ధర్మారం, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ, తాను అన్నదమ్ముల్లా ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కోసం కలిసి పనిచేస్తామని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ధర్మారం మండలకేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మీద విశ్వాసం ఉంచి గడ్డం వంశీకృష్ణకు ఓట్లేసి గెలిపించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
దేవుడిని అడ్డం పెట్టుకొని మతపరమైన ఉద్వేగాలు రెచ్చగొట్టి బీజేపీ ఓట్లు అడిగి దెబ్బతిందన్నారు. 20 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొప్పుల ఈశ్వర్.. తాను గెలవనని తెలిసి బీజేపీకి ఓటేయాలని చెప్పి అనైతిక చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, లీడర్లు కొడారి అంజయ్య, కాడే సూర్యనారాయణ, రాజేశం గౌడ్, రవీందర్ రెడ్డి, రూప్ల నాయక్, నరసింహులు, దేవేందర్ రెడ్డి, రాజేశం, తిరుపతి, తిరుపతి, హఫీజ్, చిరంజీవి, వేణు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
పెద్దపల్లి జిల్లా కటికెనపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి హత్యకు గురైన రేండ్ల నరేశ్ కుటుంబాన్ని విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. ప్రజాస్వామ్యంలో హత్యలు చేయడం అరాచకమని, హత్యారాజకీయాలు తగవని పేర్కొన్నారు. నరేశ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.