Varalakshmi Vratam 2024:  శ్రావణంలోనే వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

 హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. అయితే ఈ మాసంలోనే ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు.. ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హిందూ మత విశ్వాసాల ప్రకారం, వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీ దేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహిత మహిళలు నిత్య సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వత్రం తప్పనిసరిగా ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం వేడుకలను జరుపుకోనున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారద లక్ష్మీదేవి అనుగ్రహం తమపై శాశ్వతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. 

సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, తమ కుటుంబం సంతోషం, శ్రేయస్సు కోసం, ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆచరిస్తారు.. ఈ సందర్భంగా ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. శ్రావణంలోనే ఈ వత్రాన్ని ఎందుకు ఆచరిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వరలక్ష్మీ దేవిని పూజిస్తే..

 శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం  ( ఆగస్టు 16) రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహిత స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు. కొత్త జంటలు సంతానం కోసం, తమ కుటుంబం, జీవిత భాగస్వామి, సంతోషం కోసం, ఆదాయం, ఐశ్వర్యం పెరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ దేవిని పూజిస్తే.. అష్ట లక్ష్ములను పూజించినట్టేనని నమ్ముతారు.

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు..

వరలక్ష్మీ వ్రతాన్ని దక్షిణ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతంలో ఈ వ్రతానికి పెద్దగా ఆదరణ లేదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు, తన ఆశీస్సులు పొందేందుకు వరలక్ష్మీ వ్రతం అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఈ వ్రతాన్ని చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని చాలా మంది నమ్మకం.

సుఖ, సంతోషాల కోసం..

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుందని, పేదలకు పుష్కలంగా ధన లాభం కలుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ వ్రతాన్ని కేవలం మహిళలే ఆచరించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. వరమహాలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.

కష్టాలన్నీ తొలగిపోతాయి..!

వరలక్ష్మీ వత్రం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, నిజమైన విశ్వాసంతో పూజించిన వారికి ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు తమ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖ సంతోషాలతో జీవిస్తారు. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు కొరత అనేదే ఉండదు.

పూజా విధానం..

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజా గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకుని, పూజా సామాగ్రి, తోరాలు, అక్షింతలు, పసుపు గణపతిని సిద్దం చేసుకుని ఉంచాలి. అనంతరం వరలక్ష్మీ వ్రతం కథను చదవాలి.