గోదావరి నీళ్లతో ఆలేరుకు జలకళ : బీర్ల ఐలయ్య

  • ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : గోదావరి నీళ్లతో ఆలేరు నియోజకవర్గానికి జలకళ వచ్చిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గోదావరి జలాలతో నిండి మత్తడిపోస్తున్న యాదగిరిగుట్ట మండలం మైలారుగూడెం చెరువును ఆదివారం ఎమ్మెల్యే సందర్శించారు. గ్రామస్తులతో కలిసి గోదారమ్మకు పూజలు చేసి హారతి పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల ఉన్నా ప్రభుత్వంతో కొట్లాడి ఆలేరుకు గోదావరి జలాలు తెచ్చి సస్యశ్యామలం చేశామన్నారు.

బీఆర్ఎస్ హయాంలో సాగునీరు లేక రైతులు నానా అవస్థలు పడ్డారని, ఆ కష్టాలను తీర్చడం కోసమే ఆలేరుకు గోదావరి నీళ్లను తెచ్చామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం, సైదాపురం మాజీ ఉప సర్పంచ్ సురేఖావెంకట్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు బండి అశోక్, బీజేపీ జిల్లా కార్యదర్శి అచ్చయ్య, మదర్ డెయిరీ డైరెక్టర్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.