ఏ దేవుళ్లకు లేని ప్రత్యేకత రాములోరి కళ్యాణానికి ఎందుకో తెలుసా..

హిందూ ధర్మంలో ఇతర దేవుళ్ల కళ్యాణానికి దక్కని వైభవం, విశిష్టత కేవలం శ్రీ సీతారాములోరి కళ్యాణానికి  మాత్రమే దక్కిందని పండితులు చెబుతారు. ఈ జంటకు మాత్రమే అలాంటి ఘనత ఎందుకు దక్కిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూ పురాణాల ప్రకారం శివ పార్వతుల కళ్యాణం, శ్రీహరి లక్ష్మీదేవి, బ్రహ్మ సరస్వతి ఇలా ఎందరో దేవుళ్ల కళ్యాణం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ దేవుళ్లందరిలో శ్రీ సీతారాములోరి కళ్యాణం చాలా ప్రత్యేకమైంది.  ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాములోరి కళ్యాణం దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం రామయ్య గుడిలో, కడపలోని ఒంటిమిట్ట రామాలయంలో ప్రముఖంగా ఈ కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది (2024)  ఏప్రిల్​17వ తేదీన శ్రీ సీతారాములోరి కళ్యాణోత్సవం జరగనుంది. ఈ ఉత్సవాలకు సంబంధించి  దాదాపు అన్ని దేవాలయాల్లో  ఏర్పాట్లూ పూర్తి చేశారు.

ఆగమ శాస్త్రం ప్రకారం... శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. అయితే గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే.. ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం వేళ శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీ సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు. ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో వివరించబడింది.

 శ్రీరామ చంద్రుడు, జానకి దేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు. వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు. అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగ శాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదమే సీతమ్మ తల్లి.  చైత్రమాసం శుద్ద నవమి రోజున లోక కళ్యాణం  అని  సంకల్పంలో పండితులు చదువుతుంటారు.  అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు.  తలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పాటను భజంత్రీలు పాడుతుంటారు.    శ్రీ సీతారామాభ్యాంనమ: అంటూ పూజలు కూడా చేస్తారు.

శ్రీరామ నవమి రోజున ‘రామ’ అనే నామాన్ని ఉచ్చరించడం వల్ల మన నోటి లోపల ఉండే పాపాలన్నీ తొలగిపోయి.. ఆ నామం యొక్క మంటల్లో అది దహించుకుని పోతుందని పండితులు చెబుతారు. .. రామ అనే రెండక్షరాల్లో ‘మ’ అనే అక్షరాన్ని పలికినప్పుడు మన పెదాలు మూసుకుంటాయి. ఈ లెక్కన బయట మనకు కనిపించే లోపాలు లోపలికి ప్రవేశించలేవు. అందుకే రామ భక్తులందరూ రాముడిని స్మరించుకుని సుఖసంతోషాలను పొందుతారు.

శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశ వ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు. దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.