కవర్ స్టోరీ : ఇరానీ చాయ్​ ఎలా పుట్టింది?.ఎందుకంత ఫేమస్

ఇరానీ చాయ్​ అంటే చాలామందికి... మరీ ముఖ్యంగా హైదరాబాదీలకు ఒక ఎమోషన్​. హైదరాబాద్​ బిర్యానీని ఎంత ఇష్టపడతారో ఇరానీ చాయ్​ని కూడా అంతే ఇష్టపడతారు. ఇరానీ చాయ్​కి పేద, గొప్ప అనే క్లాస్​ల తేడా ఉండదు. హైదరాబాదీల సంస్కృతిలో ఇరానీ చాయ్ ఒక భాగం. దేశవిదేశాల్లో ఎక్కడి నుంచి వచ్చినవాళ్లైనా హైదరాబాద్​లో ఇరానీ చాయ్​ తాగాల్సిందే... ‘వాహ్​.. ఇరానీ’ అనాల్సిందే. కానీ.. హైదరాబాదీలకు ఇరానీ చాయ్​తో ఉన్న అనుబంధం రోజురోజుకూ బలహీనపడుతోంది. ఆ తెల్లని కప్పులు, సాసర్ల ప్లేస్​ల్లోకి పేపర్​ కప్పులు వచ్చి చేరాయి. బన్​కు బదులు బర్గర్లు తింటున్నారు. నెమ్మదిగా ఇరానీ చాయ్​ రుచి మసకబారుతోంది.

ఫ్లేవర్డ్​ చాయ్​లు ఎన్ని వచ్చినా.. ఇరానీ చాయ్​ కాస్త ఎక్కువ స్పెషల్ అనే చెప్పాలి​. గతంలో సికింద్రాబాద్ సరోజీని దేవి రోడ్​ నుంచి పాత బస్తీ శాలిబండ దాకా... అంతటా ఇరానీ కెఫేలు ఉండేవి. అంతెందుకు జంటనగరాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇరానీ హోటళ్ల పేరిట బస్టాపులు కూడా ఉన్నాయంటే... వాటికి ఎంత ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అబిడ్స్​లోని గ్రాండ్ హోటల్, సికింద్రాబాద్ పారడైజ్​, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ దగ్గర ఉండే ఆల్ఫా హోటల్​, బ్లూసీ హోటల్, కేఫ్ బహార్​, మెహదీపట్నంలో సర్వీ హోటల్​, డైమండ్​ పాయింట్​...  ఇలా ఎన్నో హోటల్స్ ఎన్నో ఏండ్లుగా ఇరానీ చాయ్​ రుచులను అందిస్తున్నాయి. మరి ఇంతటి స్పెషల్​ అయిన ఇరానీ చాయ్​కి ఇప్పుడు ప్రాధాన్యత తగ్గుతోంది. ఈ పరిస్థితికి కారణాలు అనేకం. వాటిలో టీ బిజినెస్​ చెయిన్స్, భూముల ధరలు పెరగడం, డెవలప్​మెంట్​లో భాగంగా జరుగుతున్న విస్తరణలు.. వంటివెన్నో ఉన్నాయని కేఫ్​ల  నిర్వాహకులు చెప్తున్నారు. 

ఇరాన్​ నుంచి హైదరాబాద్​కు 

ఇరానీ కేఫ్​ల సంస్కృతిని ముందుగా ఇండియాకు తీసుకొచ్చింది జొరాస్ట్రియన్ ఇరానియన్లు. వాళ్లు ఇండియాకు రెండు విడతలుగా వచ్చారు. మొదట వచ్చిన వాళ్లను ‘పార్శీలు’ అని పిలుస్తారు. వీళ్లు ఎక్కువగా గుజరాత్, బొంబాయిలో స్థిరపడ్డారు. 20వ శతాబ్దంలో ఇరాన్​లో తీవ్రమైన కరువు వచ్చింది. అక్కడి​ ప్రజలు తినడానికి తిండిలేక రెండోసారి ఇతర దేశాలకు వలసలు వెళ్లడం మొదలైంది. ఈ రెండు విడతల్లో వలస వచ్చిన వాళ్లను ఇరానియన్లు అంటారు. వీళ్లు ఇండియాలోని చాలా ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆ క్రమంలోనే చాలామంది కరాచీకి వలస వచ్చారు. అప్పుడు కరాచీ కూడా ఇండియాతో పాటు బ్రిటిష్ పాలనలో ఉండేది. దాంతో వాళ్లంతా అక్కడి నుంచి బాంబే పోర్ట్​ గుండా ఇండియాకు వచ్చారు. 

వాళ్లు మొదటగా ఇరానీ చాయ్​ బిజినెస్​ అక్కడ మొదలుపెట్టారు. తమ దేశంలో చేసుకునే చాయ్​నే బతుకుదెరువు కోసం ఇక్కడ చేశారు. ఆ చాయ్​ రుచి మనవాళ్లకు నచ్చడంతో ‘ఇరానీ చాయ్​’  పేరుతో హోటల్స్​ తెరిచారు అప్పట్లో. ముంబైలోని ప్రసిద్ధ లియోపోల్డ్ కేఫ్ అలా ఏర్పాటయ్యిందే. స్వాతంత్ర్య పోరాటం టైంలో జనాలు ఈ కేఫ్‌‌ల్లో సమావేశం అయ్యేవాళ్లు. ఆ తర్వాత ఇరానీయన్లు ముంబయి నుంచి పూనే వెళ్లి అక్కడ వ్యాపార విస్తరణ మొదలుపెట్టారు. కాకపోతే.. ముంబయితో పోల్చినప్పుడు పూనేలో కేఫ్‌‌లు తక్కువ. ఆ కేఫ్​లు తర్వాత పూనే నుంచి హైదరాబాద్, అహ్మదాబాద్​తోపాటు మరికొన్ని ప్రాంతాలకు వచ్చిచేరాయి. ఒకప్పడు హైదరాబాద్ అంటే పాత బస్తీ పరిసర ప్రాంతాలే. అందుకే ఈ కేఫ్​లు ఎక్కువగా ఆ ఏరియాలోనే కనిపిస్తాయి.  ఓల్డ్​ సిటీలోని ప్రతి సందులో ఇరానీ కేఫ్ ఉండేది. కానీ.. మన దగ్గర మనవాళ్లకు నచ్చేలా ఇరానీ చాయ్​ పెట్టే విధానంలో కొన్ని మార్పులు వచ్చాయి. అందుకే దీన్ని ‘హైదరాబాదీ చాయ్ లేదా ఇరానీ దమ్ చాయ్’ అని పిలుస్తారు.  

మొదట సైన్యానికి​

బ్రిటిష్​ సైన్యంలో పనిచేసే మిలిటరీ వాళ్లకు ప్రతిరోజూ ఏదో ఒక డ్రింక్​ ఇచ్చేవాళ్లు. అలా పూనేలోని ఒక కంటోన్మెంట్​లో మిలిటరీ ఇంఛార్జ్​ తన సైన్యానికి మార్నింగ్​ ఎక్సర్​సైజ్​ చేయడానికి ముందు ఇరానీ చాయ్​ని ఇప్పించేవాడు. అక్కడి ఇరానీయులు ప్రతి రోజూ చాయ్​ తయారుచేసి మిలిటరీ వాళ్లకు ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత చిన్న చిన్న ఔట్‌‌లెట్లు మొదలయ్యాయి.1936 నాటికి ఇరానీ చాయ్​ హైదరాబాద్​కు వచ్చిందని చెప్తున్నారు చరిత్రకారులు. అయితే, ఇరాన్​లో తయారయ్యే చాయ్​లో పాలు పొయ్యరు. చక్కెరను నోట్లో వేసుకుని, నోటిని తీపి చేసుకుని డికాక్షన్ తాగుతారు. మన దగ్గర మాత్రం... డికాక్షన్​, పాలు విడి​గా వేడి చేసి... ఇరానీ చాయ్​ తయారుచేస్తారు.  

ధర ఎక్కువ...

సాధారణ చాయ్​లతో పోలిస్తే... ఇరానీ చాయ్ ధర కాస్త ఎక్కువే. ఎందుకంటే ఇరానీ చాయ్​ తయారీ  వేరు​గా ఉంటుంది. అలాగే ఇరానీ చాయ్​లో వాడే టీపొడి కూడా అస్సోం నుంచి ప్రత్యేకం​గా తెప్పిస్తారు. సాధారణ టీలతో పోలిస్తే... ఇరానీ టీ తయారీలో డికాక్షన్​ను ఎక్కువసేపు మరిగిస్తారు. దాదాపు గంటకు పైగా మరిగిస్తేనే దానికి ఆ రుచి వస్తుంది. పాలను కూడా ఎక్కువ సేపు మరిగించాలి. అలాగే... ఇలాచీ, గసగసాలు లాంటి పదార్థాలు కలిపి తయారు​ చేస్తారు. దాంతో ఇతర చాయ్​లతో పోలిస్తే ఇరానీ చాయ్ తయారు చేసేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు హోటల్ నిర్వాహకులు. 

ఎలా పుట్టింది?

వాస్తవానికి ఇరానియన్లు తాగే చాయ్​లో పాలు ఉండవు. అది చాలా స్ట్రాంగ్​గా ఉంటుంది. కుంకుమ పువ్వు, ఇలాచి లాంటి సుగంధ ద్రవ్యాలతో పాటు టీ పొడిని వేడినీళ్లలో వేసి మరగబెడతారు. అప్పుడది డికాక్షన్​గా మారుతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో చక్కెర వేయకుండా నోట్లో దవడకు చక్కెర క్యూబ్​ పెట్టుకుంటారు. చేసే ప్రతి సిప్‌‌తో పాటు నోట్లో ఉన్న చక్కెర క్యూబ్​ కొంత కరిగి వచ్చే నీళ్లను మింగుతారు. కానీ.. ఇండియన్​ స్టయిల్ టీలో పాలు కలుపుతారు. అందుకని ఇరానీ చాయ్​కి ఇండియన్​ టచ్ చేర్చారు. అలా ఇప్పుడు మనం తాగుతున్న ఇరానీ చాయ్​ తయారైంది.

కార్నర్స్​లోనే ఎక్కువ 

ఇరాన్​ నుంచి వలస వచ్చినవాళ్ల దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు. అందువల్ల తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించాల్సి వచ్చింది. అందుకే తక్కువ ధరకు దొరికే స్థలాలు కొనేవాళ్లు. తక్కువ రేటు ఉండే దుకాణాలనే అద్దెకు తీసుకునేవాళ్లు. మనదగ్గర చాలామందిలో కార్నర్​లో ఉన్న ఇళ్లు కలిసిరావనే నమ్మకం ఉంది. అలాంటివి ప్లాట్లు తక్కువ ధరకు అమ్మేసేవాళ్లు. అలాంటి స్థలాలను ఇరానియన్లు కొనేవాళ్లు. అందుకే ఇరానీ కేఫ్​లు ఎక్కువగా కార్నర్లలోనే ఉంటాయి. అదే కొన్నేండ్లకు ఇరానీ కేఫ్‌‌ల ట్రేడ్‌‌మార్క్ ఫీచర్‌‌గా మారింది. ఇరానీ కేఫ్​లు కార్నర్లలో పెడితేనే బాగా నడుస్తాయి అనేలా మారిపోయింది. 

ఇరానీ కేఫ్‌‌ల నిర్మాణం కూడా చాలా డిఫరెంట్​గా ఉంటుంది. పాతకాలపు కేఫ్​ల్లో ఎక్కువగా పర్షియన్​ స్టయిల్​ కనిపిస్తుంటుంది. స్టెయిన్డ్ గ్లాసెస్ (కిటికీలకు పెట్టే రంగురంగుల అద్దాలు. అన్ని రంగుల గ్లాస్​లను కరిగించి మెటాలిక్ ఆక్సైడ్‌‌లను కలిపి వీటిని తయారుచేస్తారు), జియోమెట్రిక్​ ప్యాటర్న్​డ్​ టైల్స్​, చెక్క కుర్చీలు, మార్బుల్​ టాప్స్‌‌ లాంటివి స్పెషల్​ ఎట్రాక్షన్స్​. 

కేఫ్​లు పెట్టగానే.. 

నిజాం కాలంలో ఫ్యామిలీస్​తో కలిసి బయట భోజనం చేయడం చాలా తక్కువ. హోటళ్లలో భోజనం చేయడం, టీ తాగడం లాంటివి హైదరాబాదీ సంస్కృతిలో లేవు. అందుకే వీళ్లు కేఫ్​లు పెట్టిన కొన్నేండ్ల వరకు వాళ్లకు లాభాలు రాలేదు. కానీ.. ఉన్నత చదువుల కోసం ఐరోపా దేశాలకు వెళ్లి వచ్చినవాళ్లు మాత్రం ఇరానీ కేఫ్‌‌ల్లో టీ తాగుతూ, సిగరెట్ వెలిగించి టైం స్పెండ్​ చేసేవాళ్లు. ఆ తర్వాత కొన్నేండ్లకు కాలక్రమేణా స్టూడెంట్స్​ నుంచి ఉద్యోగుల వరకు అందరూ కేఫ్​లకు వెళ్లడం మొదలైంది. చాలామంది వాటిని తమ హ్యాంగవుట్ ప్లేస్‌‌గా చేసుకున్నారు. 

కేఫ్‌‌ల్లో ఉర్దూ వార్తాపత్రికలు ఉండేవి. దాంతో పెద్దవాళ్లు ఉదయాన్నే పేపర్‌‌ని స్కాన్ చేసేవాళ్లు. యూత్​​ మాత్రం సాయంత్రాలు పేపర్లు చదివేవాళ్లు. 
జనాలు ఇరానీ కేఫ్​ల్లో గంటల తరబడి కూర్చుని రాజకీయాల గురించి చర్చించుకునేవాళ్లు. ఏ కేఫ్​లో కూర్చున్నా పాత హిందీ పాటలు మంద్రంగా వినిపిస్తుండేవి. కొంతమంది ఆ పాటలు వినడానికే వచ్చేవాళ్లు. స్టూడెంట్స్​ అయితే ఒక చాయ్​ తీసుకుని రెండు భాగాలు చేసుకుని ఒకరు కప్పులో, ఒకరు సాసర్​లో తాగేవాళ్లు. అంతేకాదు.. కార్మికులు, మేధావులు, డబ్బున్నవాళ్లు, లేనివాళ్లు రాజకీయ నాయకులు.. వాళ్లు వీళ్లు అని కాదు అందరినీ ఒక చోటకు చేర్చిన ప్లేస్​ ఇరానీ కేఫ్​. 

కళ తప్పాయి

ఒకప్పుడు కళకళలాడిన ఇరానీ కేఫ్​లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఆధునిక హంగులతో ఏర్పాటవుతున్న కాఫీ కేఫ్​లు, టీ ఫ్రాంచైజీ చెయిన్స్​. పెరిగిన రియల్​ ఎస్టేట్​... ఇరానీ చాయ్ వ్యాపారం మీద దెబ్బ వేశాయి. దాంతో ఇరానీ కేఫ్‌‌ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్​లో 50 ఏండ్ల కిందట 450కు పైగా ఇరానీ కేఫ్​లు ఉండేవి. కానీ.. ఇప్పుడు వాటి సంఖ్య 125కు పడిపోయింది. ఇక్కడే కాదు.. ముంబై, పూనేల్లో కూడా వీటి సంఖ్య బాగానే తగ్గిపోయింది. ముంబైలో 1960ల్లో 550కి పైగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 40కి, పూనేలో 80 నుంచి15కు పడిపోయింది. 

ఫాస్ట్​ ఫుడ్​ ఎంట్రీ

ఒకప్పుడు ముంబయిలోని ఏ ఇరానీ కేఫ్‌‌కి వెళ్లినా.. బ్రూన్ మస్కా పావో (బ్రెడ్​, బటర్), చిన్న టిన్‌‌ఫాయిల్ కంటైనర్లలో బేక్​ చేసిన మావా కేకుల సువాసన, ఖీమా పావో (మటన్​ ఖీమా బ్రెడ్​) ప్లేట్లు, వేడి వేడి ఇరానీ టీ కప్పులు వెల్​కం చెప్పేవి. కానీ.. ఇప్పుడు ఇలాంటి కేఫ్​ల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఉన్న కొన్ని కేఫ్​ల్లో కూడా ఇలాంటి వాతావరణం కనిపించడంలేదు. అక్కడే కాదు.. హైదరాబాద్​లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. గ్లోబలైజేషన్​ వల్ల రకరకాల బిజినెస్​లు, బిజినెస్​ మోడల్స్​ ఇండియాలోకి అడుగుపెట్టాయి. దాంతో.. ఇరానీ కేఫ్​లకు లాభాలు తగ్గాయి. 

నిర్వాహకులు కేఫ్​లను నిలబెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా.. చైనీస్​ ఫాస్ట్​ఫుడ్​ లాంటివి కూడా ఈ కేఫ్​ల్లో అమ్ముతున్నారు. చాలామంది కేఫ్ యజమానులు ఇండో–చైనీస్ వంటకాలైన చికెన్ హక్కా నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌‌,  చికెన్ మంచూరియా లాంటి వాటిని అమ్మడం మొదలుపెట్టారు. దాంతో కేఫ్‌‌లు ఏండ్ల నాటి అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. నెమ్మదిగా ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లుగా మారిపోతున్నాయి. 

కాంబినేషన్ లేదు 

గతంలో కేఫ్​లకు వచ్చేవాళ్లలో చాలామంది చాయ్​తోపాటు కాంబినేషన్​గా ఏదో ఒక శ్నాక్​ తినేవాళ్లు. ఒకచేతిలో టీ కప్పు మరో చేతిలో బన్​మస్కా ఉండేది. లేదంటే.. ఉస్మానియా బిస్కట్, థాయ్​ బిస్కట్​, ఫైన్​ బిస్కెట్​, కారా బిస్కెట్, సమోసా లాంటివి తినేవాళ్లు. ఒక్కో హోటల్​లో ఒక్కో కాంబినేషన్ ఫేమస్​గా ఉండేది. కానీ.. ఇప్పుడు అలాంటి వాళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఒక చేతిలో టీ కప్పు మరో చేతిలో ఫోన్​ ఉంటుంది. సోషల్​ మీడియా ఫీడ్​ను స్క్రోల్​ చేస్తూ.. టీ తాగుతున్నారు. దానివల్ల అసలైన ఇరానీ చాయ్​ ఫ్లేవర్​ని ఆస్వాదించలేకపోతున్నారు అనొచ్చు.

 పైగా టీ మాత్రమే తాగడం వల్ల కేఫ్​లకు లాభాలు కూడా తగ్గుతున్నాయి. ‘‘నిజంగా ఇరానీ చాయ్​ని ఆస్వాదించాలంటే.. కప్పులోని కొంత టీని సాసర్‌‌లో పోసి, దానిని నెమ్మదిగా చప్పరించాలి.​ తెల్లని స్టీల్​ ప్లేట్లో పెట్టుకుని సర్వర్​ తెచ్చిన బన్​ మస్కా / కరకరలాడే ఆనియన్​ సమోసా, కోకోనట్​ బిస్కెట్లు మరో చేత్తో తినాలి. లేదంటే.. చాయ్‌‌కి పెద్ద అపచారం చేసినట్టే” అంటాడు ఓ టీ లవర్​. కానీ.. చాయ్​ తాగడానికి ఇంతలా టైం కేటాయించే వాళ్లు చాలా తక్కువ. అందుకే ఎన్నో ఇరానీ కేఫ్​లు మూతపడ్డాయి. 

ఖర్చు ఎక్కువైంది

మామూలు చాయ్​తో పోలిస్తే.. ఇరానీ చాయ్ తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ధర మీద పడుతుంది. మిగతా రకాల టీలు తక్కువ ఖర్చుతో రెడీ అయిపోతాయి. కాబట్టి వాటి ధర తక్కువ. అందుకే ఇరానీ చాయ్​ తాగేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇరానీ టీ పౌడర్ ఒకప్పుడు 300 రూపాయలు ఉండేది. ఇప్పుడు 500 రూపాయలు దాటింది. ఫుల్ ఫ్యాట్ గేదె పాలు హైదరాబాద్​లో లీటరుకు100 రూపాయలకి పైనే అమ్ముతున్నారు. ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. కాబట్టి కేఫ్‌‌లో కప్పు టీని 15 రూపాయలకు అమ్మినా పెద్దగా లాభాలు రావడం లేదు. మామూలు టీని ఒకసారి చేసి, ఫ్లాస్క్‌‌లో పోసి పెట్టుకోవచ్చు. అదీకాదంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ.. ఇరానీ చాయ్​ని అలా చేయలేం. రోజంతా పాలు, డికాక్షన్​ గిన్నెల కింద మంట వెలుగుతూనే ఉండాలి. లేదంటే రుచిలో తేడా వస్తుంది. 
 

సిటీలో ఇరానీ కేఫ్‌‌ల మనుగడ ఎంత కష్టం అవుతుందో చెప్పడానికి లంగర్ హౌజ్‌‌లోని ఆర్టిలరీ సెంటర్ రోడ్‌‌లో ఉన్న ఇరానీ కేఫే ఉదాహరణ. కరోనా టైంలో ఈ కేఫ్​ మూతపడింది. గతంలో కేఫ్​ను లాభాల్లోకి తీసుకురావడానికి ఛాయ్ ధరను రెండు రూపాయలు పెంచారు. దాంతో కప్పు టీ ధర 12 రూపాయలు అయ్యింది. అయినా నష్టాలే వచ్చాయి. దాంతో15 రూపాయలకు పెంచారు. అయినా.. అనుకున్నంత లాభాలు రాలేదు. దాంతో.. చివరికి పాలు, టీ పొడి నాణ్యత విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. దాంతో కస్టమర్ల సంఖ్య తగ్గింది. రెగ్యులర్​గా వచ్చే కస్టమర్లు  కూడా రావడం మానేశారు. కరోనా టైంలో వ్యాపారం మరింత దెబ్బతింది. దాంతో.. కేఫ్​ని మూసివేయక తప్పలేదు. ఇదొక్కటే కాదు.. ఇలా మూతపడిన కేఫ్​లు మరెన్నో ఉన్నాయి. 

ఫ్యాన్సీ టీ జాయింట్స్​ 

కొన్నేండ్ల నుంచి ఫ్యాన్సీ టీ జాయింట్లు సిటీల్లో బాగా పెరిగిపోతున్నాయి. అవి ఇరానీ కేఫ్​లకు సంప్రదాయ కేఫ్‌‌లకు గట్టి పోటీని ఇస్తున్నాయి. వాటివల్ల కూడా ఇరానీ కేఫ్​లు తగ్గుతున్నాయి. ఇరానీ కేఫ్​ల్లో కేవలం ఇరానీ చాయ్​ మాత్రమే దొరుకుతుంది. కానీ.. ఫ్యాన్సీ టీ జాయింట్లలో రకరకాల ఫ్లేవర్ల చాయ్​లు అందుబాటులో ఉంటాయి. కొత్తదనం కోరుకునే యువత ఎక్కువగా అలాంటి టీ కేఫ్​లకు వెళ్తున్నారు. పైగా ఇరానీ చాయ్​తో పోలిస్తే.. ధర కూడా తక్కువే. ఫ్యాన్సీ టీ కేఫ్​ల యాంబియెన్స్​ కూడా అట్రాక్టివ్​గా ఉండడంతో ఎక్కువమంది ఆకర్షితులు అవుతున్నారు. దాంతో ఫ్యాన్సీ టీ కేఫ్​లు వెలిసిన ప్లేస్​ల్లో ఇరానీ చాయ్​కి గిరాకీ తగ్గి మూతపడుతున్నాయి. ‘టేస్టీ టీలు తయారు చేయడం చాలా ఈజీ. 

కానీ.. ఇరానీ చాయ్ లాంటి సంప్రదాయమైన టీ చేయడం అంత ఈజీ కాదు” అందుకే మా కేఫ్​లు కనుమరుగవుతున్నాయని చెప్తున్నారు నిర్వాహకులు. హైదరాబాద్‌‌లోని ‘ది గ్రాండ్’ హోటల్​ని1935లో 12 మంది ఇరానియన్లు కలిసి పెట్టారు. ఇది ఇప్పుడు కూడా చాలా ఫేమస్​. ప్రస్తుతం దాన్ని జలీల్ ఫరూక్ రూజ్ నడుపుతున్నాడు.1951లో ఇరాన్ నుండి వలస వచ్చిన రూజ్ తాత  గ్రాండ్ హోటల్‌‌ కొన్నాడు. ఒకప్పుడు ఈ కేఫ్​లో ప్రతిరోజూ 8,000–9,000 కప్పుల చాయ్‌‌ అమ్మేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఆ సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. 

రోడ్ల విస్తరణ 

హైదరాబాద్​ రోజురోజుకూ డెవలప్​ అవుతూనే ఉంది. అందుకు అనుగుణంగా మార్పులు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా.. రోడ్ల విస్తరణ కూడా జరిగింది. దానివల్ల చాలా వరకు షాపులు కూల్చివేయాల్సి వచ్చింది. వాటిల్లో ఇరానీ కేఫ్​లు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే.. ఇరానీ కేఫ్​లు ఎక్కువగా రోడ్ల మూలమలుపుల్లోనే ఉంటాయి. అలాంటి చాలా కేఫ్​లు​ రోడ్ల విస్తరణలో కోల్పోవాల్సి వచ్చింది. 

రియల్ ఎస్టేట్

హైదరాబాద్​లో 1990ల తర్వాత ఆర్థిక మార్పులు అనేకం జరిగాయి. భారతదేశ ఐటీ ఇండస్ట్రీలో సిటీ ప్రధాన పాత్ర పోషించింది. అనేక ఐటీ కంపెనీలు వెలిశాయి. దాంతో గ్లోబల్ ఫాస్ట్-ఫుడ్ చెయిన్స్​  కూడా హైదరాబాద్​లో మకాం వేశాయి. సంప్రదాయ ఇరానీ కేఫ్‌‌లకు  కస్టమర్లు దూరం అయ్యారు. ఆ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు సిటీలోనే ఇళ్లు కొనడం, రెంట్​కి ఉండడం వల్ల రియల్​ఎస్టేట్​కి కూడా డిమాండ్​ పెరుగుతూ వచ్చింది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దుకాణాలు, హోటల్స్​ లాంటి వాటి అద్దెలు పెరిగాయి. దాంతో.. కేవలం టీ, శ్నాక్స్​ అమ్మే ఇరానీ కేఫ్​లకు రెంట్​ భారం పెరిగింది. సొంత స్థలాలు కొనడం కూడా సాధ్యమయ్యే పని కాదు. దాంతో.. అద్దెలు కట్టలేక చాలామంది కేఫ్​లు మూసేశారు. 

కొందరేమో వాటిని టిఫిన్​ సెంటర్లు, హోటల్స్​గా మార్చేశారు. మరికొన్నింటిని ఈటింగ్ జాయింట్లు తీసుకున్నాయి. సికింద్రాబాద్‌‌లోని ‘కేఫ్ రియో’ ​​ఇప్పుడు టిఫిన్ సెంటర్‌‌గా మారింది. బంజారాహిల్స్‌‌లోని ‘మెట్రోపాలిటన్ కేఫ్’​ని పూర్తిగా మూసేశారు. 

అభిరుచులు మారాయి

ఇరానీ కేఫ్​లు ఎదుర్కొంటున్న మరో సవాలు.. ఇరాన్ కుటుంబాల్లోని యువతరం ఈ బిజినెస్​లోకి రావడానికి ఆసక్తి చూపించకపోవడం. ఇప్పుడు చాలామంది కేఫ్​ నిర్వాహకుల పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేయడానికే ఇష్టపడుతున్నారు. లేదంటే.. విదేశాలకు వలస పోతున్నారు. ఇది కూడా కేఫ్​లు మూతపడడానికి ఒక కారణంగా ఉంటోంది. కొందరు మాత్రమే తాతల నాటి నుంచి వస్తున్న బిజినెస్​ చేస్తున్నారు. సయ్యద్ మహమ్మద్ రజాక్ తాత టెహ్రాన్ నుండి వలస వచ్చి1970ల్లో ‘సిటీ లైట్’ హోటల్‌‌ పెట్టాడు. రజాక్ ఇప్పుడు హైదరాబాద్‌‌లోని ‘రెడ్ రోజ్’ రెస్టారెంట్‌‌ను నడుపుతున్నాడు. ఆయన వృత్తిరీత్యా ఇంజనీర్, గ్రాఫిక్ డిజైనర్. అయినా.. ఈ బిజినెస్​లోనే ఉంటూ.. తన స్కిల్స్​ని బిజినెస్​ డెవలప్​ చేయడానికి వాడుతున్నాడు. 

నోట్లో బ్రష్ వేసుకుని కేఫ్​కు.. 

మా కుటుంబం ఇరాన్​ నుంచి వలస వచ్చింది. మూడు తరాల నుంచి ఇరానీ చాయ్​ బిజినెస్​లోనే ఉన్నాం. మాది మూడో తరం. నాలుగో తరం వాళ్లు ఈ వ్యాపారం చేసేందుకు సిద్ధంగా లేరు. వారు వేరే వృత్తుల్లో సెటిలయ్యారు. మా కండ్ల ముందే ఎన్నో ఇరానీ కేఫ్​లు వెలిశాయి. మూత పడ్డాయి. నేను కూడా రెండు, మూడు చోట్ల కేఫ్​లు పెట్టి క్లోజ్​ చేయాల్సివచ్చింది. ఎందుకంటే ఈ కేఫ్​లు సెంటర్లలో ఉండాలి. విశాలంగా ఉండాలి. గతంలో రెంట్లు తక్కువగా ఉండేవి. ఇప్పుడు సెంటర్లలో రెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. 

ప్రస్తుతం వస్తున్న ఆదాయంతో రెంట్లు కట్టాలంటే కష్టం అవుతుంది. గతంలో ‘బ్లూసీ హోటల్​’లో దాదాపు 2 వేల కప్పుల టీ అమ్మేవాళ్లం. ఆ  రోజుల్లో నోట్లో బ్రష్​ వేసుకుని నేరుగా కేఫ్​కే వచ్చేవాళ్లు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రకరకాల ఫ్లేవర్డ్​ టీలు దొరుకుతున్నాయి. దీంతో ఇరానీ చాయ్​ల అమ్మకం 2 వేల నుంచి 12 వందలకు తగ్గింది. ముందు ముందు ఇంకా తగ్గినా ఆశ్చర్య పోనక్కర్లేదు. 

- అలీ అజ్గర్​ అఖ్తారీ, మేనేజర్​, బ్లూసీ హోటల్​, సికింద్రాబాద్

పర్ఫెక్ట్ ఇరానీ చాయ్​ ఇలా... 

సాధారణ టీ తయారీకి, ఇరానీ టీ తయారీకి మధ్య మస్త్​ ఫరక్​ ఉంటది. ఫర్ఫెక్ట్​ ఇరానీ చాయ్​ తయారు చేయడానికి మందంగా ఉన్న రాగి, లేదా ఇత్తడి గిన్నె తీసుకోవాలి. అందులో నీళ్లు  పోసి కొద్దిసేపు వేడి చేయాలి. ఆ తరువాత అస్సాం  తేయాకుతో చేసిన ఇరానీ టీపొడి, చక్కెర వేసి 40 నిమిషాలు మరిగించాలి. డికాక్షన్​ ఆవిరి బయటకు పోకుండా పైన గట్టి మూత పెట్టాలి. మూతకు, గిన్నెకు మధ్య గోధుమ పిండి ముద్ద పెట్టి క్లోజ్​ చేయాలి. మరో గిన్నెలో పాలు వేడి చేయాలి. మీగడ అంచులకు అంటుకోకుండా మధ్య మధ్యలో పాలను కలుపుతుండాలి. అలా పాలు సగం అయ్యేవరకు మరిగించాలి. ఒక కప్పులో సగం డికాక్షన్, మరో సగం పాలు కలిపితే... ఇరానీ చాయ్​ రెడీ.

– ఇరానీ చాయ్​ చెఫ్​, బ్లూసీ హోటల్, సికింద్రాబాద్

లైఫ్​ స్టయిల్​ మారుతోంది...

నేను హిమాయత్​నగర్​లో ఉంటా. అక్కడ ఎన్నో కేఫ్​లు మూతపడ్డాయి. ఒకప్పుడు పొద్దున లేవగానే కూలీలు, ఆటో డ్రైవర్లు ఇలా అందరికీ... ఇరానీ కేఫ్​ అడ్డాగా ఉండేది. రాను రాను జనాల లైఫ్​ స్టయిల్​ కూడా మారుతోంది. ఒక్కప్పటి కంటే... ఇప్పుడు లైఫ్​ బిజీగా ఉంటోంది. అలాగే ఈ హోటళ్లు ప్రధాన కూడళ్లలో కార్నర్​లో విశాలంగా ఉండేవి. బెంచీల మీద కూర్చొని గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకునేవాళ్లు.  ప్రస్తుతం ఉన్న కొన్ని ఇరానీ హోటళ్లు కూడా ఇరుకుగా మారాయి. 

ఈ హోటళ్లు కార్నర్​లలో ఉండటం వల్ల ప్రస్తుతం ఆ ప్లేస్​లకు రెంట్లు పెరిగాయి. ఆ ప్లేసుల్లో వేరే బిజినెస్​లు పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది. దాంతో రెంట్లు పెంచేస్తున్నారు. సొంత భవనాలు ఉన్న కొందరు మాత్రమే ఇప్పటికీ వాటిని నడిపిస్తున్నారు. మొత్తంగా మూతపడుతున్నాయి అనిచెప్పలేం. ఎందుకంటే నీలోఫర్​ కేఫ్​ బ్రాంచెస్​ పెరుగుతున్నాయి. దాన్ని పాజిటివ్​గా చూడాలి. 

– మహమ్మద్​ షఫీ ఉల్లా, చరిత్రకారుడు

ఏక్ పౌనా, దో బిస్కెట్​

రైటర్​ డోరీన్ హసన్ తన పుస్తకం ‘‘శాఫ్రాన్​ అండ్​ పెరల్స్​”లో కూడా ఇరానీ కేఫ్​ల గురించి రాశాడు. అప్పట్లో ఇరానీ కేఫ్​ల్లో ఒక యునిక్​ స్టయిల్​ ఉండేది. కేఫ్‌‌ల్లో బిల్లు వేసేవాళ్లు కాదు. లోపలికి వచ్చిన కస్టమర్ ‘ఏక్ పౌనా, దో బిస్కెట్’ అని చెప్పగానే వెయిటర్ అతని ముందు ఒక కప్పు టీ, రెండు బిస్కెట్లు పెట్టేవాడు. కేఫ్​ యజమాని డోర్​ దగ్గర టేబుల్​ వేసుకుని కూర్చునేవాడు. టీ తాగి, బిస్కెట్లు తిన్నాక కస్టమర్​ ఆ డోర్​ గుండానే బయటికి వెళ్లాలి. అలా వెళ్లేటప్పుడు సర్వర్​ ‘ఏక్​ పౌనా, దో బిస్కెట్​​’ అని అరుస్తాడు. అప్పుడు యజమాని అతని దగ్గరనుంచి డబ్బు తీసుకునేవాడు. 

బిల్లులకు బదులు అంతా సర్వర్​ మెమరీలోనే స్టోర్ అయ్యేది. ఎంతమంది కస్టమర్లు వచ్చినా.. టీ తాగి గంట సేపు కేఫ్​లోనే కూర్చున్నా వెళ్లేటప్పుడు సరిగ్గా అతను ఏం తాగాడు? ఏం తిన్నాడు? అనేది ఓనర్​కి చెప్పేవాళ్లు సర్వర్లు. ఇలాంటి ఎన్నో విషయాలను హసన్ తన పుస్తకంలో రాశాడు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేఫ్‌‌ల్లో  బిల్లులు ఇస్తున్నారు. టీ కప్పులను ‘ఏక్ పౌనా’ అని పిలవడం లేదు.  ‘పౌనా’ అనే పదం ‘పావు’ నుంచి వచ్చింది. అంటే కప్పులో మూడు భాగాలు చాయ్​ ఉండి ఒక భాగం ఖాళీగా ఉంటే దాన్ని ‘పౌనా’ అనేవాళ్లు. 

-  దర్వాజ, వెలుగు నెట్ వర్క్