సోషల్​ ఆడిట్​ డైరెక్టర్​ నియామకం ఎప్పుడు?

  • ఏడాదిన్నరగా ఖాళీగా పోస్టు
  • నిబంధనల ప్రకారం 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి  
  • కొంత కాలంగా ప్రభుత్వ అధికారులతోనే కొనసాగింపు
  • నోటిఫికేషన్​తో సరిపెట్టిన గత బీఆర్ఎస్  ప్రభుత్వం 
  • గవర్నింగ్  బోర్డుకూ ముగిసిన గడువు 
  • కొత్త బోర్డు నియామకంలో జాప్యం 

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకంలో పారదర్శకత, జవాబుదారీ పెంపొందించడంతోపాటు ప్రజలను భాగస్వాములను చేసేందుకు తెలంగాణ సామాజిక తనిఖీ సంస్థ (ఎస్ఎస్ఏఏటీ, సాట్) ను ఏర్పాటు చేశారు. 2009 నుంచి సాట్  మనుగడలోకి వచ్చింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఉపాధి హామీ పథకంలో పనులు, నిధులు, కూలీలకు చెల్లింపులు తదితర అంశాలపై సామాజిక తనిఖీలు నిర్వహించి ప్రజల సమక్షంలోనే వివరాలను ఈ సంస్థ బహిర్గతం చేస్తుంది. గ్రామంలోనే సామాజిక తనిఖీ వేదిక ఏర్పాటు చేసి గ్రామంలో ఏ పనులు చేపట్టారు? ఎన్ని నిధులు ఖర్చు చేశారు? కూలీల పనిదినాలు తదితర అంశాలపై క్షుణంగా పరిశీలించి అవకతవకలు జరిగితే చర్యలకు ప్రభుత్వానికి సిఫారస్సు చేస్తుంది.

 అయితే, ఈ సామాజిక తనిఖీ సంస్థకు రాష్ట్రంలో డైరెక్టర్  ఉంటారు.  డైరెక్టర్ పర్యవేక్షణలోనే సామాజిక తనిఖీలు జరుగుతాయి. అంతేకాకుండా సంస్థకు సంబంధించిన నిర్ణయాలు, నిధులు, నియామకాల విషయంలో డైరెక్టర్  స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. సామాజిక, స్వచ్ఛంద సేవకులను, సామాజికవేత్తలను కూడా నియమిస్తారు. అయితే, ఏడాదిన్నరగా డైరెక్టర్  పోస్టు ఖాళీగా ఉంది.  నిబంధనల ప్రకారం 6 నెలల్లో భర్తీ చేయాలి. 

అయితే, కాంట్రాక్టు ప్రాతిపదికన సాట్  డైరెక్టర్  నియామకానికి  2023 అక్టోబర్ లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్  జా చేయడంతో పాటు పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది.  తర్వాత  ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ పెండింగ్ లోనే ఉండిపోయింది. కాగా.. గత బీఆర్ఎస్  ప్రభుత్వం సామాజిక తనిఖీ సంస్థను నీరుగార్చే ప్రయత్నం చేసిందనే ఆరోపణలు వచ్చాయి.  

కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆశలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాట్ డైరెక్టర్  నియామకం కోసం గత  ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దుచేస్తూ ప్రకటన జారీ చేసింది.  2023 అక్టోబర్ 5న సాట్  డైరెక్టర్  పోస్టు భర్తీకి జారీచేసిన ప్రకటనను పరిపాలనాపరమైన కారణాలతో రద్దుచేశామని ఈ నెల 26న ప్రకటించింది. దీంతో డైరెక్టర్  నియామకంపై ఆశలు చిగురిస్తున్నాయి. 

ఉపాధి హామీ పథకానికి వెన్నెముకగా నిలిచే సామాజిక తనిఖీ సంస్థకు డైరెక్టర్ ను నియమిస్తే  క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెరగడంతోపాటు పథకం పక్కదారి పట్టకుండా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో పనికి ఆహార పథకం అమలు చేసినప్పుడు సామాజిక తనిఖీ వేదిక లేకపోవడంతో 85 శాతం పథకం పక్కదారి పట్టిందని ఆరోపణలున్నాయి. సామాజిక తనిఖీ వేదిక ఏర్పాటుతో ఉపాధిహామీ పథకంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమమ్యాయి.

సోషల్ సర్వీస్  చేసేవారికి ప్రాధాన్యమివ్వాలి 

సోషల్  ఆడిట్  డైరెక్టర్  లేకపోవడంతో సామాజిక తనిఖీ వ్యవస్థపై పర్యవేక్షణ కొరవడింది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొంది.  ఉపాధిహామీ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరకపోవడంతో పాటు సామాజిక తనిఖీ వ్యవస్థ నీరుగారిపోయే అవకాశం ఉందని పలువురు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, డైరెక్టర్ గా ప్రభుత్వ అధికారులను నియమిస్తే పారదర్శకత లోపిస్తుందని పేర్కొంటున్నారు. 

దీనివల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు. పథకంలో అవకతవకలు జరిగినప్పుడు, కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో కొంత సమస్యలు ఎదురవుతాయనే వాదనలు ఉన్నాయి. అదే సామాజికవేత్తలు, సోషల్  సర్వీస్ చేసేవారిని నియమిస్తే పారదర్శకంగా వ్యవహరించే ఆస్కారం ఉంటుందంటున్నారు. 

సిబ్బంది నియామకంలో జాప్యం  

సామాజిక తనిఖీ సంస్థకు గవర్నింగ్  బోర్డు ఉంటుంది. డైరెక్టర్ తో పాటు  దాదాపు 10 నుంచి 15 సభ్యులు ఉంటారు. ఈ బోర్డు కనీసం ఏడాదికి ఒకసారైనా సమావేశం కావాల్సి ఉంటుంది. కానీ, ఐదారేండ్లుగా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. దీంతో సంస్థకు సంబంధించిన రిక్రూట్ మెంట్, వ్యవస్థాగతమైన నిర్ణయాలు, నిధుల విషయంలో జాప్యం జరుగుతోంది. అంతేకాదు, గవర్నింగ్  బోర్డులో మూడేళ్లకోసారి సభ్యులు మారడం, ఉన్నవారిని కొనసాగించడం చేస్తారు. 

కానీ, గడువు ముగిసినా బోర్డులో  నియామకాలపై స్పష్టత లేదు. నేటికీ పాత సభ్యుల వివరాలే బోర్డుపై దర్శనమిస్తున్నాయి. గవర్నింగ్  బోర్డు లేకపోవడంతో సిబ్బంది నియామకానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంస్థలో అవసరమైన సిబ్బందిని తీసుకోవాలంటే ప్రభుత్వానికి నివేదిక పంపించి భర్తీ చేసుకోవాల్సి వస్తుందని, ఈ క్రమంలో జాప్యం జరుగుతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతున్నది.