హర్యానా పీఠం ఎవరిదో మరి.!

రెండు పార్టీలు, రెండు నినాదాలు, రెండంశాలు.. ఒక రాష్ట్రం! ఇదీ, దాదాపు నెల రోజుల వ్యవధిలో  ఎన్నికలు ఎదుర్కోబోతున్న హర్యానా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి.  దేశ రాజధాని ఢిల్లీని ఆనుకొని ఉన్న హర్యానాలో, రెండు ప్రధాన స్రవంతి ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. అక్టోబరు 1న పోలింగ్‌‌.  పదేండ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్‌‌ ప్రస్తుతం స్వల్ప ఆధిక్యతలో ఉన్నా..పార్టీ అంతర్గత కుమ్ములాటల భయం వెన్నాడుతోంది. గత రెండు అసెంబ్లీ, రెండు లోక్‌‌సభ ఎన్నికల్లో పొందిన స్పష్టమైన ఆధిపత్యానికి నిన్నటి లోక్‌‌సభ ఎన్నికల్లో గండిపడి బీజేపీ కుదేలయి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి, కీలకవర్గాలు దూరమైన పరిస్థితుల్ని అధిగమించడానికి సాధ్యమైన ‘సకల ప్రయత్నాల్లో’ తలమునకలైన బీజేపీ నాయకత్వం.. తమ నిర్వహణా సామర్థ్యాన్నే నికరంగా నమ్ముకుంటోంది. ఆర్​ఎస్​ఎస్​ తన ‘ముద్ర’ పెంచుతోంది. ప్రాంతీయ పార్టీలు ఈసారి వన్నెతగ్గి కనిపిస్తున్నాయి. అదీ కాంగ్రెస్‌‌కు లాభించేదే! ఇదీ హర్యానా తాజా ముఖచిత్రం!

ఉత్కంఠ రేపిన 2024 లోక్‌‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత.. మోహరించిన బలమైన కూటములు ఎన్డీఏ (293), ‘ఇండియా’ (234) లకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌‌లు తొలిసారి ఓ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు నేరుగా తలపడుతున్న రాష్ట్రం హర్యానా. దీంతో పాటే జరుగుతున్న జమ్మూ-కాశ్మీర్‌‌ ఎన్నికల తర్వాతనే మహారాష్ట్ర, జార్ఖండ్‌‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజల దృష్టినాకర్షిస్తున్న హర్యానా ఎన్నికల్ని రెండు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు పర్యాయాలు నెగ్గి పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ‘ఆగకుండా.. పురోగమిస్తున్న హర్యానా’ నినాదంతో ప్రచారం ముమ్మరం చేసింది. పదేండ్ల బీజేపీ పాలనలో అవినీతి విచ్చలవిడితనం పెరిగిందని విమర్శిస్తున్న కాంగ్రెస్‌‌ ‘హర్యానా... లెక్కలు అడుగుతోంది’ (హర్యానా మాంగే ఇసాబ్‌‌) నినాదంతో ప్రచారంలో దూసుకుపోతోంది.

క్రమంగా తగ్గుతున్న బీజేపీ ప్రాభవం

పదేండ్ల తర్వాత, బీజేపీ ప్రాభవం క్రమంగా తగ్గుతున్నట్టు, కాంగ్రెస్‌‌ పరిస్థితి నెమ్మదిగా మెరుగవుతున్నట్టు ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. 2014లో 10 కి పది లోక్‌‌సభ స్థానాలు నెగ్గి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి 47 స్థానాలు బీజేపీ గెలుచుకొని స్పష్టమైన ఆధిక్యతతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 లోకసభ ఎన్నికల్లో  మొత్తం 10 స్థానాలు నిలబెట్టుకున్నప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి బీజేపీ స్థానాల సంఖ్య 40కి పడిపోయింది. ఇండియన్‌‌ నేషనల్‌‌ లోక్‌‌దళ్‌‌ (ఐఎన్‌‌ఎల్డీ) నుంచి విడిపోయి, ఏడాదిలోనే ఎన్నికలు ఎదుర్కొని 10 అసెంబ్లీ స్థానాలు గెలిచిన దేవీలాల్‌‌ మనవడు దుష్యంత్‌‌ చౌతాలా పార్టీ ‘జననాయక్‌‌ జనతా పార్టీ’ (జేజేపీ)తో  బీజేపీ పొత్తు పెట్టుకొని సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసింది. 

కాంగ్రెస్​లో కుంపట్లదే సమస్య

వరుస పదేండ్ల పాలన తర్వాత వచ్చిన నిన్నటి లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ 5 స్థానాలకే పరిమితం కాగా, మిగిలిన 5 స్థానాలను కాంగ్రెస్‌‌ గెలుచుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.  దాదాపు అన్ని సర్వేలూ ఈ వ్యతిరేకతనే ఎత్తి చూపుతున్నాయి. ఒక స్థానాన్ని మిత్రపక్షం ఆమ్‌‌ ఆద్మీ పార్టీ (ఆప్‌‌)కి  కేటాయించి, 9 చోట్ల పోటీచేసి5 చోట్ల నెగ్గిన కాంగ్రెస్‌‌ ఇపుడు మాంచి ఊపుమీదుంది. కానీ, మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి భూపిందర్‌‌ సింగ్‌‌ హుడా ఒకవైపు, మరో  మాజీ  కేంద్రమంత్రి కుమారి షెల్జా మరోవైపు, ఎంపీ (రాజ్యసభ) రణ్‌‌దీప్‌‌ సుర్జేవాలా ఇంకో వైపు.. ఎవరికివారుగా వేరు కుంపట్లు పెట్టి, పెంపొందిస్తున్న అనైక్యత కాంగ్రెస్‌‌ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.  దీన్ని ఎలా అధిగమిస్తారన్నది పెద్ద ప్రశ్న.

సానుకూలం

పంటకు కనీస మద్దతు ధర డిమాండ్‌‌ చేస్తూ పెద్దఎత్తున ఉద్యమించిన రైతాంగం, బలమైన సామాజికవర్గం జాట్‌‌లు, బహుజనులైన దళితులు, నిరుద్యోగ యువత  తమవైపు ఉండటం కలిసివచ్చే అంశమని కాంగ్రెస్‌‌ భావిస్తోంది.   హర్యానా ‘ఆప్‌‌’కి  చెందిన కొందరు కాంగ్రెస్‌‌లో చేరారు.  లోక్‌‌సభ ఎన్నికల పోలింగ్‌‌ తర్వాత జరిపిన సీఎస్‌‌డీఎస్‌‌- లోక్‌‌నీతి సర్వేలో, ఇండియాటుడే -సీఓటర్‌‌  ‘మూడ్‌‌ ఆఫ్‌‌ది నేషన్‌‌’ సర్వేలో  కూడా సమాజంలోని విభిన్నవర్గాలు తిరిగి కాంగ్రెస్‌‌ వైపు కాస్త మొగ్గినట్టు కనిపించింది.

ఆర్ఎస్ఎస్​ క్రియాశీలకం

హర్యానాలో  జాట్‌‌యేతర వర్గాల్లో  ఆధిక్యత సాధించడం, ముఖ్యంగా ఓబీసీలను  ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. లోక్‌‌సభ్‌‌ ఎన్నికలకు ముందే, వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి మనోహర్‌‌లాల్‌‌ కట్టర్‌‌ స్థానే నాయబ్‌‌ సింగ్‌‌ సైనీని మార్చి.. జనాభాలో 35 శాతంగా ఉన్న  ఓబీసీలపై  గురిపెట్టింది.  కానీ,  అనుకున్న ఫలితాల్ని ఆ ఎన్నికల్లో  రాబట్టలేకపోయింది.  ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను దీటుగా ఎదుర్కొనేందుకు పలు సంక్షేమ- అభివృద్ధి  పథకాలను ప్రభుత్వం ఉన్నపళంగా ప్రకటిస్తోంది. తరచూ మంత్రివర్గ సమావేశాలు పెట్టడం, వివిధ  ప్రజాసమూహాల్లోకి చొచ్చుకుపోవడం,  రాత్రి పొద్దుపోయే వరకు అందుబాటులో ఉంటూ పనిగంటలు పెంచుకోవడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను తిరిగి పొందాలని ముఖ్యమంత్రి సారథ్యంలోని సైనీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం యత్నిస్తోంది.  అభ్యర్థుల ఖరారు,  ప్రచారం, నిర్వహణ  ఇలా వివిధ ప్రక్రియల్లో మరింత క్రియాశీలక పాత్ర పెంచుకోవడానికి పార్టీ సిద్ధాంత మాతృక అయిన ఆర్ఎస్ఎస్​ చొరవ తీసుకుంది.  సంఘ్‌‌ ముఖ్యులు,  పార్టీ సీనియర్‌‌  నాయకులతో  కూడిన రెండు రోజుల మేధోమథన సదస్సు గుర్‌‌గావ్‌‌లో  జరిగింది.   

బీజేపీ వరాలు

రాష్ట్రంలో 1.20 లక్షల కాంట్రాక్ట్‌‌ ఉద్యోగుల ఉద్యోగభద్రత విధానం, రైతులకు ఎకరాకు రెండు వేల రూపాయలు బోనస్‌‌ ఇవ్వాలని కేబినెట్‌‌ నిర్ణయించడం, రూ.500 కే  ఎల్పీజీ  సిలెండర్‌‌ ఇవ్వటం... వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి.  గోశాలల ఏర్పాటుకు కొనుగోలు చేసే భూములకు స్టాంప్‌‌ డ్యూటీ మినహాయింపు, పెన్షన్ల మొత్తాల పెంపు వంటి ప్రకటనలన్నీ ఎన్నికల ముంగిట్లో ఓటర్లకు గాలం వేసే పనులే!

ALSO READ : డైట్ ప్రిపరేషన్​ ఎలా? తికమక పడుతున్న సంక్షేమాధికారులు

చిన్న పార్టీలకు పెద్ద పాత్ర లేదా?

హర్యానా రాజకీయాల్లో చిన్నా చితకా పార్టీలు లోగడ పెద్ద పాత్రే పోషించేవి.   కానీ,  ఇటీవలి కాలంలో పోటీ  ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌‌ మధ్యే ఉంటోంది. మెజారిటీ స్థానాలను ఆ రెండు పార్టీలే  గెలుస్తున్నాయి. ఐఎన్‌‌ఎల్డీ, జేజేపీ, ఆప్‌‌ లతో పాటు  బీఎస్పీ కూడా... క్రమంగా ఉనికి కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. ‘ఈసారి ఎవరికీ 40 స్థానాలు రావు,  ప్రభుత్వ ఏర్పాటులో మేమే కీలకం’  అని మాజీ ఉప ముఖ్యమంత్రి, జేజేపీ నేత దుష్యంత్‌‌ చౌతాలా అంటున్నారు. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ ప్రకటించిన అనంతరం కాంగ్రెస్‌‌ అధినేత భూపిందర్‌‌ సింగ్‌‌ హుడా మాట్లాడుతూ ‘అక్టోబర్‌‌ చార్‌‌ (ఓట్ల లెక్కింపు తేదీ). బీజేపీ హర్యానాసే బాహర్‌‌’ అంటున్న వైఖరి ఆ పార్టీ కనబరుస్తున్న ధీమాను ప్రతిబింబిస్తోంది. చూడాలి ప్రజానిర్ణయం ఏంటో?

కాంగ్రెస్​ వైపే మొగ్గు

భారత రాజకీయాల్లో  ప్రజాభిప్రాయం ఎంత గోప్యంగా, మార్మికంగా ఉన్నా కొన్ని ముందస్తు సంకేతాలు ఆయా పార్టీల అనుకూలతలను చెప్పకనే చెబుతాయి. ఇది పలుమార్లు ధ్రువపడింది. హర్యానా సర్వేల్లో కాంగ్రెస్‌‌ సానుకూలత సరేసరి! 90 అసెంబ్లీ సీట్లకుగాను 2,556 మంది ఆశావహులు ఈసారి కాంగ్రెస్‌‌ టిక్కెట్లు ఆశిస్తున్నారు. పార్టీకిదొక ఆశావహ సంకేతం. భూపిందర్‌‌సింగ్‌‌ హుడాకి రాష్ట్రంలో మంచి పేరుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా 40 శాతం మంది రాష్ట్ర ప్రజలు ఆయనవైపు మొగ్గుతున్నట్టు ‘పీపుల్స్‌‌పల్స్‌‌’ ట్రాకర్‌‌పోల్‌‌ సర్వేలో వెల్లడయింది. ఆయనను కాదని షెల్జా,  సుర్జేవాలాలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి కాంగ్రెస్‌‌ శ్రేణులకు భిన్నమైన సంకేతాలిచ్చారు.  రాష్ట్రంలో పార్టీ నాయకులంతా కలిసే ఉన్నారనే  సంకేతాలిచ్చేలా అధిష్టానం జాగ్రత్తపడి  హిమాచల్‌‌ ప్రదేశ్‌‌, కర్నాటక, తెలంగాణలో సాధించిన ఫలితాల్ని ఇక్కడా రాబడుతుందేమో చూడాలి. అలా పార్టీని ఐక్యంగా ఉంచడంలో విఫలమైన రాజస్థాన్‌‌, మధ్యప్రదేశ్‌‌, చత్తీస్‌‌గఢ్​లలో ఫలితాలు  పార్టీకి ఎలా వికటించాయో  కాంగ్రెస్‌‌  లోపల, బయట అందరికీ తెలుసు. 

- దిలీప్‌‌రెడ్డి, పొలిటికల్‌‌ అనలిస్ట్‌‌,  పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ