బీజేపీ ఎందులో భిన్నమైంది.?

వరుసగా  రెండుసార్లు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీ మూడోసారి గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని చెప్పడానికి తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం. ‘పార్టీ విత్‌‌‌‌‌‌‌‌ ఎ డిఫరెన్స్‌‌‌‌‌‌‌‌’  అని ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే బీజేపీ ఇప్పుడు ‘పార్టీ ఫర్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ఓన్లీ’ అన్నట్టు మారిపోయింది. తెలంగాణలో పార్టీకి ఈ జాడ్యం 2019 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల తర్వాత మొదలయ్యింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత 2019 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో నాలుగు స్థానాలు గెలిచాక పార్టీలోకి జంపింగ్స్‌‌‌‌‌‌‌‌ ఊపందుకున్నాయి. హుజురాబాద్‌‌‌‌‌‌‌‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు బీజేపీకి ఎంత ఉత్సాహాన్నిచ్చాయో, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పార్టీకి అంత కీడు చేశాయి. ఈ మూడు ఉప ఎన్నికల్లోనూ ఇతర పార్టీల నుండి వచ్చిన వారే పోటీ చేశారు. 2019 నుంచి ఉన్న జోష్‌‌‌‌‌‌‌‌ మునుగోడు ఓటమితో 2022 చివరి నాటికి నీరుగారిపోయింది. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌‌‌‌‌‌‌‌ ఖాయమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి వంటి నేతలు ఎన్నికల ముందు పార్టీని వీడారు. మరికొందరు  నేతలు పార్టీకి బలం తగ్గుతుందని ముందే పసిగట్టి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు  యెన్నం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏనుగు రవీందర్​రెడ్డి, రేవూరి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. పార్టీలు మారిన వీరు మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారు కారు. గెలుపే లక్ష్యంగా బీజేపీ వీరందరినీ చేర్చుకుంటే ఎన్నికల నాటికి వీరు పార్టీని వీడారు. ఇతర రాజకీయ పార్టీలకు బీజేపీ భిన్నమైంది అని గతంలో వాజ్‌‌‌‌‌‌‌‌పేయి, అద్వానీ సారథ్యంలో పార్టీ కార్యకర్తలు కాస్త గర్వంగా చెప్పుకునేవారు. ఇతర పార్టీలలో ఉన్నట్టు అధికార వ్యామోహం, వ్యాపారదృక్పథం, అవినీతి బీజేపీకి అంటవని వారు హుందాగా ప్రచారం చేసుకునేవారు.  కొల్లిమర్ల వెంకటేశ్వర్లు, వి.రామారావు, జంగారెడ్డి, చలపతిరావు, శేషగిరిరావు, బద్దం బాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి వంటి నేతలు ఇతర వ్యామోహాలు లేకుండా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. ప్రస్తుతం పార్టీ ఈ లక్షణాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అధికారమే లక్ష్యంగా కొనసాగుతోంది. అందుకు మారిన కాలపరిస్థితులను ఆ పార్టీ ఫాలోకాక తప్పడంలేదనిపిస్తున్నది.  ప్రస్తుత  బీజేపీ నిజంగానే ఇతర పార్టీల కంటే భిన్నమైన దిశగానే సాగుతోందా అనే వ్యంగ్యాస్త్రాలు వినిపించడం సహజమే. 

బయటివాళ్లకే టికెట్లు

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేయగా అందులో 90 సీట్ల వరకూ ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే టికెట్లిచ్చినా లక్ష్యం నెరవేరలేదు. మొదటి నుండి సైద్ధాంతికంగా పార్టీని నమ్ముకున్న నేతలకు మొండిచేయి చూపారు. రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి వంటి నేతలు టికెట్‌‌‌‌‌‌‌‌ ఆశించి భంగపడి పార్టీని వదిలిపెట్టిన ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చామని పార్టీ సర్ధిచెప్పుకున్నా 8 సీట్లే సాధించడం వారి వ్యూహాత్మక తప్పిదాలను తెలియజేస్తున్నాయి. ఇప్పుడు రాబోయే లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించామంటూ ఆ పార్టీ భుజాలు ఎగరేస్తున్నా అసమ్మతి రాగాలు కూడా ఆ స్థాయిలోనే వినిపిస్తున్నాయి. పార్టీలో చేరి ఇరవై నాలుగు గంటలు కాకముందే నాగరకర్నూలు, జహీరాబాద్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నుండి వచ్చిన భరత్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ (సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎంపీ రాములు తనయుడు), బీబీ పాటిల్‌‌‌‌‌‌‌‌ (సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎంపీ)కు బీజేపీ టికెట్లు ఇవ్వడాన్ని పార్టీని నమ్ముకున్న వారు ఎండగడుతున్నారు.  బంగారు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ వంటి నేతలు జైలుపాలయినా  జీవితాంతం పార్టీలోనే ఉన్నారు. ఆయన వారసురాలు బంగారు శృతి కూడా తండ్రి వలే పార్టీనే నమ్ముకొని ఉంటే నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూలు టికెట్‌‌‌‌‌‌‌‌ దక్కలేకపోయింది. నల్గొండ టికెట్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఇవ్వడంతో స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నారు. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ ప్రజాసంగ్రామ యాత్ర నల్గొండలో సాగినప్పుడు యాత్రపై దాడి చేయించిన సైదిరెడ్డి బీజేపీ కార్యకర్తలపై, నాయకులపై పలు కేసులు పెట్టించగా, వారు ఆ కేసులతో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ  రెండు జాబితాలలో 15 మంది అభ్యర్థులను ప్రకటించగా ఇతర పార్టీల నుండి వచ్చిన వారు ఐదుగురు ఉన్నారు. సీతారాం నాయక్‌‌‌‌‌‌‌‌, నగేశ్‌‌‌‌‌‌‌‌, సైదిరెడ్డి,  బీబీ పాటిల్‌‌‌‌‌‌‌‌, భరత్‌‌‌‌‌‌‌‌ప్రసాద్‌‌‌‌‌‌‌‌ టికెట్లు పొందారు.  ప్రస్తుత పార్టీ వ్యవహారం చూస్తుంటే ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఆటగాళ్లను కొన్నట్టే వీరు కూడా వలసలను ప్రోత్సహిస్తున్నారు. చివరకు వీరందరూ 40 రోజుల ఆటగాళ్ల వలె మిగిలిపోయి అవకాశం తీరాక మళ్లీ ఎవరిదారి వారు చూసుకున్నా ఆశ్చర్యం లేదు.

గతంలో వచ్చినవాళ్లే పోయారు

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం బీజేపీకి పరిపాటిగా మారింది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ముద్రగడ పద్మనాభం, పార్టీ రాష్ట్ర సారథిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడారు. పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో  అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన పలువురు ప్రముఖ నేతలు ఓటమి తర్వాత పార్టీని వీడారు. ఈ ఉదంతాలతో పాటు తెలంగాణలో ఎదురైన అనుభవాలతో గుణపాఠంగా నేర్చుకోకుండా లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ తిరిగి అవే పొరపాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచే అవకాశాలున్నాయనే ప్రచార నేపథ్యంలో ఇతర పార్టీల నేతలు బీజేపీపై కన్నేయగా, పార్టీ కార్యాలయం చిరునామా తెలియని వారికి కూడా బీజేపీ టికెట్లిస్తోంది.

ప్యారాచూట్లనే నమ్ముకున్నారు

‘పన్నా ప్రముఖ్‌‌‌‌‌‌‌‌’ (ఓటర్ల జాబితా ఇన్చార్జీ), ‘శక్తి కేంద్రాలు’ (పోలింగ్‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌ల ఇన్చార్జీలు) అంటూ  క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, నేతలకు దిశానిర్ధేశం చేసే బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపికల్లో మాత్రం వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. పార్టీ సిద్ధాంతాలతో పని లేకుండా ప్యారాచూట్లనే నమ్ముకోవడంతో పార్టీ కార్యకర్తలు, ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేయగలరా? దీంతో అధినాయకత్వం ఇప్పటికీ  ‘బీజేపీ భిన్నమైన పార్టీ’ అని నిఖార్సుగా గర్వంతో చెప్పుకోగలదా? లేదా మాది కూడా ఒక ‘ఫక్తు అవకాశవాద రాజకీయ పార్టీయే’ అని నిరూపిస్తుందా? అని ఆ పార్టీని నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు  లోలోన మదనపడుతున్నారనే చెప్పాలి.

నిరాశలో కేడర్​

భారతీయ జనతా పార్టీ పేరు చెబితేనే గుర్తుకొచ్చేది ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో పాటు దాని అనుబంధ సంస్థలు. బీజేపీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లో ఎక్కువగా సంఘ్​ ప్రచారక్‌‌‌‌‌‌‌‌లు, అభిమానులే ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆదర్శాలు, క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయత, లాభాపేక్ష లేకుండా కష్టపడటం వంటి సిద్ధాంతాలతో కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకించే ఇస్లామిక్‌‌‌‌‌‌‌‌ ఉగ్రవాదులు, నక్సలైట్ల చేతుల్లో అనేక మంది కార్యకర్తలు బలయ్యారు. అందుకే గతంలో బీజేపీని ‘పార్టీ విత్‌‌‌‌‌‌‌‌ డిఫరెన్స్‌‌‌‌‌‌‌‌’ అనేవారు. సైద్ధాంతానికి కట్టుబడి  క్షేత్రస్థాయిలో అనేక మంది నేతలు, కార్యకర్తలు బీజేపీ కోసం పాటుపడుతుంటే  పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మాత్రం వీరి మనోభావాలను గౌరవించకుండా నిర్ణయాలు తీసుకుంటుండడంతో బీజేపీ  నియంతృత్వ పోకడల్లో ఇతర పార్టీలను మించిపోతోంది. 

- ఐ.వి.మురళీకృష్ణ శర్మ, రీసెర్చర్​, పీపుల్స్​ పల్స్​ రీసెర్చ్​ సంస్థ