శివుడి చెల్లెలు ఎవరో తెలుసా... ఆమె అంటే పార్వతిదేవికి కోపం ఎందుకు?

 అత్త, ఆడబిడ్డలకు ఎంతో ఉన్నత స్థానం ఇవ్వాలని పెద్దలు చెబుతారు. పురాణాల్లో కూడా ఇదే ఉంది.  ఆడబిడ్డ అర్ద మొగుడు అని కూడా అంటారు. అందుకే హిందువుల వివాహ తంతుల్లో అప్పగింతల కార్యక్రమంలో భర్త, అత్త, మామల తరువాత , ఆడ బిడ్డలకు అప్పగిస్తారు.  కాని సాక్షాత్తు పరమశివుడి సోదరి అంటే  పార్వతి దేవి ఎంతో విసుగుచెందిందని శివపురాణంలో పేర్కొన్నారు.  అసలు శివుడి చెల్లెలు ఎవరు.. ఆమె పట్ల పార్వతి దేవి ఎందుకు ఆగ్రహంతో ఉందో తెలుసుకుందాం.  

 లయ కారుడు, భోళా శంకరుడు, ఆది యోగి ఇలా రకరకాల పేర్లతో భక్తులు శివన్నామ స్మరణ చేస్తారు. భక్తి శ్రద్దలతో నిష్కలంక మనస్సుతో పూజ చేస్తే శివుడు భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతారు. ఇందులో భాగంగానే పురాణాలలో చాలా మంది తపస్సు చేసి శివుని ఆశీర్వాదాలు పొందారు.

పరమేశ్వరుడిని తలుచుకుని నిత్యం పూజలు చేస్తారు. ఆయన గురించి తలుచుకునేటప్పుడు భార్య పార్వతీ దేవి, తల మీద గంగా దేవి, కుమారులు వినాయకుడు, కుమార స్వామి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఆయనకి ఒక చెల్లెలు ఉందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే జనన మరణాలు లేని వాడు పరమ శివుడు. ఆయనకి చెల్లి ఎలా వచ్చిందా అనుకుంటారు. కానీ శివుడి చెల్లెలి గురించి పురాణాలలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

శివుడి చెల్లెలు ఎలా వచ్చిందంటే..

శివ పురాణం ప్రకారం శివుడు పార్వతీ దేవిని వివాహమాడిన అనంతరం కైలాసానికి తీసుకొని వస్తాడు. శివుడు నిత్యం ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. కైలాసంలో అందరూ మగవాళ్ళు ఉండేవాళ్ళు. తనతో మాట్లాడేందుకు ఒక్క ఆడ తోడు కూడా లేదని చెప్పి పార్వతీ దేవి తన బాధని శివుడికి వెళ్లబోసుకుంటుంది. ఆ బాధ తీరాలంటే తనకి ఆడపడుచు ఉంటే బాగుంటుందని మనసులో కోరిక చెప్తుంది.

సరస్వతీ దేవి తనకి చెల్లెలు వరుస అవుతుందని శివుడి చెప్తాడు. కానీ ఆమె ఎన్నో పనుల్లో ఉంటుంది తనతో గడిపేందుకు సమయం ఉండదని పార్వతీ దేవి అంటుంది. దీంతో శివుడు తన శక్తిని ఉపయోగించి అచ్చం తనలాగే ఉండే ఆశావరి అనే మహిళను సృష్టించి... ఆమెను శివుడు సోదరిగా పరిగణించాడని పురాణాలు చెబుతున్నాయి.  సృష్టించాడు. ఆశావరి చూసేందుకు శివుడి మాదిరిగానే పులి చర్మం ధరించి ఉంటుంది. జుట్టు విరబోసుకుని ఉంటుంది. కాస్త చూసేందుకు అసహ్యకరంగా ఉంటుంది.

ఆశావరితో విసిగిపోయిన పార్వతీ దేవి

పార్వతీ దేవి సంతోషంగా ఆశావారిని ఇంటికి తీసుకుని వెళ్తుంది. తనని స్నానం చేయించి అందంగా రెడీ చేస్తుంది. తనకి బాగా ఆకలిగా ఉందని అనడంతో పార్వతీ దేవి ఆమె కోసం రుచికరమైన వంటకాలు చేయించి పెట్టింది. కానీ ఎంత తిన్నా కూడా ఆశావరి దేవి ఆకలి మాత్రం తీరలేదు. ఆమె ఆకలికి కైలాసంలోని ఆహారం మొత్తం అయిపోయింది. అయినా ఆమె ఆకలి తీరలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది.

సమస్య పరిష్కరించడం కోసం పార్వతీ దేవి శివుడి ఆశ్రయం కోరింది. ఆశావారి ప్రవర్తనకి తాను విసిగిపోయాయని ఆమెని భరించడం తన వల్ల కాదని చెప్తుంది. దీంతో శివుడు తన చెల్లెలిని వేరే ప్రాంతానికి పంపించేస్తాడు. అలా శివుని సోదరి కథ ముగిసిపోతుంది. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు.