రామాయణం అనగానే మనకు స్ఫురణకు వచ్చే నగరాలు ఒకటి అయోధ్య, రెండోది మిథిల! మొదటిది రామచంద్రుడు పుట్టిన చోటు.. రెండోది జనకుడు-రత్నమాలలకు అయోనిజ సీతమ్మ దొరికిన చోటు! మైథిలి పుట్టినిల్లు! ఆ మిథిలానగరంలో సీతానవమి ( మే 16) వేడుకలు వైభవంగా జరుగుతాయి. అప్పట్లో మిథిలా రాజ్యం బిహార్ నుంచి నేపాల్ వరకు విస్తరించి ఉండేది. ఈ రాజ్యాన్నే విదేహ రాజ్యం అని కూడా అనేవారట! సీతామాతకు వైదేహి అన్న పేరు ఈ కారణంగానే వచ్చింది. ఆ జనకుడి రాజధానే నేపాల్‌లో ఉన్న జనక్‌పురి!
బీహార్ రాష్ట్రంలో గంగా నదికి ఉత్తరాన అవతలి తీరంలో ఉన్న 19 జిల్లాలు, నేపాల్ భూభాగాన్నంతా కలిపి మిథిలాంచల్‌గా పిలిచేవారు. అక్కడ వైశాఖ శుద్ధ నవమిని సీతా నవమిగా జరుపుకుంటున్నారు. ఆ రోజు సీతమ్మ పుట్టినరోజు. లోక పావని సీతాదేవి శ్రీరాముడి భార్యగానే తెలుసు, కానీ మిథిలాంచల్ ప్రజలకు మాత్రం ...ఆమె వారికి తల్లి, కూతురు, సోదరి, ఆడపడచు.
జానకీమందిరం నిర్మించిన చోటునే సీతాదేవి శివధనస్సును పూజించిందట.. సీతారాముల వివాహమహోత్సం జరిగింది కూడా ఇక్కడేనట.. అందుకే ఆలయ నైరుతి భాగాన పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు. మనం సీతారామకల్యాణాన్ని చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకుంటాం కదా.. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఆ రోజునే ఆదిదేవుడైన రాముడికి… ఆదిలక్ష్మి అయిన సీతమ్మకు పెళ్లయిందన్నది ఇక్కడి ప్రజల నమ్మకం. ఆలయంలో సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటాయి.. రోజూ కొన్ని వేలమంది భక్తులు ఆలయ సందర్శనకు వస్తుంటారు. శ్రీరామనవమి, సీతానమమి విజయదశమి, సంక్రాంతి, వివాహ పంచమి పండుగలప్పుడు అయితే భక్తులు కిటకిటలాడుతుంటారు
మనకు ఎంతసేపూ అయోధ్యనే గుర్తుకొస్తుంది తప్ప జనక్‌పురిని తల్చుకోము! ఇప్పుడే కాదు.. అప్పట్లోనూ అంతే.... సీతాదేవి పుట్టిన చోటును అక్కడి జనం కూడా పట్టించుకోలేదు.. అయితే 1657లో సుర్కి శూర్‌దాస్ అనే సన్యాసికి ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించాయి.. అప్పట్నుంచి తమ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గమనించసాగారు.. 1910లో నేపాల్ రాణి అయిన వృషభాను ఇక్కడ జానకీమందిరాన్ని నిర్మించారు. వేల గజాల విస్తీర్ణంలో…150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. పాలరాతి గోడలు.. అద్దాల మేడలు ప్రత్యేకం.. అప్పట్లోనే ఆలయ నిర్మాణానికి తొమ్మిది లక్షల రూపాయల వ్యయం అయ్యిందట! అందుకే ఈ మందిరాన్ని నౌ లాఖ్ మందిర్ అని పిలుచుకుంటారు.