వర్షాకాలం: లవర్స్​ ఫెస్టివల్​.. ప్రేమికుల జాతర ఎక్కడ జరుగుతుందో తెలుసా...


ప్రేమికుల జాతర గురించి ఎప్పుడైనా విన్నారా?  ఈ అరుదైన జాతర ప్రతి ఏటా వర్షాకాలంలో  జరుగుతుంది. రెండు రోజుల పాటు ఈ జాతరను అమర ప్రేమికులైన లైలామజ్ను లవర్స్​సమాధుల దగ్గర  నిర్వహించే ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి ప్రేమికులు తరలివస్తారు.

లైలా.. మజ్ను అమర ప్రేమికులు అని అందరికీ తెలుసు. ఆ ప్రేమ కథ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతేకాదు. ఎవరైనా గాఢంగా ప్రేమించుకుంటే వాళ్లను లైలా మజ్నులతో పోలుస్తాం. కానీ,, వాళ్లస్టోరీ నిజమా? లేక కల్పితమా? అనేది చాలామందికి తెలియదు. అయితే ఆ ప్రేమ కథ వాస్తవమే అనేందుకు వాళ్ల సమాధులు సాక్ష్యాలుగా నిలిచాయి. కానీ, వాళ్ల ప్రేమ కథ మాత్రం అనేక రకాలుగా ఇప్పటికీ ప్రచారంలో ఉంటోంది.

లైలా, మజ్నులు చనిపోయినా.. వాళ్ల ప్రేమ ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఆ ప్రేమ జ్ఞాపకంగా వాళ్ల సమాధులు రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలోని బింజోర్ అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నాయి. ఈ ఊరు పాకిస్థాన్ సరిహద్దు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్గిల్ యుద్ధం జరగకముందు పాకిస్తానీలు కూడా ఇక్కడికి సమాధుల సందర్శన కోసం వచ్చేవాళ్లు. కానీ కార్గిల్ తర్వాత అనుమతి ఇవ్వడంలేదు. ప్రతి రోజూ చాలామంది ప్రేమికులు అక్కడికి వెళ్లి వాళ్ల లవ్ సక్సెస్ కావాలని పూజలు చేస్తారు. 

 ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 'ప్రేమికుల  'జాతర' కూడా జరుపుతారు. ఆ టైంలో దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రేమ జంటలు వచ్చి లైలా మజ్నుల సమాధుల్ని దర్శించుకుంటాయి. విశేషం ఏంటంటే.. అన్ని మతాల వాళ్లకు ఇక్కడ అనుమతి ఉంది.

లైలా మజ్నుల ప్రేమ కథ

మజ్ను అసలు పేరు కైసిన్ అల్ ముల్లా.  కైసిన్ పుట్టిన తర్వాత అతని తండ్రి షా అమారి ఓ జ్యోతిష్కుడి దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు జ్యోతిష్కుడు 'నీ కొడుకు ప్రేమ కోసమే పుట్టాడు' అని చెప్పాడు. కానీ.. అమారికి అది ఇష్టం లేదు. అందుకే ప్రతిరోజు తన కొదుకు ప్రేమ జోలికి వెళ్లకూడదని దేవుడిని ప్రార్ధించేవాడు. కానీ, మజ్ను ఒకసారి మసీదులో లైలాను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి నాజత్ షా బాగా ధనవంతుడు. బాగా డబ్బున్న ఇంటికి తన కూతురిని కోడలుగా పంపాలనుకునేవాడు. లైలాను చూసినప్పటినుంచి మజ్నుకు ఎప్పుడూ... ఆమె ఆలోచనలే ఉండేవి. కొన్నాళ్ల పాటు ఆమె ఎక్కడికి వెళ్లినా ఫాలో అయ్యాడు. అది గమనించిన లైలా కూడా మజ్ను ప్రేమలో పడిపోయింది. విషయం తెలుసుకున్న లైలా తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో నిర్బంధించారు.

 లైలా కనిపించకపోవడంతో మజ్ను మానసిక క్షోభతో అనారోగ్యం పాలయ్యాడు. అదే టైంలో లైలాను భగత్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. అయినా లైలా మనసు మారలేదు. ఎప్పుడూ మజ్నునే తలుచుకుంటూ బాధపడేది. లైలా ప్రేమ విషయం తెలుసుకున్న భగత్.. ఆమెను మజ్ను వద్దకు పంపించేశాడు. అలా లైలా, మజ్నులు మళ్లీ ఒకటయ్యారు. 

కానీ.. అది చూసి సహించలేని పెద్దలు లైలాను ఇంటికి తీసుకెళ్లి బంధించారు. ఆ బాధ భరించలేని లైలా ప్రాణాలు విడిచింది. ఈ వార్త విన్న మజ్ను కూడా వెంటనే గుండె పగిలి చనిపోయాడు. ఆ తర్వాతే పెద్దల కళ్లు తెరుచుకున్నాయి. అందుకే లైలా మజ్నుల సమాధులు ఒకే చోట కట్టించారు. అయితే లైలా మజ్ను అరబ్ దేశానికి చెందిన జంట అనే కథ ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా సమాధితో ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ జంట.. అమర ప్రేమికుల జాబితాలో చోటు సంపాదించుకుంది.