దేశంలో మగాళ్ల ఆత్మహత్యలే ఎక్కువ.. 8 ఏళ్లలో 11.5 లక్షల మంది సూసైడ్

  • దేశంలో 2015 నుంచి 2022 వరకు మొత్తం11.5 లక్షల మంది సూసైడ్
  • చనిపోవడానికి కఠినమైనపద్ధతిని ఎంచుకుంటున్న మెన్స్ 
  • ఈ 8 ఏండ్లలో మగాళ్ల సూసైడ్స్ 34.08%..ఆడవాళ్ల సూసైడ్స్14.45% హైక్
  • కుటుంబ సమస్యలు, అనారోగ్యమే ప్రధాన కారణాల్లో టాప్
  • షాకింగ్ విషయాలు వెల్లడించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  రిపోర్ట్ 
  • అందులో పురుషులే 8 లక్షలుకాగా.. మహిళలు 3.46 లక్షల మంది 

సెంట్రల్​ డెస్క్​, వెలుగు: దేశంలో మగవాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015 నుంచి 2022(ఎనిమిదేండ్లు) వరకు ఏటా సుమారు 1,01,188 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు చాలా తక్కువ మంది సూసైడ్ చేసుకున్నారు. ఏటా సూసైడ్ చేసుకుంటున్న మహిళల సంఖ్య సగటున 43,314 మాత్రమే ఉంది.  సూసైడ్ రేటు ప్రతి లక్షమంది పురుషులకు 14.2 కాగా.. మహిళల్లో ఇది 6.6గా ఉంది. 2015 నుంచి 2022 వరకు మొత్తం 11,56, 023 మంది సూసైడ్ చేసుకున్నారు. అందులో పురుషులు 8,09,506 మందికాగా.. మహిళలు 3,46,517 మంది ఉన్నారు. అంటే ఈ 8 ఏండ్లలో మగాళ్ల సూసైడ్స్ 34.08% పెరగగా..ఆడవాళ్ల సూసైడ్స్14.45% పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) రిపోర్ట్ వెల్లడించింది. 

ఏ ఏడాది ఎంత మంది అంటే..!

ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం..2015 నుంచి 2022 వరకు ఏటా ఆత్మహత్యలు పెరిగాయి. పెరిగిన సంఖ్యలోనూ ఏటా మగాళ్లే ఎక్కువగా ఉన్నారు.  2015లో  91, 528 మంది పురుషులు సూసైడ్ చేసుకోగా..42,088 మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2016లో  88,997 మంది పురుషులు,  41, 997 మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. 2017లో 89, 019 మంది మగాళ్లు సూసైడ్ చేసుకోగా.. మహిళలు 40, 852 మంది చేసుకున్నారు. ఇక 2018లో 92, 114మంది మెన్, 42, 391 విమెన్ సూసైడ్ చేసుకున్నారు. 2019లో  పురుషులు 97,613 మంది, మహిళలు       41,493 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2020లో  ఏకంగా1,08, 532 పురుషులు.. మహిళలు 44, 498 మంది సూసైడ్ చేసుకున్నారు. 2021లో పురుషులు 1,18,979..మహిళలు 45,026 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. 2022లో పురుషులు 1,22,724..మహిళలు 48,172 మంది సూసైడ్ చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ రిపోర్ట్ పేర్కొంది. 

మరణాల రేటు మగాళ్లలోనే ఎక్కువ

ఆత్మహత్యకు ప్రయత్నించేటప్పుడు పురుషులు ఎంచుకునే పద్ధతుల్లో ఓ ముఖ్యమైన అంశం ఉంది. మగాళ్లు తమ ప్రాణం త్వరగా పోయే పద్ధతులను ఎంచుకుంటున్నారు. రైలు కింద పడటం, లారీ వంటి భారీ వెహికల్స్ కింద పడటం, తుపాకీతో కాల్చుకోవడం, ఉరివేసుకోవడం, ఎలక్ట్రిక్ షాక్ పెట్టుకోవడం, విషం తాగడం వంటి తీవ్రమైన పద్ధతులను ఎంచుకుంటున్నారు. దీనిద్వారా ఆత్మహత్యకు పాల్పడినవారి ప్రాణం..ఆస్పత్రికి తీసుకుపోయేలోపే పోతున్నది. కానీ మహిళలు మాత్రం ప్రాణం నెమ్మదిగా పోయే ఆత్మహత్యా పద్ధతులను ఎంచుకుంటున్నారు. వాళ్లు ఎక్కువగా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగడం వంటి ప్రాణంపై ఆలస్యంగా ప్రభావం చూపే మెథడ్స్ ఫాలో అవుతున్నారు. అందుకే వారి ఆత్మహత్యల్లో మరణాల రేటు తక్కువగా ఉంది.  సూసైడ్ రేటు ప్రతి లక్షమంది పురుషులకు 14.2 కాగా.. మహిళల్లో ఇది కేవలం 6.6గా ఉంది.

ALSO READ :  మహిళలపై నేరాలు పెరిగినయ్..2023తో పోలిస్తే 4.78శాతం ఎక్కువ నమోదు

మగాళ్ల ఆత్మహత్యలే ఎందుకు ఎక్కువ?

ఆడవాళ్ల కంటే మగాళ్లే ఎక్కువగా  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. కుటుంబ సమస్యలే అందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2015 నుంచి 2022 వరకు  కుటుంబ సమస్యల కారణంగా 242,909(23.06% ) మంది మగాళ్లు సూసైడ్ చేసుకున్నట్లు చెప్పింది. ఆ తర్వాత అనారోగ్య సమస్యతో 1,40,441(21.05%)మంది పురుషులు సూసైడ్ చేసుకున్నట్లు వివరించింది. డ్రగ్స్, లిక్కర్ అలవాటుతో 60,571మంది, అప్పుల వల్ల 39,419 మంది, ప్రేమ వ్యవహారాలతో 28,055 మంది, వివాహ సంబంధిత సమస్యలతో 26,588 మంది పురుషులు తమ ప్రాణాలు తీసుకున్నారు. వివాహ సంబంధిత సమస్యలతో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా సూసైడ్ చేసుకున్నట్లు తేలింది. మగాళ్లు 26,588(3.28%) సూసైడ్ చేసుకుంటే..మహిళలు 33,480(9.66%) ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు కూడా  పురుషులే ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సంఖ్య 10,532గా ఉంది. ఏ కారణం లేకుండా 87,101 మంది మగాళ్లు సూసైడ్ చేసుకున్నారు. 2015 నుంచి 2022 మధ్య  81,402 (10% )మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 

ఆత్మహత్యల నివారణకు ఏం చేయాలి?

పురుషుల్లో అయినా, మహిళల్లో అయినా ఆత్మహత్యల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  రిపోర్ట్ వెల్లడించింది. ప్రతిఒక్కరిలో  మానసిక స్థైర్యాన్ని పెంచాలని సూచించింది. వివిధ కార్యక్రమాల ద్వారా భావోద్వేగ నియంత్రణకు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయం అందించాలని తెలిపింది. సామాజిక ఆర్థిక ఒత్తిళ్లు, విద్యాపరమైన వైఫల్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రణాళికలతో పరిష్కరించే  ప్రయత్నం చేయాలని సూచించింది. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు వంటి కమ్యూనిటీ ప్రదేశాలను సురక్షిత ప్రదేశాలుగా మార్చాలని చెప్పింది. పిల్లలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి ఎలా ట్రైన్ చేస్తామో..మనుషులకూ  అన్ని స్థాయిలలో ఆత్మహత్య నివారణ శిక్షణ అవసరమని స్పష్టం చేసింది. ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయాన్ని అందించేందుకు హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటు తప్పనిసరని తెలిపింది. ఆత్మహత్యల నివారణలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఎన్సీఆర్బీ అభిప్రాయపడింది.

2015 నుంచి 2022 వరకు  ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య

ఇయర్    మెన్    విమెన్ 

2015    91,528    42,088
2016     88997    41,997
2017    89,019    40,852
2018    92,114    42,391
2019    97,613    41,493
2020    1,08,532    44,498
2021    1,18,979    45,026
2022    1,22,724    48,172