యూనివర్సిటీల సంక్షోభానికి కారకులెవరు?

తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో తరచుగా చర్చకు వస్తున్న విద్యా రంగ సమస్యల్లో యూనివర్సిటీల దుస్థితి కూడా ప్రధానంగా ఉంటుంది. మానవ అభివృద్ధి సూచికలో ఉన్నత విద్యారంగానికి ప్రాధాన్యత ఉండటం మూలంగా ఉన్నత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి తమ బాధ్యతగా ప్రభుత్వాలు భావించాల్సిందే. కానీ, ఉన్నత విద్యలో  విద్యా ప్రమాణాలు పెంచే దశలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ కనబరచడంలో  వైఫల్యం చెందడం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ సందర్భంలో తెలంగాణలో నేడు యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న విద్యారంగ సంక్షోభం చర్చనీయ అంశమైంది.  పాలకుల అనాలోచిత నిర్ణయాలను ప్రశ్నించే కేంద్రాలుగా యూనివర్సిటీలు  ఉండటం మూలంగా ప్రభుత్వాలు పూర్తిగా వీటిని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నాయి. రాష్ట్రంలో 12  ప్రభుత్వ యూనివర్సిటీల్లో గత 14 ఏండ్లకు పైగా ఆచార్యుల నియామకాలు లేకపోవడానికి వివిధ ప్రభుత్వాల  అలసత్వం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 

తెలంగాణ ఆవిర్భావ తదనంతరం రాష్ట్ర యూనివర్సిటీల పరిస్థితి స్వర్ణయుగంగా మారుతుందని భావించిన యూనివర్సిటీ విద్యార్థి,  మేధావి వర్గానికి చేదు అనుభవాలే మిగిలినాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి విద్యారంగంపై ప్రధానంగా యూనివర్సిటీలపై శీతకన్ను ఉండడం మూలంగా నిర్లక్ష్యానికి గురి అయ్యాయి.  ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు చూపించిన చొరవ, ఉత్సాహం ప్రభుత్వ యూనివర్సిటీలపై లేకుండా పోయింది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు రాజకీయ ప్రజా ప్రతినిధులవి కావడంతో  ప్రభుత్వం తీరు తేటతెల్లమైంది. ప్రభుత్వ యూనివర్సిటీలపై సవతి తల్లి ప్రేమ చూపెడుతూ, మౌలిక సదుపాయాల కల్పనలో కనీస చొరవ చూపెట్టలేదు. ప్రభుత్వ ప్రకటనలో నిధుల మంజూరు కనపడిందే తప్ప, ఒక్క రూపాయి కూడా యూనివర్సిటీలకి బదిలీ చేయకపోవడం లాంటి అనేక అనుభవాలను చవిచూసినాం. యూనివర్సిటీలలో శాశ్వత ప్రాతిపదిక  నియామకాలకి కోర్టులో ఉన్న కేసులను ఒక బూచిగా చూపెట్టి ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు.   

20 ఏండ్ల నుంచి ఒప్పంద అధ్యాపకులే

యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు రేపటి తన రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నించేవాళ్లుగా తయారవుతారు అని భావించిన కేసీఆర్ కావాలని యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేశారనే ఒక చర్చ తెలంగాణ సమాజంలో ఉంది.  యూనివర్సిటీలలో శాశ్వత అధ్యాపకుల లేమి స్పష్టంగా కనబడుతూ ఉన్నప్పటికీ, విద్యాబోధనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా  తాత్కాలిక, ఒప్పంద అధ్యాపకులు తమ బాధ్యతను నెరవేరుస్తున్నారనే కఠినమైన వాస్తవాన్ని చాలామంది మేధావులు వ్యక్తం చేయడం లేదు. గత 20 ఏండ్లకు పైగా చాలా యూనివర్సిటీలు ఈ తాత్కాలిక, ఒప్పంద అధ్యాపకుల సహాయంతో వేలాదిమంది విద్యార్థులకు విద్యాబోధన నేర్పించి ఉత్తీర్ణులను చేయడమే కాకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో చాలా ఉద్యోగాల్లో స్థిరపడిన విద్యార్థులకు వీరే  విద్యాబోధన చేశారనేది నగ్నసత్యం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొన్న అన్ని రకాల విద్యార్హతలను కలిగిన అనేకమంది ఒప్పంద అధ్యాపకులు  ఉన్నప్పటికీ వారు అందించే బోధన సర్వీసులను కూడా గుర్తించలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాల మొండి వైఖరి ఉంది.

రెగ్యులరైజ్​ చేయాలి

బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి పీఆర్సీ ద్వారా అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగస్తులకు వేతనాల పెంపు జరిగినప్పటికీ,  యూనివర్సిటీలలో  పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు   వర్తింప చేయలేదు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులుగా పనిచేసిన 5 వేలకు పైగా అధ్యాపకులకి ముందుగా స్కేలు వర్తింపజేసి, తదనంతరం వారిని రెగ్యులరైజ్ చేసి, రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు కనీసం స్కేల్​ను కూడా అమలు చేయలేదు. 

కాంగ్రెస్​ సర్కారైనా న్యాయం చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో   రాష్ట్రంలో యూని వర్సిటీలను బలోపేతం చేస్తూ, ఉన్నత విద్యారంగాన్ని కాపాడడం తమ కనీస బాధ్యతగా ప్రకటించడం జరిగింది. యూనివర్సిటీలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. విద్యాశాఖ మంత్రిగా  స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఉండడం యాదృచ్ఛికమే. ఒప్పంద అధ్యాపకులకు తక్షణమే స్కేల్​ను అమలు చేస్తూ,  రెగ్యులరైజేషన్  ప్రక్రియను ప్రారంభించాలని ఒప్పంద అధ్యాపక వర్గం ఆశిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులను, స్థానిక ఎమ్మెల్యేలను, సామాజికవేత్తలు అయిన ప్రొ. హరగోపాల్, ప్రొ.కోదండరాం స్వయానా ముఖ్యమంత్రి దృష్టికి యూనివర్సిటీ ఒప్పంద, తాత్కాలిక అధ్యాపకుల సమస్యలు  తీసుకుపోవడం జరిగింది. ఒప్పంద  అధ్యాపకుల సమస్యకు పరిష్కారం చూపకుండా శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపట్టడం అన్యాయం.

రాజకీయ జోక్యాలు

ప్రభుత్వ లెక్కల ప్రకారం  రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో ప్రభుత్వం మంజూరు చేసిన ఆచార్యుల పోస్టులు 2,825 కాగా రెండు వేలకు పైగా ఖాళీ  పోస్టులు ఉన్నాయి. వాస్తవానికి ఈ ఖాళీ పోస్టుల స్థానంలోనే తాత్కాలిక, ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో తాత్కాలిక, ఒప్పంద అధ్యాపకులు పనిచేయడానికి గత ప్రభుత్వాల అనాలోచిత విధానాలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రాజకీయ పైరవీల మూలంగా వివిధ యూనివర్సిటీల ఉప కులపతుల  నియామకం జరగడం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, అవినీతి డబ్బుకు అలవాటు పడిన ఉప కులపతులు అప్పటికే యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను, రిక్రూట్మెంట్ చేసుకోకపోవడం, వివిధ విభాగాల పోస్టుల రిజర్వేషన్ జాబితాలను తారుమారు చేసి తమవారిని నియమించుకోవడం మూలంగా ఈ ఒప్పంద అధ్యాపకులు రిక్రూట్మెంట్ కాకుండా కాంట్రాక్ట్​ అధ్యాపకులుగానే మిగిలిపోయినారు.  

- డా. సాధు రాజేష్,  అర్థశాస్త్ర విభాగం, కాకతీయ యునివర్సిటీ