April : ఏప్రిల్ ఫూల్ ఎందుకు స్పెషల్.. ఎలా పుట్టింది.. ?

ఎల్లుండి ఏప్రిల్ ఒకటి. ఏప్రిల్ ఒకటి ఎందుకు స్పెషలో తెలుసు కదా! అయ్యాల ఫూల్స్ డే. ఉన్నవి, లేనివి ఎక్కడెక్కడివో కథలు చెప్పి పక్కోళ్లను ఆటపట్టించి, వాళ్లు దాన్ని నమ్మేసరికి 'హేయ్.. ఏప్రిల్ పూల్..' అని అరవడమే ఏప్రిల్ ఒకటి స్పెషల్, ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డే గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.

ఎందుకు ఏప్రిల్ ఫూల్ ?

ఏప్రిల్ ఒకటిన జనాలను ఆటపట్టించి ఫూల్స్ చేయడమనేది ఎలా వచ్చిందన్న దానిపై చాలా కథలు ఉన్నాయి. అందరూ నిజమని నమ్మేది మాత్రం ఒకటి ఉంది. 1582లో జూలియన్ క్యాలెండర్ నుంచి జార్జియన్ క్యాలెండర్ వైపుకు సమాజం మారింది. జార్జియన్ క్యాలెండర్లో కొత్త సంవత్సరం జనవరి 1న ఉంటుంది. జూలియన్ క్యాలెండర్లో ఇది ఏప్రిల్ 1. అయితే ఈ కొత్త క్యాలెండర్కు ఇంకా అలవాటు పడని కొంతమంది జనం మాత్రం ఏప్రిల్ ఒకటినే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే, 'ఏయ్.. ఏప్రిల్ పూల్స్' అని ఆట పట్టించారట. అప్పట్నుంచి ఏప్రిల్ ఒకటిన ఏప్రిల్ ఫూల్స్ అనటం కామన్ అయిందని చెప్పుకుంటారు. ప్రపంచమంతటా 'ఏప్రిల్ ఫూల్ డే' సెలబ్రేట్ చేస్తుంటారు.

ఇప్పటికీ పాపులర్!

'ఏప్రిల్ ఫూల్' అని ఆటపట్టించడంలో పిల్లలు నెంబర్ వన్ ఉంటారు. ఏ తరం పిల్లలకైనా ఇది రొటీన్. 'నీ మీద బల్లి పడింది', 'ఆ షర్ట్ మీద రంగేంటి?", "పెన్ ఇంకు పడింది' అని రకరకాల ప్రాంక్స్ చేసి ఏప్రిల్ ఫూల్ ఆటలు ఆడుతుంటారు పిల్లలు. ఒకరిని ఏప్రిల్ ఫూల్ చేయడానికి వాళ్లకంటూ కొన్ని ప్లాన్లు ఉంటాయి. ముందుగా ఎవరిని ఫూల్ చెయ్యాలో వారిని దూరం నుంచి పసిగట్టి అప్పటికప్పుడు పైన చెప్పిన మాటలే ఏదో ఒకటి రెడీ చేసుకుంటారు. వాళ్లు దగ్గరికి రాగానే ఆ మాటను అనేస్తారు. వాళ్లు నిజమేనేమో అని నమ్మేసరికి, 'ఏప్రిల్ ఫూల్' అని గట్టిగా అరుస్తారు. దీన్నంతా ఒక ఆటలా, కనిపించిన ఫ్రెండ్స్ అందరితో ఆడేస్తూ ఉంటారు. ఏప్రిల్ ఒకటంటే పిల్లలకు పెద్ద సరదా. ఇంకొందరు పిల్లలైతే ఏకంగా నెలంతా 'ఏప్రిల్ పూల్' ఆటలోనే మునిగి తేలుతుంటారు.