కలలెందుకు మర్చిపోతామో తెలుసా.?

ఉన్నట్టుండి.. ఒక్కసారిగా నిద్రలోంచి ఉలికిపడి లేస్తారు. ఏదో జరిగిపోయినట్టు గాభరాపడతారు. ఎవరో తరుముకొస్తున్నట్లు  భయపడతారు. పక్కన మనుషులు ఉన్నా.. తెలియని ఆందోళనతో కంగారు పడిపోతుంటారు. అదంతా..నిద్రలో పడ్డ కల ఎఫెక్ట్స్. ఆవిషయం వారికి కూడా కొద్దిసేపటి తర్వాత అంది. ఏం జరిగింది? అని అడిగితే... మాత్రం చెప్పరు. 'ఏమో.. ఏదో కలొచ్చింది.. కానీ.. ఏం గుర్తులేదు' అంటుంటారు.  అంతగా  కలవరపెట్టిన కలలు ఎందుకు మర్చిపోతారు? అజ్ డిస్కస్.


రోజంతా పనిచేసి అలిసిపోయి హాయిగా పడుకున్నాడు రవి.  కొత్తగా కొన్న కూలర్ నుంచి వస్తున్న చల్లటిగాలికి  ఇలా పడుకోగానే... అలా నిద్రపట్టేసింది. కొద్ది సేపటికే దివ్య గట్టిగా అరుస్తోంది. ఉలిక్కిపడి లేచాడు రవి. చూస్తే. దివ్య నిద్రలోనే అరుస్తోంది. ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. దివ్యను నిద్రలోంచి లేపి నీళ్లు తాగించి 'ఏమైంది..' అని అడిగాడు రవి. దివ్యకు మాత్రం ఏం గుర్తులేదు. తిరిగి రవివే.. 'ఏమైంది.. నన్నెందుకు నిద్రలేపారసలు' అని ప్రశ్నించింది. 'నువ్వు గట్టిగా అరిచావ్.. ఏదో కలవరిస్తున్నావ్.. నిద్రలో ఏదైనా కలొచ్చిందేమో అని నేనే లేపా' అని చెప్పాడు రవి. 'కలా... ఏమో.... నాకు గుర్తు లేదు' అనుకుంటూ మళ్లీ నిద్రకు ఉపక్రమించింది దివ్య, ఆశ్చర్యపోవడం రవి వంతయింది. ఇలాంటి సంఘటనలు చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. పక్కన పడుకున్న వాళ్లు నిద్రలో ఏదో అంటూ ఉలిక్కిపడుతారు. కలవరిస్తారు. నిద్రలోంచి లేపి.. ఏమైందని అడిగితే మాత్రం ఏ జరుగనట్టు, ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తారు. అసలు వాళ్లకు ఆ కల గుర్తుండదు. అది వాళ్ల తప్పు కాదు. మెదడు ఆ కలను గుర్తు పెట్టుకోలేదన్నమాట. హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన రీసెర్చ్ అసలు కలలెందుకు మర్చిపోతామన్న అంశం మీద ఆసక్తికర విషయాలు తెలిశాయి.

నిపుణులు చెప్తున్న అభిప్రాయం ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారి ఆలోచనా విధానాన్ని బట్టి కలలు వస్తాయట. కొన్ని కలలు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలు, పరిస్థితులను ముందే హెచ్చరిస్తాయట. మరికొన్ని కలలేమో మన ఆందోళన, భయం నిజమైతే ఎలా ఉంటుందో అదే కల రూపంలో వచ్చి భయపెడతాయట. అందుకే.. అలాంటి కలలు చాలావరకు గుర్తుండవు అంటున్నారు. కొన్నిసార్లు ఎప్పుడు వచ్చిన కలలు కూడా చాలాకాలం వరకు గుర్తుండిపోతాయి. కొన్ని కలలు మాత్రం నిద్రలోంచి లేచిన మరుక్షణమే మరిచిపోతాం. అలాంటి కలలే మన జీవితంలో నిజమవుతాయట. ఆ కలలు నిజమైన సందర్భంలో ఆ ఘటన అంతకు ముందే ఎవరికో జరిగినట్టు, ఎక్కడో చూసినట్టు చూచాయగా గుర్తొస్తుంది కానీ.. మనకే కల వచ్చిన సంగతి మాత్రం అస్సలు గుర్తు రాదట. దీనికి కారణం.. మన మెదడు అడ్వాన్స్ గా రాబోయే కాలంలో ఏం జరగబోతుందో కచ్చితంగా ఊహించలేదు. ఒకవేళ ఊహించినా దాన్ని గుర్తు పెట్టుకోలేదు. సైన్స్, టెక్నాలజీ విషయంలో ఇది వర్తించదు. మనం ఆలోచించే విషయాలు, మన జీవితం గురించిన అంశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధ్యయనంలో తేలింది.

ఎందుకు గుర్తుండవు?

కలలు గుర్తుండకపోవడమనేది పెద్ద రహస్యమేమీ కాదు. అదొక మానసిక అచేతన స్థితి. దీన్ని అటోనియా అంటారు. నిద్ర అనేది మనం భావించే దానికన్నా క్లిష్టమైనది. శరీరాన్ని సుప్తచేతనావస్థలోకి చేర్చడం. మెదడును మెలకువగా ఉంచి... శరీరాన్ని నిద్రకు, మెలకువకు ఊగిసలాడించే ఒక ప్రక్రియ. దీన్ని సైన్స్ పరిభాషలో రెమ్ (రాపిడ్ ఐ మూమెంట్) అంటారు. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మెలకువగా ఉన్నట్టే ఉంటుంది. కళ్లు వేగంగా కదులుతాయి. రక్తప్రసరణలో, శ్వాస ప్రక్రియలో గణనీయమైన మార్పులుంటాయి. ఈ సమయంలో తరచుగా మన జీవితంలో జరిగే పరిణామాలను కలల రూపంలో మనం మేల్కొనే సమయం వరకు అంగీకరిస్తాం. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన మరుక్షణమే శరీరం యాక్టివ్ అవుతుంది. అందుకే ఆ కల ఏమాత్రం గుర్తుండదు. ఆ కలలో వచ్చేదృశ్యాలు, మనుషులు ఏవీ స్పష్టంగా ఉండవు.అందుకే మెదడు వాటిని గుర్తు పెట్టుకోలేదు.

 కారణమేంటి?

ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా గుర్తు పెట్టుకునేందుకు మెదడులో ఒక కీలకమైన రసాయనం పనిచేస్తూ ఉంటుంది. అది కలల విషయంలో కూడా వర్తిస్తుంది. ఆ రసాయనమే నోరాడ్రినలిన్. శరీరాన్ని, మెదడును క్రియాశీలం చేస్తూ, యాక్టివ్గా ఉంచే హార్మోన్ ఇది. గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే కలలు గుర్తుండవు. నిద్రలోకి జారుకునే మొదటి పది, పదిహేను నిమిషాలు ఏం జరుగుతున్నదో ఏం గుర్తుండదు. కొన్ని భయపెట్టే కలలు ఈ సమయంలోనే వస్తాయి. లేవీ లేవగానే రోజూ వారీ పనుల్లో నిమగ్నమైతే ఆ కలల తాలూకు జ్ఞాపకాలేవీ గుర్తుండవు. ఒకవేళ కల గుర్తుండాలంటే...నిద్రలోంచి లేచిన తర్వాత వెంటనే కదలకుండా అలాగే ఉండే  ప్రయత్నం చేయండి. కళ్లు కూడా తెరవొద్దు. 

ఇప్పుడు మెల్లగా కళ్లలో ఏముందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. కల తాలూకు ఆనవాళ్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక్క కూ దొరికితే చాలు.. కల మొత్తం గుర్తు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ ట్రిక్ మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అంతేకాదు... రెమ్ (ర్యాపిడ్ ఐ మూమెంట్)ని డిస్టర్బ్ చేయడానికి పడుకునే ముందు రెండు, మూడు గ్లాసుల నీళ్లు తాగండి. దీని వల్ల రెమ్ తీవ్ర స్థాయికి చేరుకునే సమయానికి మెలకువ వస్తుంది. దీంతో కలల ప్రవాహానికి, రెమ్ అత్యున్నత దశకు అడ్డుకట్ట వేయొచ్చు, లేదంటే...కలలు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలనుకుంటే.. పడుకునే ముందు.. నాకు వచ్చే కల కచ్చితంగా నేను గుర్తుంచుకోవాలి అని మనసులో బలంగా అనుకోండి. మెదడులో రిజిష్టర్ అయ్యేలా పడే పదే తలుచుకోండి. అప్పుడు ఈజీగా మీకు వచ్చిన కల గుర్తుంటుంది.