ్యులు ఉన్నారు. వీళ్లంతా పదిహేను రోజులకు ఒకసారి కలుస్తారు. అయితే ఈ గ్రూపు నేషనల్​ కాపిటల్​ రీజియన్​ (ఎన్​సీఆర్​)లో మాత్రమే పనిచేస్తోంది. కొవిడ్​కు ముందు రోజుల్లో వర్కింగ్ విమెన్​తో మాట్లాడినప్పుడు అందరికీ ఒక కమ్యూనిటీ ఉండడం ముఖ్యం అనిపించింది. ఇలాంటి కమ్యూనిటీలు మహిళల ఆరోగ్యం, ఎదుగుదలకు పునాది వేస్తాయి అనే విషయాన్ని గుర్తించాం’’ అని చెప్పింది ధమిజ.
 

మీకు ఎవరు తెలుసు?

ఇలాంటి నెట్​వర్కింగ్​ కమ్యూనిటీలు అవసరమా అనేవాళ్లు సైంటిఫిక్​గా ప్రూవ్​ అయిన ఈ రీసెర్చ్​ చెప్పిన విషయాలు తెలుసుకోవాలి. కెరీర్​లో ముందుకు వెళ్లాలంటే ‘‘మీకేం తెలుసు అనేదానికంటే... మీకు ఎవరు తెలుసు” అనేది ముఖ్యం అంటారు. అది నిజమే కావచ్చు. మరీ ముఖ్యంగా మహిళలు కెరీర్​లో ముందుకెళ్లాలంటే ఈ కాన్సెప్ట్​లో పలు రకాల ఛాలెంజెస్​ ఎదుర్కోవాలి. దానివల్ల వచ్చే కెరీర్​ బెనిఫిట్స్​ పక్కన పెడితే... అసలు ఆర్గనైజేషన్​లో పైస్థాయి వ్యక్తులతో ‘పరిచయం’ ఏర్పడడం అనేదే చాలా కష్టం. ఇదే విషయాన్ని హార్వర్డ్​ బిజినెస్​ చేసిన ఒక రీసెర్చ్​ను ‘అకాడమీ ఆఫ్ మేనేజ్​మెంట్​ జర్నల్​’లో పబ్లిష్​ చేసింది. ఈ రీసెర్చ్​లో ఇంకా చాలానే విషయాలు తెలిశాయి. 

హార్వర్డ్​ బిజినెస్ వాళ్లు ఈ రీసెర్చ్​ని​ ఒకటి రెండేండ్లు కాదు ఏకంగా పాతికేండ్ల టైం తీసుకుని మరీ చేశారు. ఈ పాతికేండ్ల కాలంలో 42 గ్లోబల్​ ఫార్మాస్యూటికల్​ కార్పొరేషన్స్​ డాటా సేకరించారు. రీసెర్చ్​లో భాగంగా మగ, ఆడ ఇద్దరికీ కెరీర్​లో ముందుకెళ్లడానికి నెట్​వర్క్స్​ ఏ రకంగా సాయపడ్డాయనే విషయాన్ని లోతుగా పరిశీలించారు. అయితే ప్రత్యేకించి ఫార్మా రంగాన్నే ఎంచుకోవడం వెనక బలమైన కారణాలు మూడు ఉన్నాయన్నారు రీసెర్చర్లు. మొదటిది గ్లోబల్​ ఎకానమీలో ఫార్మా అనేది ‘కీ ప్లేయర్​’ కావడం​. 

రెండోది ఫార్మాస్యూటికల్​ కంపెనీల్లో పనిచేసే మహిళలకు సమాన లేదా అంతకంటే మంచి​ అకడమిక్​ క్వాలిఫికేషన్స్​ ఉండడం. అలా ఉన్నప్పటికీ మగవాళ్ళతో పోల్చినప్పుడు వాళ్లతో సమానంగా ప్రొఫెషనల్​ రిలేషన్స్​ ఉండవు. వేగంగా మారుతున్న లైఫ్​ సైన్స్​ ఇండస్ట్రీలో ఆ కనెక్షన్స్​ చాలా ముఖ్యం. మూడో కారణానికి వస్తే డాటా క్వాలిటీ అనేది ఈ రంగంలో బెటర్​గా ఉండడం. కెరీర్​ గ్రోత్​లో ఆడ, మగ ఎవరికైనా నెట్​వర్కింగ్​ స్ట్రాటజీలు పనికొస్తాయనే విషయంలో ఇప్పటివరకు ఉన్న ఆలోచనాధోరణిని మార్చుకోవాలనేందుకు బోలెడు కారణాలు చెప్తున్నారు వీళ్లు.

మగవాళ్లకే ఆ బెనిఫిట్స్​

సీనియర్​ పొజిషన్స్​లో ఉన్న వాళ్ల​తో ముఖాముఖిగా ఎక్కువ టైం మాట్లాడగలిగితే కెరీర్​ గ్రోత్​ ఉంటుంది అనుకోవడం సహజం. అలాగే హై ప్రొఫైల్​ నెట్​వర్క్​ ఏర్పడాలన్నా ఇదెంతో ముఖ్యం అనుకుంటారు. అయితే ఈ ఈక్వేషన్​ ఆడ, మగ ఇద్దరికీ  ఒకేలాంటి రిజల్ట్​ ఇవ్వదు!  హై ప్రొఫైల్​ నెట్​వర్క్స్​ ఏర్పడాలంటే ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులతో ముఖాముఖి మాట్లాడే టైం ఉండాలి.  దానివల్ల ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువ బెనిఫిట్స్​ పొందుతున్నారు. ఆడవాళ్లకు సీనియర్​ పొజిషన్​​లో ఉన్నవాళ్లతో ఫేస్​ టు ఫేస్​ ఇంటరాక్షన్​ జరిగినా కూడా వాళ్లతో ప్రొఫెషనల్​ పరిచయం​ ఏర్పడడం అనేది 40 శాతం తక్కువ.

 అదేంటది మగవాళ్లకు పనికొచ్చే ఆ ఫార్ములా ఆడవాళ్లకు ఎందుకు వర్కవుట్​ కావట్లేదు? అనిపిస్తుంది కదా... ముఖాముఖి మాట్లాడినప్పుడు మస్క్​లైన్​ బిహేవియర్​(బలం, ధైర్యం, స్వతంత్రత, నాయకత్వం​, దృఢత్వం ) అనేది కీ రోల్​ ప్లే చేస్తుంది. ఆ ప్రవర్తన సమాజంలోని సంస్కృతీ, సంప్రదాయాల పేర బాగా పాతుకుపోయింది. పైగా వాటినే ఉద్యోగి సామర్థ్యాన్ని, పనితీరును లెక్కించే స్కేలుగా చూస్తారు. 

అలా ఆలోచన ఉందంటే... లింగవివక్ష అనేది ఉన్నట్టే. దానివల్లే ‘సమర్ధత’​ అనేది మహిళలకు అడ్డుగోడగా నిలుస్తోంది. అయితే పైన మగవాళ్ల గురించి చెప్పినట్టు ఆడవాళ్లు కూడా ఉండగలరు. వాటిని చేసి చూపెడతారు కూడా కాకపోతే కాస్త భిన్నంగా చూపిస్తారు. అలా చేయడం వల్ల కొన్నిసార్లు శిక్షించబడతారు కూడా! అదే వాళ్లలోని సమర్ధతకి గుర్తింపు తెచ్చుకునే హక్కుని కోల్పోయేలా చేస్తోంది.

మాటల్లో మాటగా...​

అదెలాగంటే... ఒక మగ ఉద్యోగి సీనియర్​ ఆఫీసర్​తో మాట్లాడుతున్నప్పుడు తను చేసిన సక్సెస్​ఫుల్​ డీల్స్​ను క్యాజువల్​గా మాటల్లో మాటగా చెప్పగలుగుతాడు. అంత మామూలుగా మాట్లాడే అవకాశం ఆడవాళ్లకు చాలా తక్కువ. మాటల్లో మాటగా మగవాళ్లు చెప్పుకునే తమ సక్సెస్​ విషయాలు సీనియర్​ ఆఫీసర్ల బుర్రల్లో తిష్ట వేస్తాయి. దాంతో అదే స్థాయిలో ఉన్న ఉద్యోగిని రిప్రజెంటేషన్​ ప్రొఫెషనల్​ సర్కిల్​లో తగ్గిపోతుంది. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ... ఒక టెక్​ సంస్థలో ప్రియ అనే ఆమె సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తోంది.

 సీనియర్​ లీడర్​ ఏర్పాటుచేసిన హై స్టేక్స్​ మీటింగ్​​లో కాంప్లెక్స్​ సాఫ్ట్​వేర్​ సొల్యూషన్​ను ప్రెజెంట్​ చేస్తుందామె. ఆమె చెప్పిన అంశం చాలా స్పష్టంగా ఉంటుంది. చాలా  రీసెర్చ్​ చేసి మరీ డాటా ప్రెజెంట్​ చేసింది. ఆమె చెప్పిన ముగింపు​ కూడా చాలా బాగుంది. కాకపోతే అక్కడ ఉన్న సీనియర్​ ఆఫీసర్​కు మాత్రం మార్క్​ అనే మగ ఉద్యోగి చెప్పబోయే సక్సెస్​ సొల్యూషన్స్​ గురించి వినేందుకే ఆసక్తి ఉంది. అందుకు కారణం ఆ సీనియర్​ ఆఫీసర్​​తో ఉన్న మార్క్​కి ఉన్న దగ్గరితనం. ఆ దగ్గరితనం మార్క్​కి ఆ ఆఫీసర్​తో హై స్టేటస్​ నెట్​వర్క్​కి అడ్మిషన్​ టికెట్​ అయింది.

 అదే ప్రియ విషయానికి వస్తే... అలాంటి పరిస్థితి లేదు. కారణం ప్రియ వివరంగా ఇచ్చిన  ప్రెజెంటేషన్​ కంటే కూడా .. ఆ సీనియర్​ లీడర్​తో మార్క్​కి ఉన్న పరిచయానిదే కీ రోల్​. దాని ఫలితంగా సీనియర్​ ఆఫీసర్​కు హై ప్రొఫైల్​ ప్రాజెక్ట్స్​ గురించి ఆలోచన రాగానే మార్క్​ గుర్తుకు వస్తాడే తప్ప ప్రియ కాదు.
మరయితే ఆడవాళ్లు కూడా  మగవాళ్లలా బిహేవ్​ చేయొచ్చు కదా అనిపించొచ్చు. మార్క్​ తను చెప్పే  విషయం పట్ల ఆత్మవిశ్వాసంతో​, నమ్మకంగా ఉన్నాడో అలానే ప్రియ ఉండొచ్చు కదా అనిపించొచ్చు. కానీ అది ప్రాక్టికల్​గా నిజం కాదు. 

ఉన్నత స్థాయి నెట్​వర్క్​ ఏర్పరచుకోవాలి అనుకునే ఆడవాళ్లకు రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి ప్రియ చెప్పినట్టు విషయంలో స్పష్టత ఉన్నా, మృదువుగా మాట్లాడితే ​పై అధికారులు దాన్నంత సీరియస్​గా తీసుకోరు. అలా ఉంటే కుదరదని మగవాళ్లు చెప్పిన స్టయిల్​లో చెప్తే ‘‘ఆమె అనుకున్నది సాధించడానికి ఎలా బిహేవ్​ చేస్తుందో...” అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్లు హై స్టేటస్​ నెట్​వర్క్​ ఏర్పాటుచేసుకోవడం సాధ్యమవుతుందా?

అయినా సాధిస్తున్నారు​

రీసెర్చి డాటా ప్రకారం ఆడవాళ్ల కంటే మగవాళ్లు హై ప్రొఫైల్​ కొలీగ్స్​తో మాట్లాడడం వల్ల కెరీర్​ బెనిఫిట్స్​ పొందుతున్నారు. అయితే ఇక్కడ మరో విషయం గురించి చెప్పుకోవాలి. మూడోవంతు ఆడవాళ్లు మగవాళ్లకంటే ఎక్కువగా హై ప్రొఫైల్​ నెట్​వర్క్​ కనెక్షన్స్​ సాధించగలుగుతున్నారు. అదెలాగంటే... థర్డ్​ పార్టీ ద్వారా. ఆ మూడో వ్యక్తి ఉన్నత స్థాయి వ్యక్తులకి, ఉద్యోగినికి మధ్య కనెక్టింగ్ బ్రిడ్జి అన్నమాట. ఆ పరిస్థితి లేదంటే సీనియర్​ లీడర్స్​తో నెట్​వర్క్​ ఏర్పరచుకోవడం అనేది అందని ద్రాక్షే. 

ఈ థర్డ్​ పార్టీ పరిచయాలను ఎండోర్స్​మెంట్స్.. అంటే మహిళల పని సామర్థ్యాన్ని బలపరిచే కనెక్షన్​ అని చెప్పొచ్చు. సదరు సహోద్యోగి ఉన్నతాధికారులకు మహిళా ఉద్యోగిని పరిచయం చేస్తారు. ఆ పరిచయం చేసిన వ్యక్తి మీద ఉన్న నమ్మకం సీనియర్​ ఆఫీసర్లతో కనెక్టివిటీని  ఏర్పరుస్తుంది. అయితే ఇలాంటి పరిచయాలు ఏర్పడినంత మాత్రాన ఉన్నత స్థాయి సర్కిల్​కి దగ్గర అవ్వడం అనేది అంత ఈజీ కాదు. తెలిసో తెలియకో కొన్ని నిర్ణయా​ల వల్ల ఉన్నతస్థాయి పరిచయాలకి ఫుల్​స్టాప్​ పడుతుంది.

పనితీరుతో మెప్పించేందుకు ఒక చానెల్​

లారా అనే ఎంప్లాయీ ఎక్స్​పీరియెన్స్​ చూస్తే... లారా ప్రొడక్ట్​ డెవలప్​మెంట్​ డిపార్ట్​మెంట్​లో మేనేజర్​గా పనిచేస్తుంది. ఆమె పర్​ఫార్మెన్స్​ హిస్టరీ చాలా బాగుంది. అయినప్పటికీ కెరీర్​లో గ్రోత్​ మాత్రం ఆ సంస్థలో సీటీఓ వల్ల మాత్రమే జరిగింది. అదే కంపెనీలో ఎంతోకాలంగా పనిచేస్తున్న కార్లోస్​ అనే  డైరెక్టర్​తో కలిసి ఒక ప్రాజెక్ట్​ మీద పనిచేసినప్పుడు లారా పనితనం వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ సీటీఓతో కలిసి ఎన్నో ప్రాజెక్ట్​లకు పనిచేశాడు కార్లోస్. అలా సీటీఓకి నమ్మకమైన వ్యక్తి అయ్యాడు అతను. కార్లోస్​ సీటీఓతో క్యాజువల్​గా మాట్లాడేటప్పుడు ​లారా పని గురించి పలుసార్లు చెప్పాడు.

 దానివల్ల ఆమె పని గురించి సీటీఓకి తెలిసింది. ఒక రోజు మధ్యాహ్నం...​ లారా, సీటీఓలకి కలిపి జూమ్​ మీటింగ్​ ఏర్పాటుచేశాడు కార్లోస్. ఆ మీటింగ్​లో రాబోయే ప్రొడక్ట్​ డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్స్​, సీటీఓ స్ట్రాటజిక్​ టెక్​ ఇనిషియేటివ్​ గురించి చర్చించారు. అప్పుడు కొత్త ప్రొడక్ట్​ గురించి ఒక పిచ్​ తయారుచేసి ప్రెజెంట్​ చేసింది లారా. అది అచ్చం ఆ సీటీఓ ఆలోచిస్తున్న డిజిటల్​ ట్రాన్స్​ఫర్మేషన్​కి తగ్గట్టే ఉంది. దాంతో ఆయన లారా పనితీరుకు ముచ్చటపడ్డాడు. అప్పటినుంచి ఆ కంపెనీ సీటీఓకి లారా పని మీద ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. ఆ తరువాత కార్లోస్​ లారాను క్రాస్​ డిపార్ట్​మెంటల్​ టాస్క్​ ఫోర్స్​లో చేరమని ఆహ్వానించాడు. 

అలా ఆమె ఉన్నతస్థాయిలో ఉండే నమ్మకమైన​ సర్కిల్​లో చేరింది. ఇలా థర్డ్​ పార్టీ సంబంధాలు ఆడవాళ్ల  కెరీర్​లో ఎదిగేందుకు సాయపడుతున్నాయి. 
అయితే థర్డ్ పార్టీ సంబంధాలు ఏర్పరచుకోవడం ఎలా అనేది మళ్లీ కళ్ల ముందు నిల్చొనే పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఇన్​ఫార్మల్​ నెట్​వర్క్స్​ చాలా ఈజీగా ఏర్పరచుకోగలరు అంటోంది ఈ రీసెర్చ్​. కాకపోతే ఆ నైపుణ్యాల్ని కెరీర్​లో నెట్​వర్క్స్​ బిల్డ్​ చేసుకునేందుకు వాడడం లేదు వాళ్లు. 

అలా వాడాలంటే దాన్ని వాడే ఒక స్ట్రాటజీని తెలుసుకోవాలి. అంటే భిన్నంగా ఆలోచించాలి.  ప్రొఫెషనల్​గా ఎదగాలి అనుకుంటే లక్ష్యాల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మీతో పాటు ఉన్న టీం కూడా బెనిఫిట్స్​ పొందుతుంది. థర్డ్​పార్టీ రిలేషన్​ను కెరీర్​ అడ్వాన్స్​మెంట్​ కోసమే కాకుండా నమ్మకమైన బంధంగా చూడాలి. అలాగని ఎవరినంటే వాళ్లను నమ్మొద్దు. మీ గురించి జాగ్రత్త తీసుకుని, మీ ఆలోచనలకు సపోర్టుగా నిలిచే వ్యక్తులను ఎంచుకోవాలి.

సంస్థలు చేయాల్సింది

  • కంపెనీల్లో నెట్​వర్క్​ స్పాన్సర్​ ప్రోగ్రామ్స్​ సరిగా డిజైన్​  చేస్తే అవి మహిళల కెరీర్​కి ఉపయోగపడతాయి. ఇక్కడ స్పాన్సర్​షిప్​ అంటే మెంటార్​షిప్​ అని అర్థం. మహిళల కెరీర్​ అడ్వాన్స్​మెంట్​కి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఆటోమెటిక్​గా కంపెనీ ఎదుగుదలకు కూడా దారి వేసినట్టే. ఈ మెంటార్​షిప్​ చేసేవాళ్లకి ఉన్నతస్థాయి వ్యక్తులతో ఉన్న పరిచయాల ద్వారా ఉద్యోగినులకు కనెక్షన్స్​ పెంచొచ్చు. అలా నెట్​వర్క్​ స్పాన్సర్​ ప్రోగ్రామ్స్​ అనేవి ఎంతో లాభదాయకం. చాలా కంపెనీలు దీనివల్ల కలిగే లాభాలను అర్థం చేసుకోలేకపోతున్నాయి.​ నెట్​వర్క్​ స్పాన్సర్​ ప్రోగ్రామ్​ డిజైన్​ చేసేందుకు నాలుగు టిప్స్ చెప్పింది ఈ రీసెర్చ్​.
  • ఉద్యోగినుల మీద ప్రభావం చూపించగల నెట్​వర్క్ స్పాన్సర్స్​ ఉన్నత స్థాయిలో ఉండటం చాలా అరుదు. మేనేజర్​ పొజిషన్​కు, ఆర్గనైజేషన్​ టాప్​ టైర్​ వ్యక్తులకు మధ్య ఉండే ఈ స్పాన్సర్స్​ మిడ్​ లెవల్​ స్టేటస్​ను ఇష్టంగా స్వీకరిస్తారు. అందుకని అలాంటి వాళ్లను ఆ స్థాయిలో ప్లేస్​మెంట్ చేయడం వల్ల అటు ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులకు, ఇటు ఉద్యోగులకు నమ్మకమైన వ్యక్తిగా ఉంటారు.
  • సీనియర్​ మహిళా సహోద్యోగి, జూనియర్​ మహిళా ఉద్యోగికి సాయపడతారు. అటువంటి వాళ్లను అద్భుతమైన నెట్​వర్క్​ స్పాన్సర్​గా తయారుచేయొచ్చు. రీసెర్చిలో ఇందులో చాలా చిన్న తేడా కనిపించింది. అదేంటంటే ఈ ప్రాసెస్​లో మహిళల కంటే మగవాళ్లే లాభపడటం. అదెలాగంటే ఒక సీనియర్​ మహిళా ఉద్యోగి జూనియర్​ను ప్రమోట్​ చేస్తే ... ‘జూనియర్​కి స్కిల్స్​ లేకపోయినా మహిళ కాబట్టి ప్రమోట్​ చేశారు’ అంటారు. అదే మగవాళ్ల విషయానికి వస్తే అలా అనుకోరు. ఈ రీసెర్చ్​లో గమనించిన మరో విషయం... కంపెనీలో సీనియర్​ మహిళలు దీర్ఘకాలంగా పనిచేస్తుంటే కనుక వాళ్లు జూనియర్​ ఉద్యోగినులకు మంచి నెట్​వర్క్​ స్పాన్సర్​గా ఉంటారు. అందుకు కారణం జూనియర్​ ఉద్యోగినులు ఎలా వర్క్​ చేస్తారనేది వాళ్లకు తెలియడం. అందుకే ఇలాంటి నెట్​వర్క్ స్పాన్సర్​ ప్రోగ్రామ్స్​ చాలా ప్రభావం చూపిస్తాయి అంటున్నారు రీసెర్చర్లు.
  • ఫిమేల్​ ట్రిప్లెట్​ ఎఫెక్ట్​. ఈ చెయిన్​ ఎలా ఉంటుందంటే...  జూనియర్​ కొలీగ్​, నెట్​వర్క్​ స్పాన్సర్​, హై స్టేటస్​ కొలీగ్​. ఈ ముగ్గురూ ఆడవాళ్లే అయినప్పుడు ఫలితం ప్రభావవంతంగా ఉంటుంది. టాలెంట్​ ఉన్న​ జూనియర్ ఉద్యోగిని తన పనిలో​ ఎలాంటి ఛాలెంజెస్​ ఎదుర్కోవాల్సి వస్తుందో పైనున్న ఆ ఇద్దరు ఆడవాళ్లకు బాగా అర్ధమవుతుంది. ముగ్గురూ మహిళలే కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. దాంతో సలహాలు, సంప్రదింపులు పరిస్థితులకు తగ్గట్టు జరిగిపోతాయి. దీన్నే లివరేజ్​ ఫిమేల్​ ట్రిప్లెట్​ ఎఫెక్ట్​ అంటారు.
  • సాధ్యమైనప్పుడల్లా నెట్​వర్క్​ స్పాన్సర్​ ప్రోగ్రామ్స్​ను జూనియర్​ ఉద్యోగినులకు వాళ్లు ఉంటున్న ప్రాంతానికి కనెక్ట్​ చేయాలి. నెట్​వర్క్​ స్పాన్సర్​తో ముఖాముఖి మాట్లాడడం వల్ల జూనియర్స్​కి మంచి బెనిఫిట్స్​ అందుతాయి. ఇలాంటప్పుడు హై స్టేటస్​ కాంటాక్ట్స్​ దూరం​గా ఉన్నా కూడా నెట్​వర్క్​ స్పాన్సర్స్​ చాలా ఎఫెక్టివ్​గా జూనియర్స్​కి సపోర్ట్​ చేయగలుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో నెట్​వర్క్​స్పాన్సర్స్​ ప్రోగ్రామ్స్​ జూనియర్​ ఉద్యోగినుల​కి అదనపు బెనిఫిట్స్​ తెస్తాయి. తాము ఉన్న ప్రాంతం నుండే గ్లోబల్​ హై స్టేటస్​ నెట్​వర్క్స్​కు దారి దొరుకుతుంది. 
  • మొత్తంమీద పాతికేండ్లు చేసిన ఈ  రీసెర్చ్ వల్ల ఆడవాళ్లు ఉన్నత స్థాయి వర్గాలతో నెట్​వర్క్స్​ ఏర్పరచుకోవడంలో ఎదుర్కొనే ఛాలెంజెస్​ ఏంటో తెలిశాయి. దాంతో ఆ ఛాలెంజెస్​ ఎదుర్కోవడానికి స్ట్రాటెజిక్​ రోడ్​ మ్యాప్​ ఎలా ఉండాలనేది సూచించగలిగారు. పరపతిని వాడి సామాజిక సంబంధాలను పెంచుకోవడం వల్ల మహిళలు కెరీర్​లో ఎదిగి, సమర్ధతను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కెరీర్​లో ముందుకి వెళ్లేందుకు అడ్డుగోడలు ఉండవు. లింగ సమానత్వం అవసరం అనుకునే కంపెనీలకి, సంస్థలకి ఈ రీసెర్చ్​ ద్వారా స్పష్టమైన డైరెక్షన్​ ఇచ్చింది.

నా పేరు వేణి జైన్​. 30 ఏండ్ల వయసున్న నా బుర్రలో ఒక బిజినెస్​ ఐడియా ఉంది. ఆ బిజినెస్​ ఎలాగైనా మొదలుపెట్టాలి అనుకున్న నాకు దాన్ని ఆచరణలో పెట్టే లోపే పెండ్లి అయింది. దాంతో కోల్​కతా నుంచి ఢిల్లీలోని అత్తగారింటికి రావాల్సి వచ్చింది. ఆ కొత్త ప్లేస్​లో  మా ఆయన, వాళ్ల కుటుంబం తప్ప ఇంకొకరు తెలియదు నాకు. ఏం చేయాలి అనుకున్నా? ఏం చేస్తున్నా? అనుకుంటున్న నాకు 2022లో యూత్​ ఫిక్కీ లేడీ ఆర్గనైజేషన్​(Y- -– Flo)  ఏర్పాటుచేసిన మీటింగ్​ వరంలా కనిపించింది. వెంటనే ఆ మీటింగ్​కు వెళ్లేందుకు రిజిస్టర్​ చేసుకున్నా. 

అలాంటి మీటింగ్​లకు వరసగా రెండేండ్లు వెళ్లా. వాటివల్ల నాకంటూ ఒక సోషల్​ లైఫ్​ ఏర్పడింది. అలా గౌర్మెట్​ చీజ్​ తయారీతో పాటు పార్టీలు, డిన్నర్​లకు గ్రేజింగ్​ బోర్డ్స్​చేసిపెట్టే  బిజినెస్​ మొదలుపెట్టా” అని చెప్పింది వేణి. అంటే నెట్​వర్కింగ్ సర్కిల్​ ఉండడం వల్ల ఆమె ఆలోచనకు  రూపం ఎలా ఇవ్వాలో తెలిసింది. ఆలోచనను ఆచరణలో పెట్టి  బిజినెస్​ మొదలుపెట్టింది. అంటే ఇలాంటి గ్రూప్​లు మహిళల జీవితంలో​, కెరీర్ జర్నీలో సాయం చేస్తున్నట్టే కదా! 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024వ  సంవత్సరంలో 43 ఏండ్ల నేహా శర్మ మొదటిసారి ‘లీడ్​ లైక్​ హర్​ క్లబ్​’ ఈవెంట్​కు వెళ్లింది. మహిళలకు సపోర్ట్​, నెట్​వర్కింగ్​ చేస్తుంటుంది ఈ గ్రూపు. ఇందులో   హ్యూమన్​ రిసోర్సెస్​(హెచ్​.ఆర్​.)లో లీడర్​షిప్​ స్థాయిలో ఉన్న మహిళలు ఉన్నారు. గురుగ్రామ్​కి చెందిన నేహా శర్మ ఎయిర్​టెల్​లో మార్కెట్​ ఆపరేషన్స్​కు హ్యూమన్​ రిసోర్సెస్​ హెడ్​. 

ఆ ఈవెంట్​కు వెళ్లడం ఆమెకు చాలా ఉపయోగం అనిపించింది. కారణం... ఆ ఈవెంట్​కు వచ్చిన వాళ్లంతా హెచ్​. ఆర్​.కు సంబంధించిన పనిచేస్తున్న వాళ్లే కావడం. అదొక్కటే కాకుండా కెరీర్​లో నేహా ఏ స్టేజ్​లో ఉందో వాళ్లూ అదే స్టేజ్​లో ఉన్నారు. ‘‘ఆ గ్రూపు వాళ్లంతా కలిసి ఒక కమ్యూనిటీలా ఏర్పడి, వర్కింగ్​ విమెన్​కు ఏ విధంగా సాయం చేయొచ్చనే విషయాలు మాట్లాడుకున్నారు’’ అని చెప్పింది నేహ.

గొలుసు‘కట్టు’గా...

‘‘ఫిక్కీ లేడీస్​ ఆర్గనైజేషన్​(ఎఫ్​ ఎల్​ ఓ(ఫ్లో)) నలభైఏండ్లు పైబడిన మహిళలకు సాయపడుతుంది. కుటుంబ బాధ్యతల్లో ఉండి ఆ తరువాత పనిచేయాలనుకునే వాళ్లకు సాయం చేస్తోంది. ఫ్లోను 1983లో స్థాపించారు. ఇండియా వ్యాప్తంగా 19 చాప్టర్లు ఉన్నాయి. అలాగే 11 వేల మంది సభ్యులు ఉన్నారు. బెంగళూరు ఒక్క చాప్టర్​లోనే 1250 మంది సభ్యులు ఉన్నారు. వారానికి రెండు సార్లు బెంగళూరు ఫ్లో సమావేశాలు జరుగుతాయి. సభ్యుల అవసరాలను బట్టి ఏ విషయాలు మాట్లాడాలి అనేదాన్ని క్యాలెండర్​ చేస్తాం. చాలా మందికి మంచి ఐడియాలు ఉంటాయి. 

కానీ వాటిని ఎలా ఎగ్జిక్యూట్​ చేయాలో తెలియదు. ఫ్లోలో మా సభ్యులు మెంటార్​షిప్​, ఇండస్ట్రీ స్పెసిఫిక్​ నోహౌ, లీగల్​, ఫైనాన్షియల్​ అసిస్టెన్స్​ ఇస్తారు. వెంచర్​ మొదలుపెట్టేందుకు ప్రతి దశలో సాయం చేస్తాం’’ అని ఫ్లో బెంగళూరు చాప్టర్​ మాజీ​ చెయిర్​పర్సన్​ 61 ఏండ్ల యశోధర ష్రాఫ్​ చెప్పారు. ఇలాంటి సాయమే రెగ్యులర్​ నెట్​వర్కింగ్​ గ్రూప్స్​లో మహిళలకు దొరుకుతుంది. అంతా మహిళలే ఉండడం వల్ల చాలావరకు ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

ఉద్యోగం చేసే వాళ్లకు, మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకునే వాళ్లకు, వ్యాపారం మొదలుపెట్టాలి అనుకునే వాళ్లకు, ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వాళ్ల కోసం సాయం చేసే విమెన్​ ఓన్లీ నెట్​వర్క్​ గ్రూప్స్’ చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని​ వెబ్​సైట్స్​​ పేర్లు ఇవి...
 

 కిరణ్మయి