సూరమ్మ చెరువు కాల్వలకు  నష్టపరిహారం చెల్లించండి :  విప్ ఆది శ్రీనివాస్

  • అసెంబ్లీలో  మంత్రిని కోరిన విప్ ఆది శ్రీనివాస్

 కోరుట్ల, వెలుగు: వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాజెక్టులకు సాగునీరు అందించాలని విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డిని కోరారు.  గురువారం అసెంబ్లీలో ఆది శ్రీనివాస్​ మాట్లాడుతూ..  శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ నెల ఆఖరిలోగా సాగునీరు అందించాలన్నారు. తద్వారా నియోజకవర్గంలోని రైతాంగానికి లబ్ధి చేకూరుతుందన్నారు.

కథలాపూర్ , మేడిపల్లి , భీమారం మండలాల వరప్రదాయని కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, కుడి ,ఎడమ కాల్వల పనులు ప్రారంభం కావాల్సి ఉందని ఇటీవల జిల్లా కలెక్టర్ భూ సేకరణకు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు.  కుడి, ఎడమ కాలువలకు భూమి కోల్పోతున్న వారికి నష్ట పరిహారం చెల్లించి, బొమ్మెన ప్రాజెక్ట్ కు రూ.1 కోటి 60 లక్షల నిధులను విడుదల చేయాల్సిందిగా మంత్రిని కోరారు.  దీనికి మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి నష్టపరిహారంతో పాటు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.