సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్​పై చర్యలేవీ.?

  • ఆగస్టు 2న రిటెయినింగ్​ వాల్​ కూలి నీట మునిగిన సర్జ్​పూల్​
  • కాంట్రాక్ట్​ సంస్థను బ్లాక్​లిస్ట్​లో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక
  • నేటికీ ఏజెన్సీపై చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు​
  • నామమాత్రంగా నలుగురు అధికారుల సస్పెన్షన్
  • సాగర్​ నీటిమట్టం తగ్గితేనే రిపేర్లకు చాన్స్​
  • అయోమయంలో సుంకిశాల ప్రాజెక్టు  భవిష్యత్​

హైదరాబాద్, వెలుగు: సుంకిశాల ప్రాజెక్ట్​ రిటెయినింగ్​వాల్​ కుప్పకూలి 3 నెలలు గడిచినా సదరు కాంట్రాక్ట్​ సంస్థపై  ఉన్నతాధికారులు నేటికీ ఎలాంటి  చర్యలు తీసుకోలేదు. నామమాత్రంగా నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటువేసి చేతులు దులుపుకొన్నారు. సాగర్​ నీటిమట్టం తగ్గితేనే రిపేర్లకు చాన్స్​ ఉండడంతో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు అయోమయంలో పడింది. ఆగస్టు 2న  టన్నెల్​గేట్ ​కొట్టుకుపోవడంతో సర్జ్​పూల్​లోకి నీళ్లు దూసుకొచ్చి రిటెయినింగ్​వాల్​ కుప్పకూలింది. ఈ ఘటనతో ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లగా.. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఓవైపు సాగర్​లో నీటిమట్టం పెరుగుతున్నా.. లీకేజీలపై సైట్​సిబ్బంది హెచ్చరించినా కాంట్రాక్ట్​ సంస్థ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మెట్రో వాటర్​బోర్డు విచారణ కమిటీ తేల్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్​ను బ్లాక్​ లిస్టులో పెట్టాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయినా.. నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.


నాగార్జున సాగర్ ప్రాజెక్టు  డెడ్ స్టోరేజీకి చేరినా హైదరాబాద్​కు తాగునీరు సరఫరా చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం 2021లో  నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని  సుంకిశాల వద్ద  వాటర్ ఇన్​టేక్​ వెల్​ నిర్మించాలని నిర్ణయించింది. రూ.2,200 కోట్లకు పనులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ.. 2021 జూన్​11న వాటర్​బోర్డుతో ఒప్పందం చేసుకున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2022 మే 14 న అప్పటి మంత్రి కేటీఆర్​ ఇన్​టేక్​ వెల్​ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేండ్లలోనే మొ త్తం పనులు కంప్లీట్​ చేసి, హైదరాబాద్​కు తాగునీటిని సప్లై చేయాలని భావించారు.  ఘటన జరిగే నాటికి  రూ.1500 కోట్లు ఖర్చు చేసి, 60 శాతం మేర ఇన్ టేక్ వెల్ పనులు, 70 శాతం మేర పంపింగ్​మెయిన్ పనులు, 40 శాతం మేర ఎలక్ట్రో మెకానికల్ పనులు పూర్తిచేశారు. అయితే, ఘటన జరిగాక పనులు ప్రశ్నార్థకంగా మారాయి. వాస్తవానికి జూలై నెలాఖరు నుంచే శ్రీశైలం ద్వారా నాగార్జునసాగర్​ రిజర్వాయర్​లోకి వరద ప్రవాహం మొదలైంది. సాగర్​లో 530 అడుగులకు నీరు చేరగానే సొరంగం టన్నెల్​ గేట్​ధ్వంసమై సర్జ్​పూల్​లోకి వరదనీరు దూసుకొచ్చి, రిటెయినింగ్​వాల్​ కూలిపోయింది. దీంతో ఈ ఘటనపై  మెట్రోవాటర్​బోర్డు .. నాటి బోర్డు ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ సత్యానారాయణ,  రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్​కుమార్​, ప్రాజెక్టు  డైరెక్టర్ సుదర్శన్​తో ఒక విచారణ కమిటీ ప్రకటించింది.  ఈ కమిటీ సర్జ్​పూల్​ను పలుమార్లు సందర్శించి, రిటెయినింగ్​ వాల్​ కూలిన ఘటనపై వివిధ కోణాల్లో ఎంక్వైరీ చేసింది. ప్రాజెక్టు అధికారులు,  కాంట్రాక్ట్​ సంస్థ ప్రతినిధులు, సైట్​ ఇంజినీర్లతో మాట్లాడిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

 కాంట్రాక్ట్​ సంస్థ నిర్లక్ష్యం వల్లేనని కమిటీ నివేదిక 

ఆగస్టు 2న ప్రమాదం జరిగినప్పుడు సుంకిశాల ప్రాజెక్టు వద్ద పనులు జరుగుతున్నాయి. ఓవైపు సాగర్​లో నీటి ప్రవాహం పెరుగుతున్నా, సర్జ్​పూల్​లోకి వాటర్​ లీక్​ అవుతున్నట్టు అక్కడి సిబ్బంది సమాచారం ఇచ్చినా కాంట్రాక్ట్​ సంస్థ పట్టించుకోలేదని విచారణ కమిటీ గుర్తించింది. సాగర్​లో 590 అడుగుల నుంచి 450 అడుగుల వరకు వాటర్​లెవల్​ ఏ దశలో  ఉన్నా సొరంగ మార్గం ద్వారా సుంకిశాల పంపుహౌస్​​లోకి నీటిని తరలించే విధంగా డిజైన్​ చేశారు. కానీ 530 అడుగుల నీటి ధాటినే రిటైనింగ్​ వాల్ తట్టుకోలేదని, ఇందుకు నిర్మాణంలోని లోపాలే కారణమని సర్కారుకు ఇచ్చిన నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. వాస్తవానికి పంపుహౌస్​​లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తిచేస్తారని, కానీ ఇక్కడ అధికారులు మోటార్లు బిగించకముందే మూడు సొరంగ మార్గాల్లో మూడో మార్గాన్ని ఓపెన్​ చేసి పెట్టారని వెల్లడించింది. రిటైనింగ్​ వాల్, గేట్ల నిర్మాణం పూర్తికావడంతో సొరంగ మార్గాన్ని తెరిచే ఉంచడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తేల్చింది. ఆగస్టు 1న ఉదయం పని ముగించుకుని పంపుహౌస్​ నుంచి వెళ్లిపోయిన సిబ్బంది.. భయంతో రెండో షిఫ్ట్​​లో పనిచేయడానికి రాలేదని, లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంట్రాక్ట్​సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పిన విచారణ కమిటీ కాంట్రాక్ట్​ సంస్థను బ్లాక్​ లిస్టులో పెట్టాలని సూచించింది. 

నామమాత్రపు చర్యలతో సరి 

సుంకిశాల ప్రమాదానికి కాంట్రాక్ట్​ సంస్థ నిర్లక్ష్యమే కారణమని ఎంక్వైరీ కమిటీ తేల్చినా ఉన్నతాధికారులు మాత్రం ఆఫీసర్లపై నామామత్రపు చర్యలతో సరిపెట్టారు.   ప్రాజెక్టు డైరెక్టర్​ సుదర్శన్ ను  ట్రాన్స్​ఫర్​ చేయడంతో పాటు  సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్​ను సస్పెండ్ చేసి, చేతులు దులుపుకొన్నారు. అప్పటికే సుంకిశాల  ప్రాజెక్టు కోసం మొదట టాటా కన్సల్టెన్సీ ఇచ్చిన డిజైన్​మార్చడం, డీపీఆర్​లో  పేర్కొన్న స్థలంలో కాకుండా వేరే చోట నిర్మాణం చేపట్టడం,  అంచనాలు పెంచడం లాంటి ఆరోపణలు గత ప్రభుత్వంపై వచ్చాయి. దీనికితోడు మెట్రోవాటర్​బోర్డు నివేదిక ఆధారంగా నాటి సర్కారు పెద్దలతో పాటు కాంట్రాక్ట్​ సంస్థపైనా చ ర్యలు తీసుకుంటారనే  వార్తలు వెలువడ్డాయి. తీరా ఘటన జరిగి 3 నెలలు గడిచిపోయినా నేటికీ కాంట్రాక్ట్​ సంస్థపై ఈగ వాలకపోగా, సదరు మేఘా ఇంజినీరింగ్​కంపెనీకి రాష్ట్రంలో  కొత్త ప్రాజెక్టులు దక్కుతుండడం గమనార్హం.