Good Morning : కోల్డ్ కాఫీ అంటే ఏంటీ.. ఎలా తయారు చేస్తారు.. కోల్డ్ కాఫీ ఆరోగ్యకరమేనా..!

ఒకప్పుడు నిద్రలేవడంతోనే... .. వేడివేడి కాఫీ కావాలని అరిచేవాళ్లు. ఉదయం ఒకసారి తాగి, మళ్లీ సాయంత్రం ఇంట్లో లేదా ఆఫీసులో ఇంకో కప్పు గొంతులో పడాల్సిందే. అయితే ఇప్పుడు వేడివేడి కాఫీ పోయి చల్లచల్లటి కాఫీ తాగే రోజులొచ్చాయి. మామూలుగానే కాఫీ గింజల్లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి కాఫీ గింజలను ఈ కోల్డ్ కాఫీ తయారీలో ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల... ఈ కాఫీ చిక్కగా, తక్కువ చేదుగా ఉంటుంది. కోల్డ్ కాఫీ రేటు ఎక్కువైనా వెనక్కి తగ్గట్లేదెవరూ. ఇందులో బెస్ట్ కాఫీ, కోల్డ్ బ్రూ అని రెండు రకాలుంటాయి.

అసలు ఏంటీ కోల్డ్ కాఫీ?

చల్లచల్లగా ఉన్న కోల్డ్ కాఫీ తాగితే చాలు..ఉక్కపోతలోనూ చిల్ చేస్తూ ఎనర్జీనీ అందిస్తుంది. అలా కాఫీపై జనాలకున్న ఇష్టమే రెస్టారెంట్లలో కాఫీకి డిమాండ్​ పెంచింది. దానివల్ల రెస్టారెంట్లు కూడా రోజుకో కొత్తరకం కాఫీని తయారు చేసి అమ్ముతున్నాయి. అందులో ముఖ్యంగా రెండు రకాలుంటాయి. బెస్ట్ కాపీ, కోల్డ్ బ్రూ. ఈ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఆ రెండూ వేరువేరు.

Also Read:-చలికాలంలో దగ్గు తగ్గడం లేదా.. ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి..!

ఎలా తయారు చేస్తారు?

ఐస్డ్​ కాఫీ తయారీ చాలా సింపుల్​ గా ఉంటుంది. మామూలు వేడి కాఫీ చల్లారాక, అందులో కొన్ని ఐస్ ముక్కలు వేస్తే దాన్నే 'ఐస్డ్​ కాఫీ' అంటారు. కానీ కోల్డ్ బ్రూ తయారీకి చిన్నప్రాసెస్ ఉంటుంది. నీళ్లలో కాఫీ గింజల పొడి వేసి, పన్నెండు గంటలు ఉంచుతారు.
తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. అయితే వేడి చేయకుండా మిశ్రమాన్ని ఫ్రీజ్లో పెట్టి కూల్ చేయాలి. లేదంటే నాలుగు ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు కాఫీ పొడిని నానబెట్టడం వల్ల... కాఫీలోని చక్కెరశాతం మిశ్రమానికి అందుతుంది. అందుకే కోల్ట్ కాఫీ ఎక్కువ చేదు అనిపించదు.

ఏది ఆరోగ్యకరం?

కోల్ట్ బ్రూతో పోలిస్తే ఐస్డ్​ కాఫీలో కెఫిన్ శాతం తక్కువ. కాబట్టి రెగ్యులర్ తాగేవాళ్లు ఐస్డ్​ కాఫీని ఎంచుకోవడం మంచిది. కానీ కోల్డ్ బ్రూ త్వరగా జీర్ణమవ్వడం వల్ల అసిడిటీ సమస్య ఉండదు. ఇవి కాకుండా మిగతా లాభాలన్నీ రెండింట్లో సమానంగా ఉంటాయి.

– వెలుగు, లైఫ్​–