పత్తిరైతుకు మద్దతు లభించేదెప్పుడు?

ప్రస్తుతం మార్కెట్లో  ప్రతి వస్తువు ధర పెరుగుతోంది.  రైతు వద్దకు వచ్చేసరికి వారు ఎంతో కష్టపడి పండించే పంటకు మాత్రం సరైన ధర లభించడం లేదు. దీనికి కారణమేంటి?  రైతుల కష్టానికి విలువ లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  పదేండ్ల క్రితం వరకు ఎడ్లబండ్లతో దుక్కి దున్ని  పంటలు పండించేవారు. ఇప్పుడు పూర్తిగా యాంత్రీకరణతో పరిస్థితులు మారిపోయాయి. ఎరువుల ధరలు పెరిగాయి. పురుగు మందుల ధరలు పెరిగాయి.

యాంత్రీకరణ  పుణ్యమా అని వాటి ధరలు కూడా పెరగడంతో వ్యవసాయానికి పెట్టుబడి భారంగా మారింది.  ఇప్పుడు పొలాల్లో కూలిపనికి వచ్చేవారు తగ్గిపోయారు. అయినా,  రైతులు మొక్కవోని ధైర్యంతో  దేశానికి అన్నం పెట్టడానికి పొలాన్నే నమ్ముకుంటున్నాడు. ఈ సమయంలో విత్తనం నాటిన నుంచి పూర్తిగా చేతికొచ్చేవరకు చేసే కష్టానికి రైతే  బాధ్యుడవుతున్నాడు. కానీ, ఆయన పండించే పంటకు మాత్రం ధర నిర్ణయించుకునే దిక్కులేని పరిస్థితి.  దీంతో రైతు బతుకు ఏటా అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతోంది. ప్రభుత్వాలు ఏటా మద్దతు ధర ప్రకటిస్తున్నా అది రైతులకు పూర్తిస్థాయిలో దక్కని పరిస్థితి.  ఆసియాలోనే  తెలంగాణలోని వరంగల్,  ఆదిలాబాద్  పత్తి పంటకు భారీ ఆదరణ ఉంది. మరి అలాంటి పత్తి పండించే  రైతుకు మాత్రం ఎందుకు మద్దతు లభించడం లేదు?

పత్తి సాగులో తెలంగాణ మూడోస్థానం

మన దేశం ప్రపంచంలోనే పత్తి సాగులో మూడో స్థానంలో ఉంది. అదేవిధంగా  తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో పత్తి సాగులో మూడో స్థానంలో ఉంది.  మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఆసియాలోనే డిమాండ్ ఉన్న తెలంగాణ పత్తి గురించి అందరూ చెప్పుకుంటున్నా దాన్ని సాగు చేస్తున్న రైతుకు మాత్రం సాయం దక్కడం లేదు. దీనికి కారణం పత్తి సాగు చేస్తున్న రైతులకు ఏటా మద్దతు ధర ప్రకటించడం వరకే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అది కూడా కంటితుడుపు చర్యగానే చెప్పుకోవచ్చు.

Also Read : కులగణనే పరిష్కారం

పత్తిపంట సాగు చేసేందుకు వీరికి కౌలు రూపంలో అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి.  పంట అమ్ముకుందామంటే మార్కెట్లో తేమ, గూడు, రంగు మారిందని సీసీఐ కొనుగోలుకు ఆదిలోనే నిరాకరించడం రైతుల కష్టాన్ని దళారుల పాల్జేయడానికేనన్నట్లు తయారైంది. తేమ 8 నుంచి 12 శాతం లోపు ఉంటేనే కొంటామని చెప్పడం, అది కూడా మద్దతు ధర రూ.7,525గా నిర్ణయించడంతో  రైతులు వర్షానికి తడిసిన పత్తిని సీసీఐకి అమ్మలేక, ఇంటికి తీసుకెళ్లలేక చివరకు వ్యాపారులు నిర్ణయించిన ధరకే  విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. 

ధర నిర్ణయించుకునే అధికారం కావాలి

ఈ ఏడాది రాష్ట్రంలోని నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ఖమ్మంతోపాటు ఇతర జిల్లాల్లో అధికంగా పత్తిపంట సాగు చేశారు. మిగతా జిల్లాల్లో కాస్త తక్కువగానే పత్తిపంట సాగైందని వ్యవసాయ శాఖ చెబుతున్న సమాచారం. ఈ ఏడాది పత్తిపంట ఆరంభంలోనే పత్తి విత్తనాల ధర పాకెట్​పై 50 రూపాయలు పెంచి అమ్మేయడంతో ఒక ప్యాకె ట్ ధర 760 రూపాయలు పలికింది. ఇక రాశి 659 వంటి పత్తి విత్తనాలను వ్యాపారులు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడంతో 900 రూపాయలకు ప్యాకెట్​ను రైతులు కొనాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో కార్పొరేట్ వ్యాపారులు ఎలా అయితే తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించి అమ్ముకోగలుగుతున్నారో అలాగే ప్రభుత్వం రైతుల పంటకు కూడా ధర నిర్ణయించి విక్రయించుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.  రైతు వద్దకే వచ్చి పంట కొనుగోలు చేసే రోజులు రావాలి.  

Also Read : అవే అడుగుజాడలా?

ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ అంటూ ఆర్భాటపు ప్రచారాలు కాకుండా రైతులకు ఏది అవసరమో,  పంట అమ్ముకునేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటే వారికి లాభసాటిగా ఉంటుందో చూడాలి.  నష్టమొస్తే దాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.  అప్పుడే  పత్తి రైతు నిలదొక్కుకోగలడు.

-  వామన్ మామిళ్ల, సీనియర్ జర్నలిస్ట్-