విద్యుత్​ కొనుగోళ్ల విచారణపై కేసీఆర్ కు భయమెందుకు.?

విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి జరుగుతున్న విచారణపై కేసీఆర్​కు, ఆయన అనుచర బృందానికి భయమెందుకు? ఈ అంశంలో గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న సామెతలా గులాబీ సేన వ్యవహారం ఉంది.  కమిషన్​ను  రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టేయడం.. ఆయనకు చెంపపెట్టు లాంటిదని చెప్పాలి. పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎలా? చట్టం ముందు అందరూ సమానమేనన్న సంగతి మరిస్తే ఎలా? తామేదో చట్టానికి అతీతం అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల ప్రవర్తన ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాల హయాంలో ఏదైనా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు .. కొత్తగా వచ్చిన ప్రభుత్వం దానిపై విచారణకు ఆదేశించడం సహజం. 

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్ పేరుతో అడ్డగోలుగా విద్యుత్ కొనుగోళ్లు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.  చత్తీస్ గఢ్​రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం కుదుర్చుకున్న ఒప్పందం వెనుక అవినీతి బాగోతం ఉందనేది అప్పట్లో ప్రతిపక్షాలు,  ప్రజాసంఘాలు, మేధావులు, విద్యుత్ రంగ నిపుణులు ఆరోపణలు చేస్తూ వచ్చారు.  దేశంలో  చాలా రాష్ట్రాల్లో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉండగా .. ఎక్కువ ధరకు చత్తీస్ గఢ్​ రాష్ట్రం నుంచే ఎందుకు విద్యుత్ కొనుగోళ్లు జరిగాయన్నది  ప్రాథమికంగా ఉత్పన్నమౌతున్న ప్రశ్న. ఇక దాంతో పాటు రాష్ట్రంలో యాదాద్రి , భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణంపై కూడా చాలా ఆరోపణలు వెల్లువెత్తాయి. దేశంలో తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేసేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తుంటే .. అత్యంత ఖరీదైన థర్మల్ ప్లాంట్స్ వైపు కేసీఆర్ ఆనాడు మొగ్గు చూపారు అనేది పాయింట్. 2014లో నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలను అసెంబ్లీ ముందు పెట్టాలని డిమాండ్  చేశారు.  నాడు  సీఎంగా ఉన్న కేసీఆర్ బరాబర్ పెడతాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ పెట్టలేదు.

ఎన్నో చెబుతాం .. చెప్పినవన్నీ చేస్తామా?

విద్యుత్​ ఒప్పందంపై  మళ్ళీ రేవంత్ రెడ్డి తిరిగి ప్రశ్నించినప్పుడు కేసీఆర్ విచిత్రమైన సమాధానం ఇచ్చారు.  ఎన్నో చెబుతాం .. చెప్పినవన్నీ చేస్తామా?  పవర్  ఒప్పంద పత్రాల్లో ఎన్నో రహస్యాలు ఉంటాయి. అవన్నీ ఎలా సభ ముందు పెడతాం అంటూ నాడు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను  ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వం చేసిన అప్పులను అసెంబ్లీలో  వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగడం లాంటివి జనాలకు తెలిసేలా సభ ముందుపెట్టారు. అలాగే విద్యుత్ అంశంలో వచ్చిన ఆరోపణలు ఏంటి .. జరిగిన వాస్తవికత ఏంటి? 24 గంటల విద్యుత్ అనే నినాదం వెనుక జరిగిందేంటో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఆ సమయంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవన్నీ అవాస్తవాలని అధికార పక్షం సభలో తప్పులు చూపెడుతోందని ఆరోపణలు చేశారు. వాస్తవాలు బయటపడాలంటే ఒక విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన అంశం మనకందరికీ తెలుసు.  అందులోనూ స్వయానా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ డిమాండ్ చేయడం గమనార్హం.  ప్రతిపక్షం చేసిన డిమాండ్ మేరకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను విచారణ కోసం నియమించింది. కమిషన్ దీనిపై నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను, నాటి సీఎండీ ప్రభాకర్ రావును సైతం విచారణకు పిలిచి ప్రశ్నలు అడుగుతున్న విషయం అందరికి తెలుసు. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిలను విచారణకు పిలవడంలో  తప్పేముంది?

నిజాలు నిగ్గు తేల్చేందుకు కమిషన్​

జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో విసిరిన సవాల్ మేరకే  జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటైందన్న సూక్ష్మాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు.  జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటీషన్ వేయడం ఎందుకు?  విచరాణ కమిషన్ చట్టవ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అంటూ వాదనలు వినిపించడం ఏంటి? జస్టిస్ నరసింహారెడ్డి ఎంతో క్రెడిబులిటీ కలిగిన వ్యక్తి అని అందరికి తెలుసు.  అలాంటి వ్యక్తిపై గులాబీ నేతల ఆరోపణలు ఏమిటి? విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్స్ నిర్మాణాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ  కమిషన్ ఏర్పాటు చేసింది. తప్పు చేయనప్పుడు .. నాటి ప్రభుత్వంలో జరిగిన వాస్తవాలను కమిషన్ ముందు హాజరై చెప్పేందుకు జంకు ఎందుకు?  దీనికోసం కమిషన్ రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లడం ఏంటి?  హైకోర్టుతో చీవాట్లు పడటం ఏంటి? తప్పు చేయలేదని బల్లగుద్ది మరీ వాదిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. హైకోర్టు తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టు కాదా?  ఇది చాలదన్నట్టు కేసీఆర్  సుప్రీంకోర్టుకు  వెళ్లినా ఆశించిన ఊరట లభించలేదనే చెప్పాలి.  కమిషన్ రద్దు చేయాలనే కేసీఆర్ వాదనను సుప్రీంకోర్టు కూడా పట్టించుకోలేదు.  కేసీఆర్  లేవనెత్తిన వాదన సహేతుకం కాదని దానర్థం.  కమిషన్ చైర్మన్​నరసింహారెడ్డిని మార్చాలనే  ప్రభుత్వానికి సూచన చేసింది తప్ప .. కమిషన్ రద్దు చేయాలనే ఆయన డిమాండ్ ను  తోసిపుచ్చిందనే విషయాన్ని కేసీఆర్ ఆయన బృందం గుర్తెరగాలి. ఇకనైనా .. కేసీఆర్,  ఆయన పార్టీ నేతలు వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేయకుండా కమిషన్ ముందు హాజరై వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది.  

- కోడూరు శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్ట్