రుద్రాక్ష రూపంలో శివలింగం ఎక్కడుందో తెలుసా.. 

లోక కల్యాణం కోసం  పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాలలో  ముక్తేశ్వరం  ఒకటి. ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతోన్న అయినవిల్లికి ఒక కిలోమీటరు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ స్వామి ముక్తేశ్వరుడు పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడు.ముక్తేశ్వర ఆలయం కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం...

ఈ ముక్తేశ్వర ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం రెవెన్యూ విభాగంలో అయినవిల్లి మండలం, కోనసీమ డెల్టాలో ఉంది. ఇది గోదావరి నదికి దగ్గరలో ఉన్న గౌతమి గోదావరి నదికి సమీపంలో ఉంది. కోనసీమకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. పచ్చటి ప్రకృతి, పంటకాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు గోదావరి నది ఒడ్డు, ఇలా ఎన్నో అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం.

ముక్తేశ్వర ఆలయం ఒక పురాతన ఆలయం. పురాణాల ప్రకారం  ముక్తేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు. ఒక దానికెదురుగా ఒకటిగా రెండు శివాలయాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.మొదట ఎదురుగా ఉండే దేవాలయంలో ఉన్న దేవున్ని క్షణ ముక్తేశ్వరుడు అని పిలుస్తారు.

రుద్రాక్ష రూపంలో శివలింగం 

 ముక్తేశ్వరాలయంలో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది.  ప్రసిద్ది చెందిన శివుని ఆలయాల్లో శ్రీముక్తికంఠ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఒకటి.  స్థల పురాణం ..ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో... శ్రీలంక నుండి పుష్పకవిమానంలో ఈ ప్రదేశం చేరుకోగానే అక్కడ ప్రకాశించే ఈ శివలింగాన్ని చూశాడని పురాణాలు చెబుతున్నాయి.   వెంటనే ఆ శివలింగానికి పూజలు చేసి ఆ పరమేశ్వరుడిని అక్కడే కొలువై ఉండాలని కోరగా...  శ్రీరాముడి భక్తికి ఆ పరమశివుడు ఇక్కడే కొలువైనాడనికి ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  ఈ క్షేత్రంలోని 'ముక్తేశ్వరుడు' శ్రీరాముడి కాలానికంటే ముందు నుంచే కొలువై వున్నాడని పురాణ  గ్రంధాలు చెబుతున్నాయి.

ALSO READ :- పంచరామాలు.. అరుదైన శివాలయాలు

రామాయణం ప్రకారం....శ్రీరామచంద్రుడు కూడా ఈ స్వామిని సేవించాడని చెబుతుంటారు. శ్రీరాముడు ప్రార్ధించిన వెంటనే స్వామి క్షణకాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడట. అందువలన ఇక్కడి స్వామివారిని 'క్షణముక్తేశ్వరుడు' అనే పేరుతోనూ భక్తులు పిలుచుకుంటారు. దర్శన మాత్రం చేతనే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక, సోమవారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను ఈ క్షేత్ర దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.