కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం

సాయంత్రం 7 అయ్యింది. ఇంకా సంధ్య అమీర్​పేట్ నుండి రాలేదు. అప్పటికి ఎన్నిసార్లు గోడ మీద ఉన్న గడియారం వైపు చూసిందో దమయంతికే తెలియదు. ఆ రోజు శనివారం కావటం వల్ల భర్తకి చపాతీలు, పిల్లలకి పూరీలు. పూరీల్లోకి పన్నీరు కూర చేస్తూ... మరో పక్క కూతురు ఇంటికి రాలేదని ఆలోచిస్తూ గడియారం వైపు చూస్తోంది. ‘‘ప్రవచనాలు విని ఆఫీస్ నుండి లేటుగా వస్తాన’’ని చెప్పాడు దమయంతి భర్త మోహన్​.

రామాయణంలో సీతారాముల వైవాహిక జీవితం గురించి చాగంటి గారు వారం రోజులుగా ఎల్బీనగర్​లోని శివాలయంలో ప్రవచనాలు చెప్తుంటే... అవి వినేందుకు వెళ్తున్నాడు అతను. మోహన్ ఇన్సూరెన్సు కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్​గా పనిచేస్తున్నాడు. ఆలస్యంగా వస్తానని చెప్పాడని సంతోషించాలో, కూతురు ఇంటికి రాలేదని కంగారు  పడాలో అర్థంకాలేదు దమయంతికి. 

రోజూ సాయంత్రం ఆరుగంటల కల్లా ఇంటికి వచ్చేది. టీవీ చూడటంలో మునిగి పోయిన కొడుకు శ్రవణ్​ని పిలిస్తే పలకలేదు. దాంతో ‘‘అరేయ్ న్యూస్ ఛానెల్ పెట్టు” అని గట్టిగా అరిచింది దమయంతి. ఏ మూడ్​లో ఉన్నాడో న్యూస్ ఛానెల్ పెట్టాడు. సంధ్య తరువాత పుట్టాడు శ్రవణ్. ఇంజనీరింగ్​లో ఈ మధ్యే చేరాడు. టీవీ, ఫోన్ ఇవే వ్యాపకం. ఈ కాలం పిల్లలకి ఏం చెప్పేలా లేదు అనుకుంటున్న దమయంతి కళ్లకు ‘‘మెట్రో రైలులో సాంకేతిక లోపం.

ఆగిన రైలు. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు’’ అన్న స్క్రోలింగ్ కళ్ల పడింది. హమ్మయ్య సంధ్య ఎక్కిన ట్రైన్ ఆగిపోయి ఉంటుంది... అనుకుంటుండగానే సంధ్య నుండి ఫోన్ కాల్​ వచ్చింది. ‘‘ఏమ్మా సంధ్య! ఎక్కడ వున్నావ్” అనే తల్లి మాట పూర్తి కాకముందే ‘‘మెట్రో ట్రైన్ ట్రబుల్ ఇచ్చిందమ్మా.8 గంటల కల్లా ఇంటికి వస్తా. కంగారు పడకు’’ అనటంతో దమయంతి మనసు తేలికపడింది. 

మెట్రోలో వున్న సంధ్యకి... అమ్మ ఎక్కడ ఆదుర్దా పడుతుంటుందో అన్న ఆలోచన బాధపెడుతోంది. సంధ్య ఇంటికి వచ్చే సరికి రాత్రి 08 :30 అయ్యింది. వస్తూనే వంట గదిలోకి వెళ్లి తల్లిని ‘‘ఇంకా వంట గదిలోనే ఉన్నావా అమ్మా?  ఏదో  కొంచెం ఆలస్యం అయ్యింది. నేను వచ్చి సాయం చేస్తానని చెప్పా కదా! టిఫిన్​లు వండేందుకు అంత తొందర ఎందుకు? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం..

20 ఏండ్లుగా అనారోగ్యంతో ఉన్నావ్. చెప్తే వినవు. నాన్నేమో తొందరగా ఇంటికి రాడు. ప్రవచనాలు, బాతాఖానీలు చేస్తుంటాడు. నేను డైనింగ్ హాల్​లో అన్నీ సర్దుతా. నేను స్నానం చేసి వచ్చాక అందరం కలిసి తిందాం” అని పూరీలు, మంచి నీళ్లు టేబుల్​ మీద సర్ది స్నానానికి వెళ్ళింది సంధ్య. 

సంధ్య బయటకు రాగానే బాల్కనీలో ఉన్న తల్లిని చూసింది. ‘‘అమ్మా.. ” అని ఎంత పిలిచినా రాకపోయేసరికి. బాల్కనీలో చూసింది సంధ్య. ‘‘ఎవరి కోసం ఎదురు చూస్తున్నావమ్మా” అని అడిగింది. ‘‘నాన్న10 నిమిషాల్లో వస్తా అన్నాడు. ఆయన వచ్చాక తిందామని. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు. డాక్టర్ ఏం చెప్పారు? తొందరగా తిని, మాత్రలు వేసుకుని పడుకోమన్నారు కదా. ఆ మాటలు వినవెందుకు?

నువ్వు తినకపోతే నేను కూడా తినను’’ అని మొండికేసింది సంధ్య. దాంతో దమయంతికి కూతురుతో తినక తప్పలేదు. ముగ్గురు తిన్నాక సంధ్య ‘‘నువ్వు పడుకోమ్మా. నాన్న వస్తే నేను పెడతాలే” అని సంధ్య చెప్పటంతో దమయంతి రూమ్​లోకి వెళ్లి పడుకుంది. 

మరుసటి రోజు ఆదివారం కాబట్టి లేట్​గా లేవచ్చు అనే ఆలోచనలో, ప్రవచనాలు అయిపోయాక రాత్రి11 గంటలకు ఇంటికి చేరుకున్నాడు మోహన్. సంధ్య చదువుకోవడం చూసి, డైనింగ్ హాల్ వైపు వెళ్ళాడు. వెనకనే సంధ్య వచ్చి తండ్రికి టిఫిన్ పెట్టి తను కూడా బెడ్​రూమ్​కి వెళ్లి పడుకుంది. 
ఉదయం ఎప్పుడు లేచిందో తెలియదు. ఇల్లంతా శుభ్రం చేసి, 8 గంటల కల్లా టిఫిన్ రెడీ చేసింది దమయంతి. తొమ్మిది గంటలకు లేచిన మధు, లేస్తూనే దమయంతితో ఏదో మాట్లాడాలని పిలిచాడు.

‘‘నిన్న ప్రవచనాలు వింటుంటే వెనకనుంచి తెలిసిన గొంతు వినిపించింది. చూస్తే నా చిన్న నాటి స్నేహితుడు గోపి కనిపించాడు దమయంతీ... ట్రాన్స్​ఫర్ మీద హైదరాబాద్ వచ్చాడట. ఎల్బీనగర్​లో ఉంటున్నాడు. వాడికీ మనలాగే ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు అమెరికాలో ఎమ్మెస్​ చేసి అక్కడే స్థిరపడ్డాడట. మన సంధ్యకి ఈడు– జోడు. మన అమ్మాయికి కూడా అమెరికా వెళ్లాలని కోరిక ఉంది కదా. పెళ్లి చేసుకున్నాక అక్కడే ఎమ్మెస్​ చేస్తుంది. ఏమంటావ్?” అన్నాడు భార్యతో.

‘‘సంధ్యకి ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. నాకు తెలిసి అమెరికా వెళ్లాలన్న కోరిక కూడా లేదు. అయినా సంధ్యకి ఇప్పుడు 20  ఏళ్లు నిండాయంతే కదా! బీటెక్ ఇప్పుడే  అయ్యింది. అప్పుడే పెళ్లి ఎందుకు?’’ అని దమయంతి చెప్పినా వినకుండా మోహన్ సంధ్యని బలవంతంగా ఒప్పించాడు.

‘‘అమ్మని నువ్వు ఆరోగ్యంగా చూసుకుంటా అంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటా” అంది  సంధ్య. ‘‘సరే తల్లీ” అన్నాడు. ఆ వెంటనే మగ పెళ్లి వాళ్లు రావటం. ఇద్దరూ ఇష్టపడడం. పెళ్లి జరగటం చకచకా రెండు నెలల్లో జరిగిపోయాయి. శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో సంధ్యని, అల్లుడు మధుని విమానం ఎక్కించి ఇంటికి వచ్చారు దమయంతి, మోహన్.

మూడేండ్లు గిర్రున తిరిగిపోతాయి. ఈ మూడేండ్లలో సంధ్య, మధు హైదరాబాద్​కి రానే లేదు. కరోనా మహమ్మారి వాళ్లని కట్టడి చేసింది. ఫోన్​లో మాట్లాడుకునేవాళ్లు. 
న్యూయార్క్​లో టైం రాత్రి12 గంటలు. కూతుర్ని పడుకో పెట్టి సంధ్య లాప్ టాప్ మూసింది. లైట్ ఆపేద్దామని వెళ్తుంటే సైలెంట్ మోడ్​​లో ఉన్న సెల్​ఫోన్​ లైట్​ వెలిగి ఆరుతూ కనిపించింది. దాంతో ఫోన్​ వైపు వెళ్లింది సంధ్య.

నాన్నదగ్గర నుండి ఫోన్​. ఈ టైంలో నాన్న ఫోన్​ ఎందుకు చేశారు? అనుకుంటూ కంగారుగా సెల్​ఫోన్​ చేతిలోకి తీసుకుంది సంధ్య. ‘‘హలో...’’ అనగానే  ‘‘అమ్మా సంధ్య...’’ అంటూ నాన్న గొంతులో కంగారు వినిపించింది.  ఏదో జరిగిందని సంధ్య మనసు కీడు శంకించింది. 

‘‘ఏమైంది నాన్నా”అని అడుగుతుంటే నాన్న చెప్పలేకపోతున్నారు. ‘‘అమ్మ... సంధ్య...  అమ్మ...  సంధ్య...’’ అంటున్నారే కానీ విషయం చెప్పటంలేదు. రెండు మూడు సార్లు అడిగితే ‘‘అమ్మ ఇంక లేదమ్మా’’ అని ఏడుస్తూ చెప్పాడు. 

సంధ్య గుండె పగిలిపోయింది. అదేంటి అమ్మ వయసు50 ఏండ్లే కదా! అప్పుడే ఏమైంది? నిన్ననే నాతో మాట్లాడింది. ‘ఆరోగ్యంగా ఉన్నా’ అంది. ఏమైంది అమ్మకి? నాన్న పెడుతున్న టెన్షన్ భరించలేక గుండె ఆగిందా? ఎన్నో ఆలోచనలు. ఏంచేయాలో అర్ధంకాక సంధ్యకి మైండ్ పనిచేయలేదు. మరో పక్క మధు ఇంట్లో లేడు. ఆఫీస్​ పని మీద టెక్సాస్ వెళ్లాడు. ‘‘ఇప్పుడేం చేయాలి?’’ అనుకుంటూ మధుకి ఫోన్ చేసింది. 

మధు ఫోన్ తీయగానే, ‘‘నాన్న ఫోన్ చేశాడు. అమ్మ గుండె పోటుతో చనిపోయిందట. మనల్ని రమ్మంటున్నాడు” అని చెప్పగానే మధుకి ఏమి అర్ధం కాలేదు. ‘‘కరోనా తగ్గి ఈ మధ్యనే కొంచెం సెటిలయ్యాం అనుకుంటుండగానే అత్త గారికి ఇలా అయిందేమిటి?’’ అనుకుంటూ ‘‘ఏమి చేద్దాం?’’ అని సంధ్యని అడిగాడు. 
‘‘ఏం చేద్దాం అంటావేంటి? మనం వెళ్ళాలి కదా” అంటుంది సంధ్య.

మధు టెక్సాస్ నుండి న్యూయార్క్ రావాలి. అందరూ కలిసి బయల్దేరాలి. అదీ కాక వీసా ప్రాసెసింగ్​ పని కూడా ఉంది. ఎంతలేదన్నా 48 గంటల్లోపు హైదరాబాద్ వెళ్ళటం సాధ్యం కాని పని. అదే విషయం నాన్నకి చెప్తే ఏం అనుకుంటాడో అని భయం. తమ్ముడు శ్రవణ్ ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. వాడికేమీ తెలియదు....

అని ఇలా ఆలోచిస్తుంటే హైదరాబాద్ వెళ్లేందుకు మధు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. దాంతో అందరి బట్టలు సర్దటం మొదలుపెట్టింది. మధ్య మధ్యలో తండ్రితో మాట్లాడుతూ.. మేము హైదరాబాద్ వచ్చే దాకా అమ్మ దహన సంస్కారాలు ఆపమని మాత్రం చెప్పగలిగింది.

దహన సంస్కారాలు ముగించిన పదిహేను రోజుల తర్వాత అందరూ తిరుగు పయనం అయ్యారు. తమ్ముడిని ప్రైవేట్​ హాస్టల్​లో చేర్చి, నాన్నని కూడా న్యూయార్క్​కి తీసుకెళ్లారు. అందరి పరిస్థితి ఒకేలా ఉండడంతో ఒకరిని మరొకరు చూసుకోవటంలోనే కొన్ని వారాలు గడిచిపోయాయి. తెల్లవారు జామున నాలుగన్నర అయ్యింది టైం. వంట గదిలో చప్పుడు వినిపిస్తుంటేసంధ్య వెళ్లి చూసింది. అక్కడ తండ్రి గిన్నెలు సర్దుతూ కనిపించాడు. ‘‘ఏంటి నాన్నా... ఇక్కడ ఇప్పుడేం చేస్తున్నావు?” అని అడిగింది సంధ్య.

‘‘ఏం లేదు తల్లీ ఇన్నాళ్లు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా” అన్నాడు. 

‘‘ఇలా అమ్మ బతికి ఉన్నప్పుడు చేయాల్సింది. ఎంతో సంతోషించేది. అమ్మకి సాయం చేసి ఉంటే ఆమె టెన్షన్ పడేదే కాదు. నువ్వు కొంచెం తోడుగా ఉన్నా.. అమ్మ ఇవ్వాళ బతికి ఉండేది. ఎప్పుడు చూసినా ఫోన్, పేపర్, స్నేహితులతో ముచ్చట్లు, గంటల తరబడి నడక. అమ్మకి ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందోనని లేని రోగాన్ని నెత్తిన వేసుకుని తప్పించుకునేవాడివి. వాకింగ్ చేసేవాడివి. ఉదయం పూట పనుల్లో అయినా ఆమెకి సాయం చేయలేకపోయావ్? మా చిన్నప్పుడు స్కూల్​కి వెళ్లే టైంలో కూడా సాయం చేయలేదు. అటు తాతయ్యని

ఇటు మమ్మల్ని, మరో వైపు వంట, ఇంటి పనులని బ్యాలెన్స్ చేయలేక అమ్మ చాలా టెన్షన్ పడింది. ఆ పనులన్నింటి మధ్యలో నువ్వు ‘కాఫీ ఇవ్వు. బాక్స్ సర్దావా? షూ తుడిచావా?’ అంటూ వేసే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యేది. ఆఖరికి నీ ఐడీ కార్డు కనపడకపోతే ఆ కంగారు కూడా అమ్మ మీదే రుద్దేవాడివి. నిన్ను ఎంత బతిమిలాడినా నీ పనులు నువ్వు చేసుకోలేదు. 

సాయంత్రాలు మాకు చదువైనా చెప్పేవాడివా? అది కూడా అమ్మే చూసుకోవాలి. ట్యూషన్​కి పంపాలంటే చాలా దూరం తీసుకెళ్లాలి, తీసుకు రావాలని మమ్మల్ని ఇంటి దగ్గరే కట్టి పడేసావ్. అసలు అంత దూరంలో ఇల్లు ఎందుకు కొన్నావ్? కనీసం మాకు మంచి నీళ్ల బాటిల్ పట్టి ఇవ్వలేదు. మేము స్కూల్​కి వెళ్తుంటే సందు చివరి వరకు అయినా వచ్చేవాడివి కాదు. అన్నీ అమ్మే చేసేది. 

ఉదయం నాలుగింటికి నిద్ర లేస్తే అప్పట్నించీ నువ్వు ఆఫీస్​కి వెళ్లేవరకు మరమనిషిలా పనిచేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉండేవాడివి. వంటగది వైపు చూసేవాడివే కాదు. అమ్మని ఎప్పుడైనా ‘మాత్రలు వేసుకున్నావా?’  అని అడిగావా? ప్రేమ పంచితే ఏమవుతుంది నాన్నా? చివరికి నా పెళ్లి విషయంలో కూడా అన్నీ అమ్మే చూసుకుంది. తను ఎంతో టెన్షన్​ పడి మమ్మల్ని తీర్చిదిద్ది చివరికి ఇలా అకాలంగా మరణించింది.  రోజులో ఒక అర గంట అయినా అమ్మకి సాయం చేసి ఉంటే.. అమ్మ ఇప్పుడు బతికి ఉండేది.

పనిమనిషిని లేదా వంటమనిషిని పెట్టుకోలేని స్థితిలో ఏమి లేవు. నీ చాదస్తం, పిచ్చితో అమ్మని ఇబ్బంది పెట్టావ్. పూర్వం అంటే సదుపాయాలు లేకపోవడం వల్ల మగవాళ్లు దూరాలు జర్నీ చేసి అలసిపోయి ఇంటికి వచ్చేవాళ్లు. దానివల్ల ఇంట్లో వున్న ఆడవాళ్లే ఇంటి పని మొత్తం చేయాల్సి వచ్చేది. అదీకాక అప్పట్లో టెన్షన్స్ తక్కువ. తినే తిండిలో కల్తీ లేదు. ఇప్పుడు అంతా కల్తీమయం. ఏ రోగం? ఎప్పుడు వస్తుందో? తెలియడం లేదు. అటువంటిది అనారోగ్యంతో ఉన్న అమ్మని ఎలా చూసుకోవాలి? నేను వద్దని ఎంత చెప్పినా వినకుండా.. తెలిసిన వాళ్లు, అమెరికా సంబంధం అని నన్ను కూడా అమ్మకి దూరం చేసావ్. ఇప్పుడు బాధపడి ఏం లాభం?
నాన్నా ఒక్క విషయం... అమ్మ కూడా ఒక తండ్రికి కూతురే కదా!

ఇప్పుడు నీ కూతురు కష్టపడుతోందని.. సాయం చేసేందుకు ట్రై చేస్తున్నావ్​. నేను చేసుకుంటా.. నువ్వెళ్లి పడుకో’’ అని సంధ్య ఇన్నేండ్లుగా మనసులో అదిమి పెట్టుకున్న బాధను తండ్రి ముందు వెళ్లగక్కి... భారంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎంతో ఎత్తుకు ఎదిగిన కూతుర్ని చూసి మురిసిపోవాలో లేక పోగొట్టుకున్న భార్యని తలుచుకుని బాధపడాలో అర్ధంకాక దిగాలుగా వెళ్లి పడుకున్నాడు మోహన్​. తండ్రీ కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ విననట్లు కూతురి పైన చెయ్యి వేసి పడుకున్నాడు మధు. ఎందుకంటే ఇప్పుడు మధు కూడా ఒక భర్తే కదా!

ఉదయం నాలుగింటికి నిద్ర లేస్తే అప్పట్నించీ నువ్వు ఆఫీస్​కి వెళ్లేవరకు మరమనిషిలా పనిచేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉండేవాడివి. వంటగది వైపు చూసేవాడివే కాదు. అమ్మని ఎప్పుడైనా ‘మాత్రలు వేసుకున్నావా?’  అని అడిగావా? ప్రేమ పంచితే ఏమవుతుంది నాన్నా? 

దొంతరాజు వెంకట చంద్రశేఖర్ 

ఫోన్ : 9490215211