తెలంగాణలో కార్మికుల..సంక్షేమ బాధ్యత ఎవరిది?

 పోరాటాలు, అసమాన త్యాగాలతో సాధించిన తెలంగాణలో ఉద్యమ నాయకుడుగా అధికారం చేపట్టిన కేసీఆర్ పాలనలో ప్రజల ఆశలు ఆవిరయ్యాయి.  కేసీఆర్ పదేండ్ల పాలనా కాలంలో రాష్ట్రంలో  ఆశా వర్కర్లు,  మున్సిపాలిటీ,  పంచాయతీ  కార్మికులు, ఆర్టీసీ, కేజీబీవీ ఉద్యోగస్తులు, కార్మికులు సమ్మెలు, ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అండగా నిలిచిన కార్మికులకు  కేసీఆర్​ ముఖ్యమంత్రి అయ్యాక  సపోర్ట్​గా నిలవకపోగా,  సమ్మె చేస్తున్న కార్మిక వర్గాలతో కనీసం చర్చలు కూడా చేయలేదు. 

 అంతేగాక  కార్మికుల  తరఫున  గొంతు విప్పుతున్న  సంఘాలను పనికిమాలిన సంఘాలు అంటూ దురుసుగా ప్రవర్తించారు.  అహంకా రంగా వ్యవహరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేశారు. యూనియన్లు లేకుండా కుట్రలు చేశారు.  కార్మిక, ప్రజా సంఘాలలో చీలికలు తెచ్చారు. కేసీఆర్  వైఖరితో  విసుగు చెందిన కార్మికులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్​కు తగిన గుణపాఠం చెప్పారు.

లక్షమందికిపైగా పారిశుద్ధ్య కార్మికులు

తెలంగాణ  రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 129 మున్సిపాలిటీలు,  13 కార్పొరేషన్లు ఉన్నాయి.  సుమారుగా లక్ష మందిపైగా  పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.  గ్రామాలు,  నగరాలు,  పట్టణాల ప్రజలకు  పరిశుభ్రత , పచ్చదనం,  తాగునీరు,  విద్యుత్తు  తదితర విషయాలు  ప్రజలకు నిరాటంకంగా అందుతున్నాయంటే.. ఈ కార్మికుల శ్రమతోనే అనేది జగమెరిగిన సత్యం.  

వీరు సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచి తమ సేవలు ప్రారంభిస్తారు.  దుమ్ము, ధూళి,  మురుగు, దుర్గంధంలో పనిచేస్తూ  కోట్లాది ప్రజల ఆరోగ్యాలని సంరక్షిస్తుంటారు. వీరికి కనీస పని గంటల చట్టం అమలు కాదు. పండుగలు, రాజకీయ పర్యటనలు, విపత్తులు వచ్చినప్పుడు రాత్రి, పగలు అనే తేడా లేకుండా వీరితో అదనపు పని చేయిస్తుంటారు.  

రాష్ట్రంలో  మూడు  నుంచి  ఏడు నెలలుగా  అనేక పంచాయతీలలో  కార్మికులకు వేతనాలు అందలేదు.  గ్రామపంచాయతీ కార్మికులకు  ఉద్యోగ భద్రత ,  ప్రతినెల  క్రమం తప్పకుండా వేతనాలను  పెరుగుతున్న ధరలకు తగినట్టుగా పెంచుతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.  ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు స్పష్టత ఇవ్వాలి.

కార్మిక వ్యవస్థ నిర్వీర్యం 

 మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ స్కీమ్ అయిన అంగన్వాడీలులో మన రాష్ట్రంలో 70 వేల మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ పథకం వల్ల క్షేత్రస్థాయిలో పేద మహిళలకు, బాల, బాలికలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే  పథకం ఇది.  కానీ ప్రభుత్వాలు అలసత్వం వల్ల,  కేటాయిస్తున్న నిధుల వల్ల ఈ వ్యవస్థ రోజు రోజుకి కునారిల్లుతున్నది.  కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా  వీరి సంక్షేమం కోసం దృష్టి  కేంద్రీకరించాలి.  రాష్ట్రంలో చేనేత కార్మికులు సుమారు 30 వేల కుటుంబాలు ఉన్నాయి.

 వారికి కేసీఆర్​ ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు సుమారు రూ.300 కోట్లు వరకు చెల్లించలేదు.  కార్మికులకు నేరుగా రావాల్సిన దారం సబ్సిడీని కూడా ఇవ్వలేదు. కార్మికులు పొదుపు సొమ్ముకు మ్యాచింగ్ గ్రాండ్స్, విద్యుత్ సబ్సిడీలు  చెల్లించకుండా బకాయి పెట్టింది.  ఫలితంగా చేనేత కార్మికుల పరిశ్రమ సంక్షోభంలో పడింది.  నేతన్నల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని తక్షణమే చేయాలి.  రాష్ట్రంలో లక్షలాదిమంది హమాలీల కుటుంబాలలో ఉన్న బాధల  బరువులు దిగటం లేదు.  

రవాణా రంగంలో కూడా కోట్లాది మంది కార్మికులు ఉన్నారు. వారి సంక్షేమం కూడా ప్రభుత్వాలకు పట్టడం లేదు. కార్మిక వర్గం కష్టాలపై  ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.  కార్మిక సంక్షేమ చర్యలు చేపట్టాలి. సౌకర్యాలు, వసతులు మెరుగుపరచాలి. అప్పుడే తెలంగాణ అభివృద్ధి సూచీలో  దేశంలో ముందు వరుసలో నిలుస్తుంది. 

కాంగ్రెస్ ​సర్కార్​పై కార్మికుల ఆశలు

ప్రజల అవసరాలకు తగిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ  తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది.  ఈ పరిణామం కార్మికులకు ఆశలు  కలిగించింది.  కార్మికులకు లబ్ధి  చేకూరుతుందని, యూనియన్, కార్మికుల బాధలను వినే నాథుడైనా దొరికాడనే  ఆశతో ఉన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తిచేసుకుంది.  73వ  షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ కనీస వేతనాల సవరణ చేస్తూ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కార్మిక వర్గానికి పెద్దగా ఉపయోగపడని,  కేసీఆర్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా అనుసరించటం కార్మికుల ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది. 

ప్రభుత్వం విడుదల చేసిన రైస్ మిల్లుల జీవో 86 ప్రకారం అన్ స్కిల్ వారికి  రోజు కూలి 456 రూపాయలు, ఇంజన్ డ్రైవర్ కు 12,440 సూచించారు. కానీ, క్షేత్రస్థాయిలో రోజుకు 500 రోజు కూలికి , ఇంజిన్ డ్రైవర్ కు రూ.14 వేలకుపైగా చెల్లిస్తున్నారు.  క్షేత్రస్థాయిలో వేతనాలు ఇచ్చే దానికన్నా  జీవోలో వేతనాలు తక్కువగా ఉండటం అంటే కార్మికుల పట్ల,  కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉన్నదో  తేటతెల్లం అవుతున్నది.  రెండేండ్ల క్రితం మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు కనీస వేతనం 21 వేల 253గా తీర్మానించింది.  దీనిని గెజిట్ చేయాలని కూడా సలహా ఇవ్వటం జరిగింది.  దీని ప్రకారం కనీస వేతనం రూ. 21,220 ఫైనల్ చేస్తూ  కొత్త జీవోలను తయారు చేసి గెజిట్ ముద్రించి కార్మికులకు న్యాయం చేయాలని కార్మిక లోకం ఎదురుచూస్తోంది.

కార్మికులతో వెట్టిచాకిరి

కస్తూరిబా బాలికల విద్యాలయాలలో రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది కార్మికులు పనిచేస్తున్నారు.  వీరికి కూడా ప్రభుత్వం కనీస వేతనాలు చెల్లించడం లేదు.  పక్క రాష్ట్రమైన ఏపీలో  కే.జీ.బీ.వీలో పని చేస్తున్న కార్మికులకు నెలకు 14 వేల రూపాయలు వేతనం చెల్లిస్తుంటే,   తెలంగాణలో మాత్రం ఎనిమిది వేల రూపాయలకు మించి వేతనం ఇవ్వడం లేదు.  ఇది చాలా అన్యాయం.  ఈ.ఎస్.ఐ,  పీ.ఎఫ్, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటి సౌకర్యాలు కూడా  కల్పించకుండా వారితో  వెట్టి చాకిరి చేయిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. 

 మాత, శిశు మరణాలు తగ్గించేందుకు క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లు విశేషంగా కృషి చేస్తున్నారు.  రాష్ట్రంలో 27 వేల మందికి పైగా ఆశాలు పనిచేస్తున్నారు. గర్భం దాల్చిన నుండి ప్రసవం అయ్యేంతవరకు తల్లిని, బిడ్డను క్షేమంగా చూసుకునే ప్రధాన బాధ్యతను  ఆశాలు  నెరవేస్తున్నారు.  ప్రభుత్వ కార్యక్రమాలు అన్నిటిని  క్షేత్ర స్థాయిలో అమలుకు  వీరి కృషి చాలా ముఖ్యమైనది.

  ప్రభుత్వ పథకాల అమలులో కీలకమైన ఈ ఆశా వర్కర్లు వేతనాలు రోజుకు  కేవలం మూడు వందల  రూపాయలు మాత్రమే ఇవ్వడం బాధాకరం.  దళిత మహిళలు, ఒంటరి మహిళలు,  అత్యంత పేదలు ఎక్కువగా ఉండే ఆశా వర్కర్లకి  హర్యానా రాష్ట్రంలో రూ.14000  వేతనం ఇస్తున్నారు. కానీ,  తెలంగాణలో వారి  వేతనాలు శ్రమకు తగిన స్థాయిలో లేవు.

- ఆవుల అశోక్, ఐఎఫ్​టీయూ రాష్ట్ర నేత