కొందరికి రాత్రి పన్నెండు కొడితేగానీ నిద్ర రాదు. ఉదయం ఐదింటికి నిద్ర లేస్తే గానీ.. టైంకి ఆఫీస్‌కి వెళ్లలేరు.అందుకే నిద్ర సరిపోక చాలా ఇబ్బంది పడుతుంటారు.కానీ.. ఈ ఊళ్లో మాత్రం కొందరు నిద్రపోతే లేచేందుకు ఐదారు రోజులు పడుతుంది. పొద్దెక్కేదాక పడుకుంటే ఇంట్లో వాళ్లు ‘ఏంటా మొద్దు నిద్ర?’ అని అరుస్తారు. అలాంటిది ఈ ఊళ్లోవాళ్లు కుంభకర్ణుడిలా రోజుల తరబడినిద్రలోనే ఉంటారు. ఇంత నిద్రపోయే ఈ వింత ఊరు ఎక్కడుంది? ఎందుకలా పడుకుంటున్నారు?
ఆ ఊరు పేరు కలాచి. నార్త్ కజకిస్తాన్‌లో ఆ దేశ రాజధాని నగరానికి 230 మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడి ప్రజలు కొన్నిసార్లు ఐదారు రోజులు, కొందరైతే రెండు మూడు వారాలు కూడా నిద్రపోతారు. అందుకే ఈ గ్రామాన్ని ‘స్లీపీ హాలో విలేజ్’ అని పిలుస్తుంటారు. ఈ ఊరి ప్రజలు ఎక్కువ రోజులు నిద్రలోనే ఉండడంతో చాలామంది రీసెర్చర్లు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేశారు. అయినా కూడా ఆ నిద్రకు గల కారణాన్ని మాత్రం కనుక్కోలేకపోయారు. ఈ నిద్రలో వెరైటీ ఏంటంటే... ఎప్పుడు నిద్రపోతారో వాళ్లకు కూడా తెలియదు. తింటున్నప్పుడు, తాగేటప్పుడు, నడుస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు.. ఇలా ఏ పనిచేస్తున్నా సరే నిద్ర కమ్ముకొచ్చేస్తుంది.
మొదటిసారి
ఈ ఊళ్లో ఇలా అకస్మాత్తుగా నిద్రపోతున్నట్టు 2012 చివరిలో ప్రపంచానికి తెలిసింది. కానీ.. అంతకంటే ముందునుంచే కలాచి గ్రామస్తులు అకస్మాత్తుగా నిద్రపోవడం మొదలైంది. కొందరు చేపలు పట్టేటప్పుడు, కొందరు వంట చేస్తూ, ఇంకొందరు నడుస్తూ నిద్రలోకి జారుకున్నారు! అప్పటి నుంచి 2015 వరకు ఈ ఊరి ప్రజల్లో చాలామంది ఈ సమస్యతో బాధపడ్డారు. ఈ గ్రామం గురించి బయటి ప్రపంచానికి తెలిసినా ఇలాంటి మొదటి కేసు మాత్రం 2010 ఏప్రిల్‌లోనే నమోదైంది. లియుబోవ్ బెల్కోవా ఒక మార్కెట్‌లో పని చేస్తుంటుంది.
ఆమె ఒకరోజు పనిచేస్తుంటేనే బాగా నిద్రొచ్చింది. ఎంత ప్రయత్నించినా నిద్ర పోకుండా ఉండలేకపోయింది. దాంతో నియంత్రణ కోల్పోయి ఉన్నచోటే పడిపోయింది. చుట్టుపక్కల వాళ్లంతా అక్కడికి చేరుకుని, హుటాహుటిన ఆమెని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అలా ఎందుకు జరిగిందో డాక్టర్లకు అర్థం కాలేదు. టెస్ట్‌లు చేస్తే అంతా బాగానే ఉంది. కానీ ఆమె స్పృహలో లేదు.
చివరికి ఆమెకు స్ట్రోక్ వచ్చిందని డాక్టర్ నిర్ధారణకు వచ్చారు. ఆమెని హాస్పిటల్‌లో చేర్చిన నాలుగో రోజు నిద్రలో నుంచి బయటికి వచ్చింది. దాంతో డాక్టర్ డిశ్చార్జ్ చేసి ఆమెను ఇంటికి పంపించారు. కొన్నాళ్లు ఊళ్లో అంతా బాగానే ఉంది. తర్వాత లియుబోవ్ బెల్కోవాకు జరిగినట్టే అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు ఆడవాళ్లకు జరిగింది. ఆ తర్వాత ఓ చిన్న పిల్లాడు కూడా అకస్మాత్తుగా నిద్రలోకి జారుకున్నాడు.
ఇదంతా చూసిన ఆ ఊరి వాళ్లు ఏదో వింత వ్యాధి అందర్నీ వెంటాడుతోందని భయపడ్డారు. ఒకరి తర్వాత ఒకరికి సమస్య రావడంతో అది అంటు వ్యాధి అనుకున్నారు. చూస్తుండగానే రెండేండ్లలోనే చాలామందికి ఈ సమస్య వచ్చింది. ఊళ్లో మొత్తం 810 మంది ఉంటే వాళ్లలో ఏకంగా 160 మంది అకస్మాత్తుగా రోజుల తరబడి నిద్రపోయే సమస్య బారిన పడ్డారు.
ఏమీ గుర్తుండదు
ఈ మొత్తంలో ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ విచిత్రమైన గ్రామంలో రోజుల తరబడి నిద్రలోకి జారుకున్న వాళ్లకు నిద్ర లేచాక ఏమీ గుర్తుండదు. నిద్రపోయాక గతంలో జరిగిన అన్ని విషయాలను మర్చిపోతారు. కాకపోతే అది తాత్కాలిక మరుపు మాత్రమే. మళ్లీ కొన్నాళ్లకు ఒక్కొక్కటిగా విషయాలు గుర్తుకొచ్చేస్తాయి. మరో వింత ఏంటంటే.. నిద్ర నుంచి లేచిన వెంటనే చాలామంది శృంగారం కోరుకుంటారట! ముఖ్యంగా మగవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. శృంగారం కోసం డిమాండ్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి దాదాపు నెల రోజుల పాటు ఉంటుంది. నిద్రలో ఉన్నప్పుడు సరిగ్గా స్పృహలో లేకపోయినా లైంగిక కోరికలు వాళ్లలో గుర్తించినట్టు అక్కడి డాక్టర్లు చెప్పారు. అయితే.. వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇదే ఊరిలో చాలామంది నిద్రలేమితో కూడా బాధపడుతుండడం ఆశ్చర్యకరం.
దెయ్యాలే కారణమా?
ఇలా ఆ ఊళ్లో వాళ్లకు మాత్రమే ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఎన్ని వైద్య పరీక్షలు చేసినా ఆ నిద్ర వెనక ఉన్న కారణాలను తెలుసుకోలేకపోయారు. పైగా లక్షణాలు ఊరందరిలో కాకుండా160 మందిలో మాత్రమే కనిపించాయి. దాంతో ఆ గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయి. వాటి ప్రభావం వల్లే వాళ్లు విపరీతంగా నిద్రపోతున్నారనే పుకార్లు మొదలయ్యాయి. ఆ పుకార్లు చుట్టు పక్కల ఊళ్లకు కూడా పాకడంతో విషయం పెద్దదైంది. దాంతో 2012లో ఈ ఊరి గురించి న్యూస్ పేపర్‌లో ఒక వార్తా కథనం పబ్లిష్ అయ్యింది. అలా ఈ సమస్య గురించి ప్రపంచానికి తెలిసింది.
ఘోస్ట్ టౌన్
ఈ గ్రామానికి ఆనుకుని ‘క్రాస్నోగోర్స్క్’ అనే ఒక ఘోస్ట్ విలేజ్ ఉంది. అక్కడ యురేనియం నిల్వలు భారీగా ఉండేవి. గతంలో రష్యా అక్కడ తవ్వకాలు చేసింది. కానీ.. 1991లో కజకిస్తాన్ గవర్నమెంట్ గనుల తవ్వకాల మీద తాత్కాలిక నిషేధం విధించింది. దాంతో రష్యన్ మైనర్లు క్రాస్నోగోర్స్క్‌ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటివరకు 6,500 మందితో చిన్నపాటి టౌన్‌లా ఉండే ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. అయితే.. అక్కడ తవ్విన గనుల్లో ఇప్పటికీ యురేనియం ఉంది. దానివల్లే ఈ ఊరి ప్రజలకు నిద్ర సమస్య వచ్చిందని మొదట్లో చాలామంది నమ్మారు. ఈ ఊరి గురించి తెలుసుకున్న సైంటిస్ట్‌లు ఇక్కడ పరిశోధనలు మొదలుపెట్టారు. కొన్నాళ్లు రీసెర్చ్ చేశాక ఆ గ్రామంలో యురేనస్ అనే విష వాయువు ప్రభావం ఉందని చెప్పారు. కానీ.. దానివల్లే ఎక్కువ సేపు నిద్రపోతున్నారని అంచనా వేయలేం అన్నారు వాళ్లు.
చెక్కల సపోర్ట్
ఘోస్ట్ టౌన్ క్రాస్నోగోర్స్క్‌లో గనులు తవ్వినప్పుడు, అవి కూలిపోకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో చెక్కలను అడ్డుగా పెట్టారు. గనులు మూసేసినప్పుడు వాటిని అలాగే వదిలేశారు. తర్వాత ఆ గనుల్లో పూర్తిగా నీరు చేరింది. అందులోని చెక్కలు చాలాకాలం పాటు నీటిలో మునిగి ఉండడం వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ మోనాక్సైడ్ విడుదలైంది. అది ఈ ప్రదేశంలోని వాతావరణంలో ఉన్న హైడ్రోకార్బన్ కణాలతో కలవడం వల్ల రసాయన చర్య జరిగింది. ఆ గాలిని పీల్చడం వల్ల జనాలకు ఎక్కువగా నిద్ర వస్తోందని తేల్చారు. కానీ.. అదే నిజమైతే.. ఊరందరికీ ఈ సమస్య రావాలి. కానీ.. కేవలం160 మందికి మాత్రమే ఎందుకొచ్చింది? ప్రత్యేకంగా 2010 నుంచి 2015 మధ్యే ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఆ తర్వాత, అంతకుముందు ఎందుకు రాలేదు? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. అందుకే ఈ థియరీని కూడా చాలామంది నమ్మడం లేదు.
కలలు
ఈ ఊళ్లో నిద్ర పోయేవాళ్లలో చాలామందికి నిద్రలో ఉన్నప్పుడు రకరకాల కలలు వస్తుంటాయి. ఊళ్లో చాలామంది దాదాపు ఆరు రోజులు నిద్రపోయేవాళ్లు. వాళ్లకు ప్రతి రోజు కలలు వచ్చేవి. మేల్కొన్న తర్వాత కూడా తీవ్రమైన భ్రాంతులు, వికారం, ఆనందం, బాధ లాంటివి కలిగేవి. నిద్రలో ఉన్నప్పుడు వాళ్ల మంచం చుట్టూ గుర్రాలు తిరుగుతున్నట్టు, మంచం మీద పాములు పాకుతున్నట్టు, వాళ్లు మరో లోకంలో ఉన్నట్టు.. ఇలా రకారకాల కలలు వచ్చేవట! ఈ నిద్ర సమస్య పెద్దవాళ్లు, పిల్లల్నే కాదు.. పెంపుడు జంతువులను కూడా వదల్లేదు. కొన్ని పెట్స్ వరుసగా నాలుగైదు రోజులు నిద్రపోయేవి. వాటికి మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చేవి. అక్కడి జంతువులు ‘ఎన్సెఫలోపతి’అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సైంటిస్ట్‌లు నిర్ధారించారు.
ప్రస్తుతం.. ఈ గ్రామంలో120 కుటుంబాలు నివసిస్తున్నాయి. ‘‘2015 నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఇలాంటి సమస్య రాలేదు. కానీ.. భవిష్యత్తులో రాదని చెప్పలేం’’ అంటున్నారు సైంటిస్ట్‌లు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మళ్లీ నిద్ర సమస్య వచ్చే ప్రమాదం ఉందని రష్యన్ సైంటిస్ట్ ప్రొఫెసర్ లియోనిడ్ రిఖ్వానోవ్ చెప్పాడు.
వోడ్కా ఎఫెక్ట్
ఈ ఊళ్లో జనాలు చాలామందికి వోడ్కా తాగే అలవాటు ఉంది. అయితే.. ఆ విషయం తెలిసి ఎవరో ఈ ఊరికి సప్లై చేసే వోడ్కాలో పాయిజన్ కలిపారు. దానివల్లే నిద్ర సమస్య వచ్చిందని నమ్మారు. వోడ్కా మీదే కాదు.. ఆకాశం, గాలి, నీరు.. ఇలా అన్నింటిని అనుమానించారు. కానీ.. వాటన్నింటినీ సైంటిస్ట్‌లు కొట్టిపారేశారు.