అయ్యప్ప దీక్ష... ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. శరణం.. శరణం అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢసంకల్పంతో చేసే దీక్ష అయ్యప్ప దీక్ష. అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలైకి 18 కొండలు, 18 మెట్లపై అధిష్టించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారి దీక్ష కార్తీక మాసంలో ప్రారంభమవుతుంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు నల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
అయ్యప్ప మాల ధరించిన వారు నల్లటి దుస్తులను ధరిస్తారు. సాధారణంగా మాలను చలికాలంలో ధరించడం వల్ల వేడిని గ్రహించి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా శబరిమల యాత్రకు అడవులలో ప్రయాణం చేయటం వల్ల అడవి జంతువుల నుంచి నలుపు రంగు మనకు రక్షణగా ఉండటం వల్ల మాలలను ధరించే వారు నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఈ విధంగా అయ్యప్ప మాల ధరించిన వారికి దేవుడి అనుగ్రహం కలగడమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించిన వాళ్ళకి శనిదేవుడు హాని కలిగించడు. అయ్యప్ప తన భక్తులను కాపాడటానికి నల్లని రంగు దుస్తులు ధరించమని చెప్పాడని, అందుకే అయ్పప్ప స్వాములు నల్లటి దుస్తులు ధరిస్తారని చెబుతుంటారు.
అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలంపాటు అంటే 41 రోజులు దీక్షతీసుకుని ఇరుమడి కట్టుకుంటారు. మాలధారణ చేసిన స్వాములు 41 రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో అయ్యప్పను పూజిస్తారు. భక్తులు అయ్యప్ప మాల ధరించి మకర సంక్రాంతి వరకు నియమనిష్టలతో కఠిన దీక్షలను చేస్తారు. సంక్రాంతి రోజు మకర జ్యోతిని దర్శించుకొని మాలను శబరి ఆలయంలో స్వామి సన్నిధిలో తొలగించి వస్తారు. కానీ ఈ మాలను ధరించినన్ని రోజులు ఎంతో నియమ నిష్టలతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.
ఇలా కఠిన నియమాలతో ఆచరించే అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడమే కాకుండా, ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తుంది. అయ్యప్ప మాల ధరించిన భక్తులు అందరూ వేకువజామున నిద్రలేచి చన్నీటి స్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజిస్తుంటారు. ఇలా చన్నీటితో స్నానం చేయడం వల్ల మనస్సు తేలికగా ఉండి భక్తి పై ఏకాగ్రత పెరుగుతుంది. అంతే కాకుండా ఎన్నో ఆలోచనలతో ఒత్తిడికి గురైన మన మెదడుని సైతం స్నానంతో చల్లబరుస్తుంది. దీక్షను ధరించిన వారు ప్రతిరోజు మితంగా ఆహారం తీసుకుంటారు. మాలలు ధరించిన వారు తినే ఆహారంలో మసాలా దినుసులు ఉపయోగించకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవు. అయ్యప్ప మాల ధరించిన అన్ని రోజులు చెప్పులు లేకుండా నడవడం ద్వారా పాదాలు ఒత్తిడికి గురై రక్తప్రసరణ, హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది.
దీక్షను చేపట్టి భక్తులు పట్టు పరుపుల పై కాకుండా, కటిక నేలపై నిద్రిస్తుంటారు. ఇలా కటిక నేలపై పడుకోవడం ద్వారా రక్త ప్రసరణ జరగడంతో పాటు మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే భూమిలో కలిగే శక్తి మార్పిడి వల్ల మన శరీరానికి శక్తిని కలిగిస్తుంది. మాల ధరించిన స్వాములు రెండు కనుబొమ్మల మధ్య చందనం తిలకంగా పెట్టు కుంటారు. ఇలా పెట్టుకోవడం ద్వారా ఇతరుల దృష్టి మన పై కేంద్రీకృతమవదు.
క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతం దేవతలు, రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీమహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నంలో అయ్యప్ప జన్మించాడు.