తొలిఏకాదశి రోజు పేలాల పిండి ఎందుకు తినాలో తెలుసా..

హిందువుల మొదటి పండగ తొలి ఏకాదశి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశిష్ఠ స్థానముంది. దీన్ని శయనైకాదశి' అని, హరి వాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఆషాఢమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు. ఈఏడాది (2024)  బుధవారం (జులై 17) తొలి ఏకాదశి వచ్చింది. ఈ సందర్భంగా.. ఈ పండుగ రోజు పేలాల పిండిని ఎందుకు తినాలో  ఇప్పుడు తెలుసుకుందాం.

​పురాణాల ప్రకారం  ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే 'ప్రబోధినీ ఏకాదశి' ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

చాతుర్మాస దీక్ష

ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజునుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు.  ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగులు పర్వదినాలు ఎక్కువగావస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య రక్షణకోసం నియమాలు ఎక్కువగా పాటించాలని ఈ కాలంలో వ్రతాలు, ఉత్సవాలు, నోములు ఎక్కువగా పెట్టారు. 


పేలాల పిండి ఎందుకు తినాలి?

తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.

ఏమేమి తినకూడదంటే...

సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉండడం లేకపోయినా ఈ చాతుర్మాస్యాల్లో వచ్చే ఎనిమిది ఏకాదశులైనా ఉపవాసం ఉండడం మంచిది. ఈ ఎనిమిది ఏకాదశులలో వంకాయ, కరుబూజ, రేగి మున్నగునవి తినకూడదని చెప్తారు. ఆ రోజు( జులై 17)నుంచే చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభం అవుతుంది. వీరు ఈ నాలుగు మాసాల్లో ఒక్కో మాసంలో ఒక్కో రకమైన వాటిని వదిలి పెడతారు. మొదటి నెలలో కూరలు, రెండవ నెలలు పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ నెలలో ద్విదళ (రెండాకులుండే) వాటితో చేసే ఆకు కూరలను వదిలిపెట్టాలి. ఈ మొత్తం వ్రతం అయ్యే వరకు నిమ్మపళ్ళు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరుకుగడలు, తినకూడదని శాస్త్రం చెపుతుంది. అందరూ కనీసం ఈ ఒక్కరోజైనా ఉపవాసం చేసి ఎప్పుడూ భగవంతుని దగ్గరగా ఉండి.. లక్ష్మీనారాయణుల ఆశీస్సులు పొందుదాం. ..